పోలింగ్ ఇయ్యాల్నే: మొత్తం ఓటర్లు 53,50,255 మంది

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోల్​ టైమ్​
2,647 వార్డులు, 324 డివిజన్లలో ఓటింగ్
గ్రేటర్‌లో డబీర్‌పురా డివిజన్‌కు ఉప ఎన్నిక
మున్సిపాల్టీల్లో 11,179, కార్పొరేషన్లలో 1,747 మంది పోటీ
ఓటు మరెవరో వేసి ఉంటే టెండర్​ ఓటుకు అనుమతి
టెండర్‌ ఓటు పోలైన చోట రీపోలింగ్‌

హైదరాబాద్‌, వెలుగుమున్సిపల్​ ఎన్నికల పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లలోని 2,647 వార్డులు, 324 డివిజన్లకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్​ జరగనుంది. జీహెచ్‌ఎంసీలోని డబీర్‌పురా డివిజన్​కు కూడా బుధవారమే ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. మున్సిపాల్టీల్లో 11,179 మంది, కార్పొరేషన్లలో 1,747 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 25న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నాగిరెడ్డి చెప్పారు. మున్సిపల్​ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరైనా ఓటర్‌ పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లే సరికి అతడి ఓటు మరెవరో వేసి ఉంటే టెండర్‌ ఓటు డిమాండ్‌ చేయాలని సూచించారు. టెండర్‌ ఓటు పడిందంటే ఆ బూత్‌లో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించి రీపోలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్‌ సమయం ముగిసేలోపు క్యూలైన్‌లో నిల్చున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు.  ఓటర్‌ స్లిప్‌తో పాటు ఎన్నికల సంఘం గుర్తించిన ఏదో ఒక ఐడెంటిటీ కార్డుతో ఓటు వేయవచ్చని చెప్పారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచిన అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను తప్పుగా చూపితే కోర్టు కేసులతో సంబంధం లేకుండా వారిపై వేటు పడుతుందని నాగిరెడ్డి హెచ్చరించారు. తప్పుడు లెక్కలు చూపితే అతడి ఎన్నికను రద్దు చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉందన్నారు. భైంసాలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని, స్థానికంగా ప్రశాంత వాతావరణం నెలకొనడంతో పోలింగ్‌ నిర్వహణకు సిద్ధమయ్యామన్నారు.

మొత్తం ఓటర్లు 53,50,255 మంది

120 మున్సిపాల్టీలు, పది కార్పొరేషన్లలో జనవరి 22 నాటికి 53,55,942 మంది ఓటర్లున్నట్టుగా గుర్తించగా, వారిలో 5,687 మందిని ఏడీఎస్‌ (అబ్సెంటీస్‌, డెత్‌, షిఫ్టెడ్‌) పద్ధతిలో ఫైనల్‌ జాబితా నుంచి తొలగించినట్టుగా నాగిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 128 మున్సిపాల్టీలు, 13 కార్పొరేషన్లు ఉండగా, 120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లకు ఈ నెల 7న నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికకు 9న నోటిఫికేషన్‌ ఇవ్వగా, శుక్రవారం పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. మొత్తం 2,727 వార్డులు, 385 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 80 వార్డులు, మూడు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయని, మిగతా 2,647 వార్డులు, 382 డివిజన్లలో పోలింగ్‌కు పూర్తి ఏర్పాట్లు చేశామని తెలిపారు.

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు 55 వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని, పోలింగ్‌కు 45 వేలు, కౌంటింగ్‌కు పది వేల మంది సిబ్బంది సేవలు వాడుకుంటామని నాగిరెడ్డి చెప్పారు. 50 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామన్నారు. 2,406 పోలింగ్‌ స్టేషన్ల నుంచి వెబ్‌ కాస్టింగ్‌, 2,072 బూత్‌లలో వీడియో రికార్డ్‌ చేస్తున్నామని, 2,053 బూత్‌లలో మైక్రో అబ్జర్వర్లు ఉండి మొత్తం పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తారని నాగిరెడ్డి తెలిపారు.

see also:ఓటేస్త..నాకేంటి? : డిమాండ్​ చేసి మరీ పైసలు

Latest Updates