దెయ్యం ప‌ట్టింద‌ని చిత్రహింసలు పెట్టి చంపిన్రు

దెయ్యం పట్టిందని బాలింతకు దెబ్బలు
చికిత్స పొందుతూ మహిళ మృతి
భర్త, భూతవైద్యుడు సహా ముగ్గురి అరెస్ట్

జైపూర్, వెలుగు: దెయ్యం పట్టిందని బాలింతను చిత్రహింసలు పెట్టి చివరకు ఆమె నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో జరిగింది. ఏసీసీ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం… కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్ ఏడాది క్రితం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపా క గ్రామానికి చెందిన రజిత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మూడు నెలల క్రితం రజిత ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి ఆమె అనారోగ్యంగా ఉండడంతో మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించారు. అయినప్పటికీ ఈ వ్యాధి నయం కాకపోవడం, కట్నం రాలేదని మనసులో పెట్టుకొని ఎలాగైనా రజితను వదిలించుకోవాలని ప్లాన్ వేశారు. రజితకు దెయ్యం పట్టిందని జమ్మికుంటకు చెందిన ఆమె చిన్నాన పులికోట రవీందర్ ను ఆశ్రయించారు. అతడు జమ్మికుంట మండలం శాయంపేటకు చెందిన దొగ్గల శ్యామ్ అనే భూతవైద్యుడిని కుందారానికి తీసుకొచ్చాడు.

ఆగస్టు 1న భూతవైద్యుడు రజితను కొడుతూ దెయ్యం వదిలిందా అంటూ నరకం చూపాడు. దెబ్బలు తట్టుకోలేని రజిత అపస్మారక స్థితికి చేరుకునే సమయానికి ఏదో చెబుతూ మంచంపై నెట్టేశాడు. ఆ తరువాత కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. బాధితురాలు సోమవారం రాత్రి మృతి చెందింది. రజిత బంధువైన శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన కనుకుట్ల సురేష్ కంప్లైంట్ మేరకు భూతవైద్యుడు దొగ్గల శ్యామ్, చిన్నానపులికోట రవీందర్, భర్త సెగ్యం మల్లేష్లపై ఐపీసీ 302, 304(బీ) సెక్షన్లకింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates