జస్టిస్ గొగోయ్ మరో కీలక తీర్పు: శబరిమల స్త్రీల ప్రవేశం తీర్పుపై రివ్యూ

  • అయోధ్య జడ్జిమెంట్ ఇచ్చిన 5 రోజులకే..
  • రాఫెల్‌ దర్యాప్తు రివ్యూపైనా తీర్పు

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా పరిష్కారం కాని అయోధ్య కేసులో కీలక తీర్పు ఇచ్చి అతి పెద్ద సమస్యకు ముగింపు పలికారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్. గట్టిగా ఐదు రోజులు తిరక్కుండా మరో సంచలన కేసులో రివ్యూ పిటిషన్‌పై తీర్పు ఇవ్వబోతున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం గురువారం తీర్పు వెల్లడించబోతోంది. నవంబరు 17న రిటైర్ అవ్వబోతున్న సీజేఐ.. సంచలనాలతో తన పదవికి ముగింపు చెప్పబోతున్నారు.


శబరిమలపై 2006 నుంచి నానుతున్న వివాదం
రుతుస్రావం వచ్చే దశలో ఉండే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న బాలికలు, మహిళలకు కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశంపై నిషేధం ఉండేది. ఆలయ సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న ఈ నియమం లింగ సమానత్వానికి విరుద్ధం, రాజ్యంగం ఇచ్చిన హక్కును ఉల్లంఘించడమే అంటూ 2006లో కొందరు మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత మరికొందరు ఇదే రకమైన పిటిషన్లతో కోర్టు మెట్లెక్కారు.
నాటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పు.. తీవ్ర నిరసనలు
ఆ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ తర్వాత 2018 సెప్టెంబరు 28న నాటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేసుకోవచ్చని, అది వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని నాడు తేల్చింది. లింగ వివక్షను అనుమతించలేమని, ఆలయ ప్రవేశంపై నిషేధం విధించడం వారికి ప్రాథమిక హక్కును కాలరాయడమే అవుతుందని స్పష్టం చేసింది. నాడు ఈ తీర్పుపై చాలా వివాదాలు రేగాయి. ఆలయ అర్చకులు, హిందూ సంఘాలు సహా పలు రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు కూడా ఆ తీర్పును వ్యతిరేకించాయి. అయ్యప్ప భక్తులు తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు. ఈ తీర్పును అమలు చేయడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. 2019 జనవరి 2న ఇద్దరు మహిళలు ఆలయ ప్రవేశం చేశారు. ఆ తర్వాత మరికొందరు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. కానీ దర్శనం చేసుకున్న మహిళల కుటుంబాల్లోనూ వారిపై వ్యతిరేకత వ్యక్తమైంది.


ధర్మాసనంలోని మహిళా జడ్జి వ్యతిరేకత..
నాడు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనంలోనే ఆ తీర్పుపై వ్యతిరేకత వచ్చింది. బెంచ్‌లో ఉన్న ఏకైక న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా మహిళలకు అయ్యప్ప ఆలయ ప్రవేశంపై నిషేధం ఉండాలని వ్యాఖ్యానించడం విశేషం. దేశంలో లౌకిక వాతావరణం కొనసాగాలంటే కోర్టులు మతపరమైన సంప్రదాయాల్లో కలగజేసుకోకపోవడం మంచిదని ఆమె అన్నారు. ‘సతీ సహగమనం’ లాంటి సామాజిక దురాచారాల్లో కోర్టు జోక్యం చేసుకోవచ్చు కానీ మత సంప్రదాయాలు ఎలా ఉండాలనేదాని మీద కోర్టుల ప్రమేయం తగదని చెప్పారు. మహిళలపై పూర్తిగా నిషేధం లేదని, కేవలం రుతుస్రావం దశలో ఉన్న వారిపైనే నిషేధం ఉందని, ఆ ఆలయ సంప్రదాయాన్ని గౌరవించాలని అన్నారు.
నాటి సీజేఐ తీర్పు.. నేటి సీజేఐ రివ్యూ
2018 సెప్టెంబరు 28న శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చంటూ నాటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ఇచ్చిన తీర్పుపై ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ధర్మాసనం రివ్యూ చేసి, తీర్పు ఇవ్వబోతోంది. ఫిబ్రవరిలోనే వాదనలు విన్న ధర్మాసనం జడ్జిమెంట్‌ను రిజర్వు చేసింది. నవంబరు 14న రివ్యూ పిటిషన్లపై తీర్పు ఇవ్వబోతోంది.

జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రంజన్ గొగోయ్

శబరిమలలో భారీ భద్రత ఏర్పాటు
ఇప్పటికే అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం కావడంతో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసింది కేరళ సర్కారు. మండల పూజ కోసం ఈ నెల 16వ తేదీ నుంచి అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తున్న దృష్ట్యా 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. 24 మంది ఎస్పీలు, ఏఎస్పీలు, 112 మంది డీఎస్పీలు,264 మంది ఇన్‌స్పెక్టర్లు, 1185 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 8,402 మంది సివిల్ పోలీసులు, 307 మంది మహిళా పోలీసులను అయ్యప్ప దేవాలయ కాంప్లెక్స్ వద్ద బందోబస్తు కోసం నియమించారు. అయితే అయోధ్య తీర్పును అన్ని వర్గాలు ఆహ్వానించినట్లే శబరిమల రివ్యూపైనా ఎలాంటి తీర్పు వచ్చినా అందరూ స్వాగతించాలని కేరళ దేవస్వం మంత్రి కోరారు.

రాఫెల్‌ రివ్యూపైనా తీర్పు
రాఫెల్ కొనుగోలు ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్ పైనా జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక తీర్పు ఇవ్వబోతున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలు ఒప్పందం రక్షణ రంగం చరిత్రలోనే అతిపెద్ద స్కాం అని, దానిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గత ఏడాది డిసెంబరులో కొట్టేసింది. రాఫెల్ ఒప్పందంపై క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై రివ్యూ మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీన్ని విచారించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం తీర్పు ఇవ్వబోతోంది. రైటైర్‌మెంట్‌కు ముందు అయోధ్య కేసు, శబరిమల, రాఫెల్ లాంటి సంచలన తీర్పులతో జస్టిస్ రంజన్ గొగోయ్ చరిత్రలో నిలిచిపోనున్నారు.

Latest Updates