సినిమా ఎక్స్ పీరియన్స్ పూర్తిగా మారిపోతుంది

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు

హైదరాబాద్: కరోనా లాక్ డౌన్ కారణంగా బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయిన విషయం తెలిసిందే. అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న మూవీస్ రిలీజ్ వాయిదా పడ్డాయి. ఈ అవకాశాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సద్వినియోగం చేసుకుంటున్నాయి. మంచి రేటు ఆఫర్ చేసి మూవీ మేకర్స్ ను ఒప్పించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. వీరి ప్రయత్నాలు సఫలమయ్యాయి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ నటించిన గులాబో సితాబోతోపాటు విద్యా బాలన్ యాక్ట్ చేసిన శకుంతలా దేవి, కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సహా మరికొన్ని తమిళ, మళయాళ, హిందీ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సినిమాలు ప్రైమ్ లోనే రిలీజ్ కానున్నాయి. దీనిపై ఇటీవల ప్రముఖ సినిమా థియేటర్స్ చైన్స్ సంస్థ ఐమాక్స్ సినిమాస్ నిరాశను, అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మరిన్ని సినిమాలు విడుదలైతే థియేటర్స్ భవితవ్యం ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్, థియేటర్స్ బిజినెస్ లో ఉన్న దగ్గుబాటి సురేష్ బాబు సినిమాల ప్రదర్శనపై పలు అభిప్రాయాలు పంచుకున్నారు. థియేటర్ బిజినెస్ ను పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు లాంటి విషయాలపై ఆయన తన ఆలోచనలు వెలిబుచ్చారు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచించిన థియేటర్స్ లో బీర్ల ఐడియాపై కూడా సురేష్ బాబు స్పందించారు.

‘ఇంతకు ముందు ఉన్న విధానంలోనే సినిమాలను ప్రదర్శిస్తే థియేటర్స్ లాభాలు గడించే పరిస్థితి లేదు. ప్రేక్షకుల సౌకర్యం కోసం సౌండ్ సిస్టమ్ నుంచి పార్కింగ్ వరకు ప్రతిదీ మార్చాల్సిందే. టోటల్ సినిమా ఎక్స్ పీరియన్స్ మారిపోతుంది. థియేటర్స్ కేవలం మూవీస్ చూడటానికే నిర్దేశించినవి కావు. ప్రదర్శించిన మూవీ గురించి చర్చించడం, థియేటర్ లోపల డ్యాన్స్ ఫ్లోర్స్ ఏర్పాటు, ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోలు వేయడం లాంటి కొన్ని ఐడియాలపై మేం పని చేస్తున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్ ను పిల్లలతో కలసి థియేటర్స్ కు రప్పించడానికీ ప్రణాళికలు వేస్తున్నాం. వెస్టర్న్ కంట్రీస్ లో స్టేడియాలు, థియేటర్స్ లో బీర్లు సర్వ్ చేస్తారు. అదే ఐడియాను ఇక్కడ కూడా అమలు చేయొచ్చు. దీని వల్ల ప్రభుత్వాలకు కూడా చాలా ఆదాయం సమకూరుతుంది. మేం ఎన్ని ఐడియాలతో ముందుకొచ్చినా వాటిపై తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుంది’ అని సురేష్ బాబు పేర్కొన్నారు.

Latest Updates