ఆక‌తాయిలు చేసిన ప‌నికి యూపీ టాప‌ర్ మృతి

ప్ర‌భుత్వం ఎన్నిక‌ఠిన చ‌ట్టాలు అమ‌లు చేస్తున్నా.. మ‌హిళ‌ల‌పై ఆక‌తాయిలు చేస్తున్న అకృత్యాలు మాత్రం ఆగ‌డం లేదు. రోడ్డుపై వెళుతున్న కొంద‌రు ఆవారాగాళ్లు చేసిన ప‌నికి విద్యా కుసుమం నేల రాలిపోయింది. ఉన్నత విద్యనభ్యసించి తమకు మరిన్ని పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తుందనుకున్న కూతురు హఠాన్మరణం చెందడంతో కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది.

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఈ దారుణం జ‌రిగింది. బులంద్‌షహర్‌ జిల్లాకు చెందిన సుదీక్ష భాటి(20) 2018లో సీబీఎస్‌సీ క్లాస్‌ 12 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 98 శాతం మార్కులు సాధించి అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల బాబ్సన్‌ కాలేజ్‌లో స్కాలర్‌షిప్‌నకు అర్హత సాధించింది. భారత ప్రభుత్వ డబ్బులతో చదవసాగింది. ఈ క్రమంలో అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న సుదీక్ష కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్‌లో భారత్‌కు తిరిగి వచ్చింది. ఆగష్టులో మళ్లీ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాల కోసం సోమవారం తన అంకుల్‌తో కలిసి బైక్ పై బంధువుల ఇంటికి బయల్దేరింది. అయితే అక్క‌డ కొంద‌రు జులాయిగాళ్లు వాళ్ల బైక్ ను వెంబడిస్తూ రక రకాల స్టంట్లు చేస్తూ సుదీక్ష ఉన్న బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఇష్టమొచ్చినట్లు బైక్ నడిపి, ఆమెపై వేధింపులకు పాల్పడిన బైకర్లపై కేసు నమోదైంది. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Latest Updates