టోక్యోలో తుపాను బీభత్సం.. తీరానికి కోత

వణికిస్తున్న పెనుగాలులు

జపాన్​ను తాకిన పెను తుఫాను

జలమయంగా మారిన వీధులు

టోర్నడో దెబ్బకు బోల్తా కొట్టిన కారు

ఫుజిసావా(జపాన్):

కుండపోతగా కురుస్తున్న వర్షానికి జపాన్​ వణికిపోతోంది.. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం అయ్యాయి. అరవై ఏళ్లలో కనీవినీ ఎరగని తుఫాను విరుచుకుపడనుందని వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. టైపూన్​ హగిబిస్​ గంటకు 35 కిలోమీటర్ల వేగంతో టోక్యో, నార్త్​ జపాన్​ వైపు కదులుతోందని చెప్పారు. తుఫాను ప్రభావంతో టోక్యోతో పాటు చుట్టుపక్కల నగరాల్లో కుంభవృష్టి కురుస్తోందని వివరించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వార్నింగ్‌ ఇచ్చారు. నదులకు దగ్గర్లో ఉన్నవారు వరద సహాయక శిబిరాలకు చేరుకోవడం సాధ్యం కాకుంటే గ్రౌండ్​ ఫ్లోర్​ వదిలి ఫస్ట్​ ఫ్లోర్​లో ఉండాలని సూచించారు. వారం ముందు నుంచే హెచ్చరికలు జారీ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు ఆహార పదార్థాలు, మంచినీటిని స్టోర్​ చేసుకున్నారు. శనివారం వర్షం విడవకుండా కురుస్తుండడంతో వీధులు, బస్, రైల్వే స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. టోక్యో, ఒసాకాల మధ్య నడిచే బుల్లెట్​ ట్రైన్​ సహా పలు రైళ్లు, విమానాలను అధికారులు రద్దు చేశారు.

పెనుగాలులకు కారు బోల్తా.. ఒకరి మృతి

తుఫాను విరుచుకుపడడానికి ముందు సముద్రంలో భూకంపం సంభవించిందని, చిబా తీరానికి దగ్గర్లో సముద్రంలో 59.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అధికారులు చెప్పారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్​ స్కేలుపై 5.3గా నమోదైందని తెలిపారు.చిబా సిటీలో గాలి తుఫాను విధ్వంసం సృష్టించింది. పెను గాలులకు రోడ్డు మీద వెళుతున్న కారు తలకిందులైంది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తుఫాను ప్రభావంతో జరిగిన తొలి మరణం ఇదేనని అధికారులు చెప్పారు. టోర్నడో​ ఓ ఇంటిని చుట్టుముట్టడంతో అందులోని ఐదుగురు గాయపడ్డారు. తుఫాను కారణంగా మొత్తం 19 నగరాల్లో ఒకరు చనిపోగా, 51 మంది గాయపడ్డారు, మరో నలుగురు గల్లంతయ్యారని​ అధికారులు వెల్లడించారు.

పలు కార్యక్రమాలు రద్దు

తుఫాను ప్రభావంతో రగ్బీ వరల్డ్​ కప్​ మ్యాచ్​లు రద్దయ్యాయి. దీంతోపాటు ఫార్ములా వన్​ క్వాలిఫైయింగ్​ రేస్, పలు కన్సర్ట్స్, ఇతర కార్యక్రమాలను కూడా నిర్వాహకులు రద్దు చేశారు. సోమవారం జరగాల్సిన స్పోర్ట్స్​డే ఈవెంట్​ కూడా రద్దయినట్లేనని సమాచారం. ఏటా మూడు రోజుల పాటు జరగాల్సిన నేవీ రివ్యూను రక్షణ శాఖ ఒక్కరోజుకు కుదించింది.  టోక్యో డిస్నీలాండ్, గింజా డిపార్ట్​మెంట్​ స్టోర్స్ లతో పాటు పలు దుకాణాలు మూతపడ్డాయి. 1958లో టోక్యో రీజియన్​పై విరుచుకుపడ్డ పెను తుఫాను వల్ల 1200 మందికి పైగా చనిపోయారు, దాదాపు 5 లక్షల ఇళ్లు నేలమట్టమయ్యాయి.

రెస్క్యూ కోసం 17 వేల మంది సైనికులు

సముద్రం అల్లకల్లోలంగా మారింది.. ఎగిసిపడుతున్న అలలకు తీరంలో లంగరు వేసిన బోట్లు తలకిందులయ్యాయి. తీరం కోతకు గురైందని, తీరప్రాంతంలోని పలు ఇండ్లలోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చిందని అధికారులు చెప్పారు. కొన్నిచోట్ల మోకాలి లోతు నీరు చేరిందని అన్నారు. కనగవా సిటీలోని షిరొయమా డ్యాం సహా పలుచోట్ల ఉన్న డ్యాంల గేట్లను ఓపెన్​ చేసి అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. వర్షపు నీటితో డ్యాంలు నిండిపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ముందు జాగ్రత్త చర్యగా కొద్దికొద్దిగా నీటిని వదులుతున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ మెజర్స్​లో భాగంగా 17 వేల మంది మిలటరీ ట్రూపులను ​రెస్క్యూ కోసం సిద్ధం చేసినట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది.

Latest Updates