24 గంట‌ల్లో 1752 క‌రోనా కేసులు.. 37 మ‌ర‌ణాలు

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 23,452కు పెరిగిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1752 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు, 37 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయ‌ని శుక్రవారం సాయంత్రం ఐదు గంట‌ల‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఒక్క‌రోజులోనే న‌మోదైన అత్య‌ధిక కేసుల సంఖ్య ఇదే.

మొత్తం క‌రోనా బాధితుల‌ సంఖ్య 23,452కు చేర‌గా.. అందులో 723 మంది మ‌ర‌ణించార‌ని తెలిపింది. చికిత్స త‌ర్వాత పూర్తిగా కోలుకుని 4,814 మంది డిశ్చార్జ్ అయిన‌ట్లు వెల్ల‌డించింది. ఇంకా 17,915 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

మూడు రాష్ట్రాల్లో పేషెంట్లంతా డిశ్చార్జ్

దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 6430 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. గుజ‌రాత్ లో 2624, ఢిల్లీలో 2376, రాజస్థాన్ లో 1964, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 1852 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. త‌మిళ‌నాడులో 1683 మందికి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో 1604 మందికి వైర‌స్ సోకింది. తెలంగాణ‌లో 984, ఏపీలో 955 కేసులు న‌మోద‌య్యాయి. ఇక మూడు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే క‌రోనా పేషెంట్లు మొత్తం పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గోవాలో ఏడు, మ‌ణిపూర్ లో రెండు, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఒక క‌రోనా కేసు న‌మోదు కాగా.. ఏ ఒక్క మ‌రణం కూడా లేకుండా ఈ మూడు రాష్ట్రాలు క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాయి.

Latest Updates