క్యాబినెట్ విస్తరణ: వీరికే సీఎం కేసీఆర్ ఫోన్!

అదే ఉత్కంఠ. అదే టెన్షన్. కొత్త కేబినెట్లో ఎవరికి బెర్త్ దక్కనుంది. ఎంతమందికి అమాత్య పదవి వరించనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు ఉదయం 11.30 కు రాజ్ భవన్లో మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. ప్రమాణ స్వీకారం చేయబోయే నేతలకు స్వయంగా ముఖ్యమంత్రే ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అయితే ఈ ఫోన్లు ఎవరికి వెళ్ళాయి… అనేది మాత్రం సీక్రెట్ గానే ఉంచుతున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల వారీగా వరంగల్ నుంచి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, కరీంనగర్లో కొప్పుల ఈశ్వర్ కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.

అధినేత నుంచి ఫోన్లు వచ్చిన నేతలు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు, నియోజక వర్గ ముఖ్య నేతలకు రేపు ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవాలని సూచించారు. అటు రాజ్ భవన్లో మంత్రుల ప్రమాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు GAD, ప్రొటోకాల్ అధికారులు. ఇప్పటికే ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి పాసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలకు, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లకు.. మంత్రుల ప్రమాణస్వీకారం కోసం ఇన్విటేషన్ పంపుతున్నారు GAD అధికారులు. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Latest Updates