కరోనా దెబ్బ.. ఒలింపిక్స్ 2021కి వాయిదా

టోక్యో:  ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ వాయిదా పడ్డాయి. టోక్యోలో ఈ ఏడాది జరగాల్సిన విశ్వక్రీడలను వచ్చే ఏడాదికి పోస్ట్‌‌‌‌‌‌‌‌పోన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ కమిటీ (ఐఓసీ), ఆతిథ్య జపాన్‌‌‌‌‌‌‌‌ మంగళవారం  ప్రకటించాయి. జపాన్‌‌‌‌‌‌‌‌ ప్రధాని షింజో అబెతో  ఐఓసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ థామస్ బాచ్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.   షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ప్రకారం జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరిగే గేమ్స్‌‌‌‌‌‌‌‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని షింజో  ప్రతిపాదించగా.. బాచ్‌‌‌‌‌‌‌‌ అందుకు  ఒప్పుకున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌‌‌‌‌‌‌‌ వరకూ పోటీలను వాయిదా వేస్తున్నట్టు ఉమ్మడి ప్రకటన వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా  ప్రస్తుత పరిస్థితిపై  వరల్డ్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ‘ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ను 2020 తర్వాతే నిర్వహించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో 2021 సమ్మర్‌‌‌‌‌‌‌‌లోపే వీటిని రీషెడ్యూల్‌‌‌‌‌‌‌‌ చేయాలి. అథ్లెట్ల ఆరోగ్యం, ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఇన్వాల్వ్‌‌‌‌‌‌‌‌ అయ్యే ప్రతి ఒక్కరిని, అంతర్జాతీయ సమాజాన్ని దృష్టిలో  ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం.  టోక్యోలో జరిగే ఈ గేమ్స్‌‌‌‌‌‌‌‌ ఇలాంటి  విపత్కర సమయంలో ప్రపంచానికి ఆశజనకంగా నిలవాలని నాయకులు ఒప్పుకున్నారు. అందుకే ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ ఫ్లేమ్‌‌‌‌‌‌‌‌ను టోక్యోలోనే ఉంచాలని నిర్ణయించారు. అలాగే, ఒలింపిక్‌‌‌‌‌‌‌‌, పారాలింపిక్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ పేరును టోక్యో 2020గానే కొనసాగించేందుకు ఒప్పుకున్నార’ని తెలిపింది. మనుషుల జీవితాలను రక్షించుకోవడం కోసమే గేమ్స్‌‌ను వాయిదా వేశామని థామస్‌‌ బాచ్‌‌ తెలిపారు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత టోక్యో ఆర్గనైజర్లు, ఒలింపిక్స్‌‌ను పర్యవేక్షించే ఐఓసీ ప్యానెల్‌‌తో కలిసి  కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.

ఒప్పుకోక తప్పలేదు

కరోనా ధాటికి ప్రపంచం మొత్తం వణికిపోతుండగా గేమ్స్‌‌‌‌‌‌‌‌ను వాయిదా వేయాలని చాన్నాళ్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అథ్లెట్లు, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్లతో పాటు దేశాధినేతలు కూడా ఈ సమయంలో  ఆటలు వద్దని సూచించారు. అయినా ముందుకెళ్లాలని భావిస్తూ వచ్చిన జపాన్‌‌‌‌‌‌‌‌, ఐఓసీ ఎట్టకేలకు తలొగ్గాయి. కెనడా, ఆస్ట్రేలియా ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం.. మిగతా దేశాలూ అదే బాటలో నడవాలని భావిస్తున్న నేపథ్యంలో ఐఓసీపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.  ప్రపంచ వ్యాప్తంగా ఆటలకు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పడడం, ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్స్‌‌‌‌‌‌‌‌ కూడా నిలిచిపోవడం, కనీసం అథ్లెట్లు ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ కూడా కొనసాగించలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ స్వయంగా ఆతిథ్య జపాన్‌‌‌‌‌‌‌‌ కూడా వాయిదాకే మొగ్గు చూపడంతో ఐఓసీకి మరో మార్గం లేకపోయింది. దాంతో,  1948 నుంచి నాలుగేళ్లకోసారి నిర్విరామంగా కొనసాగుతున్న ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు తొలిసారి అడ్డు తగిలింది. ఇది వరకు యుద్ధాల కారణంగా 1916, 1940, 1944లో మూడుసార్లు గేమ్స్‌‌‌‌‌‌‌‌ రద్దయ్యాయి. యూఎస్‌‌‌‌‌‌‌‌ఏ, సోవియట్‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌ మధ్య కోల్డ్‌‌‌‌‌‌‌‌వార్ కారణంగా 1980, 1984  గేమ్స్‌‌‌‌‌‌‌‌ను కొన్ని దేశాలు బాయ్‌‌‌‌‌‌‌‌కాట్‌‌‌‌‌‌‌‌ చేశాయి. 1972 గేమ్స్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా టెర్రరిస్ట్‌‌‌‌‌‌‌‌ అటాక్‌‌‌‌‌‌‌‌ జరిగింది. మరికొన్ని సార్లు నిరసన సెగలు, డోపింగ్‌‌‌‌‌‌‌‌ మరకలు తగిలాయి. కానీ, ఇలాంటివేవీ లేకుండా ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ తొలిసారి వాయిదా పడ్డాయి.

