ఉబర్​, ఓలాకు పోటీగా సిటీలో టోరా క్యాబ్స్

హైదరాబాద్, వెలుగు : రైడ్ హైరింగ్ సర్వీసుల్లోకి మరో కొత్త యాప్ ఆధారిత సంస్థ టోరా క్యాబ్స్‌‌ నగరంలోకి ప్రవేశించింది. టోరాక్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(టీటీఎస్‌‌పీఎల్) కింద దీని సేవలు ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యాయి. మరో 45 రోజుల్లో తన సేవలను పూర్తిగా వినియోగదారుల ముందుకు తీసుకు రానున్నట్టు టోరా క్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ కవితా భాస్కరన్ ప్రకటించారు. ఇప్పటి వరకు 1500 మంది డ్రైవర్లు తమ ప్లాట్‌‌ఫామ్‌‌పై రిజిస్టర్ చేసుకున్నట్టు తెలిపారు. 45 రోజుల్లో 4వేల మందికి పైగా డ్రైవర్లను తాము చేర్చుకోనున్నట్టు తెలిపారు. టోరా క్యాబ్స్ ప్రత్యేకత ‘జీరో కమిషన్’, ‘జీరో సర్‌‌‌‌ఛార్జ్’. అంటే డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోదు.

కేవలం రోజువారీ చందాగా డ్రైవర్ రూ.199 చెల్లిస్తే చాలు. అలాగే ప్రయాణికుల నుంచి ఎలాంటి సర్‌‌‌‌ఛార్జ్‌‌ను వసూలు చేయమని కవితా భాస్కరన్ చెప్పారు. మినిమమ్ ఛార్జీగా మూడు కిలోమీటర్లకు రూ.39 వసూలు చేయనున్నామని, ఆ తర్వాత ఒక్కో కిలోమీటర్‌‌‌‌కు బేస్ ఛార్జీగా రూ.8ను విధించనున్నామని పేర్కొన్నారు. తొలుత టోరా క్యాబ్స్ తన సేవలను హైదరాబాద్‌‌లోనే ప్రారంభించింది. ఆ తర్వాత మెట్రోలు, నాన్ మెట్రోల్లోకి ప్రవేశించనున్నామని తెలిపారు. ఇంటర్‌‌‌‌సిటీ, ఇంట్రా సిటీ రెండు రకాలైన సేవలను టోరా క్యాబ్స్ ద్వారా అందించనున్నట్టు చెప్పారు. డ్రైవర్లపై తాము ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని పేర్కొన్నారు.

కొరియాకు చెందిన సంస్థ ద్వారా టోరా క్యాబ్స్ జాయింట్ వెంచర్ ఏర్పడినట్టు టోరాక్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎస్.బి. షిన్ చెప్పారు. ప్రయాణికులకు, డ్రైవర్లకు మేలు చేయాలనే లక్ష్యంతోనే టోరా క్యాబ్స్‌‌ను లాంచ్ చేసినట్టు కవితా భాస్కరన్​ తెలిపారు. డ్రైవర్లకు రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం టోరా క్యాబ్స్  వంద మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. టెక్నాలజీపై ఇది ఎక్కువగా ఇన్వెస్ట్‌‌మెంట్ చేస్తున్నట్టు ప్రకటించింది. వారి టెక్నాలజీ బేస్ హైదరాబాద్, ఢిల్లీలో ఉన్నట్టు చెప్పింది. టోరా సంస్థ ప్రధాన కార్యాలయం కూడా ఢిల్లీలోనే ఉంది.

Latest Updates