మిస్ వరల్డ్ గా టోనీ ఆన్ సింగ్

లండన్‌‌: జమైకా సుందరి టోనీ ఆన్ సింగ్ మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. శనివారం లండన్ లోని ఎక్స్ సెల్ ఎగ్జిబిషన్ అండ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఫైనల్ పోటీలో ఆమె 2019 ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్నారు. 2018 మిస్ వరల్డ్, మెక్సికన్ భామ వనెస్సా పోన్స్ వేదికపై టోనీ సింగ్ కు కిరీటం తొడిగారు. ఫైనల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ లో ఐదుగురు కాంటెస్టెంట్లు పాల్గొన్నారు. బ్రిటిష్ బ్రాడ్ కాస్టర్ పియర్స్ మోర్గాన్ జడ్జిగా వ్యవహరించి, ఫైనలిస్టులకు ప్రశ్నలు వేశారు. మిస్ ఫ్రాన్స్ ఓఫ్లే మేజినో ఫస్ట్ రన్నరప్ గా సెకండ్ ప్లేస్ లో, మిస్ ఇండియా సుమన్ రావు సెకండ్ రన్నరప్ గా థర్డ్ ప్లేస్ లో నిలిచారు. ఇరవై మూడేళ్ల టోనీ ఆన్ సింగ్ జమైకాలోని మోరాంట్ బే పట్టణంలో జన్మించారు. ఆమె తండ్రి బ్రాడ్ షాతో కలిసి14 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చారు. యూఎస్ లో మెడికల్ స్కూల్ లో చదువుకున్నారు. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో సైకాలజీ, ఉమెన్ స్టడీస్ కోర్సులు కూడా పూర్తి చేశారు. చదువుతో పాటు సింగింగ్ లోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. మిస్ వరల్డ్ కిరీటం గెలవడానికి ముందు వేదికపైనా తన సింగింగ్ టాలెంట్ చూపించి, అందరినీ ఆకట్టుకున్నారు. చివరిసారిగా1993లో లిసా హన్నాంప్ జమైకా నుంచి మిస్ వరల్డ్ విజేతగా నిలిచారు. మిస్ వరల్డ్ కాంటెస్ట్ ను1951లో బ్రిటిష్​ టీవీ హోస్ట్ ఎరిక్ మోర్లీ స్థాపించారు. మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఇది 69వ సారి. ఈ ఏడాది నవంబర్ 20న పోటీలు ప్రారంభమయ్యాయి. 120 దేశాల నుంచి అందాలభామలు పాల్గొన్నారు. అనేక ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్ల తర్వాత చివరగా ఫైనల్ కు పది మందిని ఎంపిక చేశారు. వీరిలోంచి చివరిగా ముగ్గురు తుది విజేతలను  ప్రకటించారు.

Latest Updates