జపాన్‌‌‌‌కు భారీ నష్టం

ఒలింపిక్స్‌‌‌‌ వాయిదా వల్ల ఆతిథ్య జపాన్‌‌‌‌కు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. గేమ్స్‌‌‌‌ కోసం ఆ దేశం ఏకంగా 12.6 బిలియన్‌‌‌‌ డాలర్లు ఖర్చు చేస్తోంది. పోస్ట్‌‌‌‌పోన్‌‌‌‌ వల్ల ఇప్పుడు  జపాన్‌కు  కనీసం ఆరు బిలియన్‌‌‌‌ డాలర్ల నష్టం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం స్పాన్సర్లు, మేజర్‌‌‌‌ బ్రాడ్‌‌‌‌కాస్టర్లపై అధికంగా పడనుంది. ప్రకటనల రూపంలో వచ్చే భారీ ఆదాయాన్ని కోల్పోనున్నాయి. కాగా, ఒలింపిక్స్‌‌‌‌ విషయంలో ఇలాంటి ఎదురుదెబ్బ తగలడం టోక్యోకు ఇది తొలిసారి కాదు. 1940లోనే టోక్యో  ఈ మెగా ఈవెంట్‌‌‌‌కు ఆతిథ్యం ఇచ్చిన ఆసియా తొలి దేశంగా నిలవాల్సింది. కానీ, చైనాలో యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో ఆతిథ్యాన్ని వదులుకుంది. చివరకు ఆ గేమ్స్‌‌‌‌ రద్దయ్యాయి.

టార్చ్ రిలేకు బ్రేక్‌!

ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో జపాన్‌లో టార్చ్‌ రిలేను కూడా వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. షెడ్యూల్‌ ప్రకారం గురువారం ఫుకుషిమా నుంచి ఈ ర్యాలీ మొదలవ్వాల్సి ఉంది. అయితే, గేమ్స్‌ జరుగుతాయో లేదో ముందుగా స్పష్టత లేకపోవడంతో టార్చ్‌ లేకుండా, టార్చ్‌ బేరర్‌ లేకుండా, చూడ్డానికి  ప్రజలను అనుమతించకుండా ఒలింపిక్‌ జ్యోతిని ముందుకు తీసుకెళ్లాలని తొలుత నిర్వాహకులు భావించారు.   ఓ లాంతరులో ఒలింపిక్‌ జ్యోతిని ఉంచి కారులో దాన్ని  ఖాళీ రోడ్లపై  తీసుకెళ్లే ఆలోచన చేశారు.  ‘టార్చ్‌ రిలే’ పేరును ‘టార్చ్‌ విజిట్‌’ అని మార్చాలని కూడా భావించినా.. చివరకు గేమ్స్‌ వాయిదా పడుతున్నట్టు తమ ప్రధాని, ఐఓసీ ప్రెసిడెంట్‌ ప్రకటించడంతో
ఆ ఆలోచనలు విరమించుకున్నారు.

అథ్లెట్లకు ఉపశమనం: ఐఓఏ

ఒలింపిక్స్‌‌ వాయిదా నిర్ణయంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) హర్షం వ్యక్తం చేసింది.  దీంతో మన దేశ అథ్లెట్లను ఒలింపిక్స్ సన్నాహాల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ఐఓఏ స్పష్టం చేసింది. స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఐఓసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్  మెహ్తా చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో త్వరలోనే అథ్లెట్లు, ఫెడరేషన్లు, స్పాన్సర్లతో మీటింగ్ జరిపి రివైజ్ ప్లాన్లు వేస్తామన్నారు. ఐఓసీ నిర్ణయంతో ప్రస్తుతం నెలకొన్న కఠిన పరిస్థితుల్లో ట్రెయినింగ్ చేయాల్సిన అవసరం తప్పి వారికి ఉపశమనం లభించిందని అభిప్రాయపడ్డారు. ఐఓసీతోపాటు టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజర్లతో చర్చించాక రివైజ్ షెడ్యూల్ గురించి నేషనల్ స్పోర్ట్స్ అకాడమీలకు(ఎన్ఎస్ఏ) తెలియజేస్తామన్నారు. అథ్లెట్ల సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్ఎస్ఏలకు సూచించారు. కాగా, ఐఓసీ నిర్ణయాన్ని  వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ సహదేవ్ యాదవ్ కూడా స్వాగతించారు.

Latest Updates