టాలీవుడ్ అసలైన ట్రెండ్ సెట్టర్ : కోడి రామకృష్ణ

కోడి రామకృష్ణ.. ద కంప్లీట్ డైరెక్టర్ అనే పదానికి అసలైన డెఫినిషన్. కెరీర్ మొదటినుంచి చివరివరకు కూడా ఆయన డైరెక్టర్ గానే కొనసాగారు. యాక్షన్, సోషల్, వినోదం, పొలిటికల్, థ్రిల్లర్, జానపదం లాంటి… పలు జానర్లలో సినిమాలు తీసి.. సూపర్ డూపర్ హిట్లుకొట్టిన అసలు సిసలైన ట్రెండ్ సెట్టర్. ఓ జానర్ లో సినిమాలు తీస్తే.. అదే లైన్ లో కొన్ని సినిమాలుచేయడం.. మళ్లీ కొత్త ట్రాక్ తీసుకుని అందులో సినిమాలు చేయడం… ఇలా తనకు తానే సరికొత్తగా ఆవిష్కరించుకుని.. కొత్త సినిమాలు ఇండస్ట్రీకి పరిచయం చేసి… బ్లాక్ బస్టర్ హిట్లుకొట్టి.. టాప్ హీరోహీరోయిన్లకు బ్రేకులిచ్చి… కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని.. ఆడియన్స్ తో సరికొత్త వినోదం టేస్ట్ చేయించి.. శెభాష్ అనిపించుకుని.. థియేటర్లో చప్పట్లు కొట్టించి.. బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండించిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్, శత చిత్ర దర్శక యోధుడు కోడి రామకృష్ణ.

తెలుగులో ఎక్కువగా.. తమిళ్, మలయాలంలో కొన్ని సినిమాలు చేసిన కోడి రామకృష్ణ వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన అతికొద్దిమంది దర్శకుల్లో ఒకరు. ఆంధ్రప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు ఆయన సొంత ఊరు. ఇండస్ట్రీతో 40 ఏళ్లకు పైగా ఆయన అనుబంధం కొనసాగింది.

మెగాస్టార్ చిరంజీవికి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య. ఈ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు కోడిరామకృష్ణ. తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో సినిమాలు చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకత్వం వహించారు.

కోడి రామకృష్ణ.. మొదట్లో ఫ్యామిలీ తర్వాత పొలిటికల్.. ఆ తర్వాత ఫాంటసీ సినిమాల్ని సక్సెస్ గా మలిచాడు. దాసరి నారాయణరావు స్పూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన కోడి రామక్రిష్ణ… వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

కోడి రామకృష్ణ .. బాలక్రిష్ణకు బోలేడన్నీ హిట్స్ ఇచ్చారు. మంగమ్మవారి మనువడితో బ్రేక్ ఇచ్చారు కోడి రామక్రిష్ణ. ముద్దుల కృష్ణయ్య, ముద్దులమావయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మేనల్లుడు.. అనీ హిట్సే. భార్గవ్ ఆర్ట్స్ చిత్రాలలో ఎక్కువగా కోడి దర్శకత్వం వహించిన సినిమాలే కావడం విశేషం.

రాజశేఖర్ కు మంచి హిట్స్ ఇచ్చారు కోడిరామకృష్ణ. అంకుశం, అహుతి. తలంబ్రాలు సినిమాలు రాజశేఖర్ కెరీరల్ లోనే ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు.

సమకాలీన రాజకీయాలపై.. విమర్శలు, సెటైర్లతో చాలా సినిమాలు తీశారు కోడి రామకృష్ణ, ఇందులో ఎక్కువగా పోలీస్ బ్యాక్ గ్రౌండ్ గా ఉండేవి. భారత్ బంద్, భారతరత్న,  పోలీస్ లాకప్, రాజధాని, లాఠీ చార్జ్, సినిమాలు.. సమకాలీన రాజకీయాలపై కోడిరామకృష్ణ ఎక్కుపెట్టిన సినిమాలే.

స్త్రీ సమస్యలపై కూడా సినిమాల్ని ఎక్కుపెట్టారు కోడిరామకృష్ణ, అంతర్లీనంగా ఆడవాళ్ల సమస్యల్ని చెప్తూనే…సెటైర్లతో సినిమాలు తీసేవారు.

1990 ల్లో సౌందర్య మెయిన్ రోల్లో తీసిన అమ్మోరు కోడి రామక్రిష్ణ సినీ కెరీర్లో ఓ మైల్ స్టోన్ అనే చెప్పాలి. అమ్మోరు మూవీ నుంచే సినిమాల్లో గ్రాఫిక్స్ ను వాడడం మొదలైంది. తర్వాత దేవి, దేవీ పుత్రుడు, దేవుళ్లు వంటి డెవోషనల్ బ్యాక్ గ్రౌండ్ తో మంచి సక్సెస్ లు కొట్టారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన తీసిన అంజి సినిమా భారీ అంచనాల నడుమ.. ఆలస్యంగా విడుదలైంది. గ్రాఫిక్స్ బాగున్నా… ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

కోడి రామక్రిష్ణ దర్శకత్వం వహించిన అరుంధతి సినిమా జాతీయ స్థాయిలో సంచలన విజయం సాధించింది. తెలుగులో ఆ సినిమాలో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది. భారీ బడ్జెట్ తో తీసిన అరుంధతి… అంతే స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. అరుంధతి రోల్ చేసిన అనుష్కకు కెరీర్ బెస్ట్ బ్రేక్ ఇచ్చారు కోడి రామక్రిష్ణ.

తెలుగు సినీ ఇండస్ట్రీలో కోడి రామక్రిష్ణ ఓ ట్రెండ్ సెట్టర్ అంటారు. చిరంజీవి, రాజశేఖర్, బాలక్రిష్ణ, అర్జున్, వినోద్ కుమార్, జగపతిబాబు వంటి ఎంతో మందికి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు కోడి రామక్రిష్ణ.

దాసరి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూనే… కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు కోడి రామక్రిష్ణ. స్వర్గం నరకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘం నాయకునిగా వెండి తెరపై కనిపించారు కోడి రామక్రిష్ణ. ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే, మూడిళ్ల ముచ్చట, ఇంటిదొంగ, అత్తగారూ స్వాగతం, ఆస్తి మూరెడు ఆశ బారెడు, దొంగాట లాంటి సినిమాల్లో నటించారు. తొలిసారిగా ‘మా ఇంటికి రండి’ అనే సినిమాలో హీరోగా నటించారు కోడి రామక్రిష్ణ. ఈ సినిమాలో సుహాసిని హీరోయిన్.

బాలయ్యకు మంగమ్మగారి మనవడు, వెంకటేశ్ కు శ్రీనివాస కల్యాణం, రాజశేఖర్ కు అంకుశం, సుమన్ కు 20వశతాబ్దం, నవీన్ కు పెళ్లి, సౌందర్య-రమ్యకృష్ణలకు అమ్మోరు, అనుష్కకు అరుంధతి సినిమాతోపాటు.. ఇండస్ట్రీకి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు.

కొద్దిరోజులుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇండస్ట్రీలో 30 ఏళ్ల పాటు చెక్కుచెదరని సక్సెస్ లు కొట్టిన ఓ డైరెక్టర్ డెడికేషన్ ను సూచించే ఐకన్. జానర్ లు మార్చి… బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన ఓ ట్రెండ్ సెట్టర్ ను సూచించే సింబల్. నవతరానికి కావాల్సినంత ఉత్తేజం ఇచ్చే ఓ ఇన్ స్పిరేషన్ కోడి రామకృష్ణ.

Latest Updates