ఊర్లకు ‘ఉపాధి’ పైసలు ఇస్తలేరు

గ్రామాల్లో పేరుకుపోయిన ఉపాధి హామీ బిల్లులు
రూ.150 కోట్లు బకాయిలు ఉన్నాయంటున్న ఆఫీసర్లు
ప్రతి గ్రామంలో అప్పులు చేసి పనులు చేసిన సర్పంచ్​లు
పనులు పూర్తి చేసి 8 నెలలైనా బిల్లులు విడుదల చేయలే
కేంద్రం విడుదల చేసినా రాష్ట్రం ఇవ్వడం లేదు
ఇతర పథకాలకు డైవర్ట్ చేస్తోందని ఆరోపణ
అధికారుల నుంచి స్పందన లేదు

మార్చిలో రూ.3 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేశాం. ఇంతవరకు బిల్లులు విడుదల కాలేదు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బిల్లులను విడుదల చేయాలని ఏఈ, డీపీవోను అడుగుతూనే ఉన్నాం. వారి నుంచి స్పందన లేదు. ఎప్పుడు అడిగినా త్వరలో వస్తయి అని చెబుతున్నారు.                                                         – శ్రీరామ్ రెడ్డి, సర్పంచ్, ధామెర గ్రామం, వరంగల్ రూరల్ జిల్లా

హైదరాబాద్, వెలుగుఉపాధిహామీ స్కీమ్ కింద చేపట్టిన పనుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ప్రతి గ్రామంలో రూ.లక్షల్లో బిల్లుల బకాయిలు ఉన్నట్లు సర్పంచ్​లు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన పనులతోపాటు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు రావాల్సి ఉందని అంటున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలు, నీటి కందకాలు, భూముల చదునుతోపాటు పలు పనులను సర్పంచ్​లు చేపట్టారు.

అప్పులు తెచ్చి పనులు చేపట్టామని, వడ్డీలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని పలువురు సర్పంచ్​లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.150 కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిని వెంటనే విడుదల చేయాలని సర్పంచ్​లు డిమాండ్​చేస్తున్నారు. ఉపాధి నిధులు రాకపోవడం.. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇప్పుడు పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని సర్పంచ్​లు వాపోతున్నారు.

బిల్లుల కోసం ప్రదక్షిణలు

గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి మొక్కలు నాటడంతోపాటు నర్సరీలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటికి 6 మొక్కలు ఉచితంగా ఇవ్వటంతోపాటు ఖాళీ ప్లేస్ ల్లో మొక్కలు నాటి, వాటి రక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి వైకుంఠధామాలను నిర్మిస్తున్నారు. ఈ పనులకు ఉపాధిహామీ నిధులను ఖర్చు చేస్తున్నారు. వైకుంఠధామాలకు గుర్తించిన ప్లేస్ ను చదునుచేయటం, చుట్టూ ప్రహారీ లేదా ఫెన్సింగ్ నిర్మించటం వంటి పనులు కొన్ని గ్రామాల్లో పూర్తయినా బిల్లులు విడుదల చేయలేదని సర్పంచ్ లు చెబుతున్నారు. ఈ బకాయిల కోసం సర్పంచ్ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లా అధికారులు, డీపీవోల చుట్టూ తిరుగుతున్నారు. మార్చిలో పూర్తయిన పనులకు సంబంధించి ఇంత వరకు వివరాలను ఎంటర్ చేయలేదని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సర్పంచ్ తెలిపారు. గట్టిగా అడిగినా కూడా స్పందించడం లేదంటున్నారు.

నిధుల దారిమళ్లింపు

ఉపాధి హామీ నిధులను కేంద్రం విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రిలీజ్​చేయటం లేదని సర్పంచ్ లు ఆరోపిస్తున్నారు. ఈ నిధులను, ఇతర పథకాల కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దారి మళ్లిస్తోందంటున్నారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు సైతం విడుదల కావాల్సి ఉందని సర్పంచ్ లు చెబుతున్నారు.

బిల్లులు విడుదల చేస్తం

జిల్లాల పర్యటన సమయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దృష్టికి ఉపాధి హామీ బకాయిల విషయాన్ని సర్పంచ్ లు తీసుకెళ్లారు. బకాయిలున్న మాట వాస్తవమేనని, వెంటనే విడుదల చేస్తామని మంత్రి గతంలో ప్రకటించారు. అయితే, మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చి కూడా 6 నెలలు దాటినా బకాయిలు మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదని సర్పంచ్ లు చెబుతున్నారు. ‘‘కొద్ది రోజుల క్రితం రూ.120 కోట్లు విడుదల చేశామని, ఇంకా
రూ.150 కోట్లు బకాయిలు ఉన్నాయని, త్వరలోనే విడుదల చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు చెప్పారు.

నిధులు దారిమళ్లిస్తోంది

సీసీ రోడ్లు, మెటీరియల్ కాంపోనెంట్స్ పనులు పూర్తి చేశాం. ఈ ఏడాది, గత ఏడాదివి కలిపి రూ.19 లక్షలు మా గ్రామానికి రావాలి. ఈ స్కీమ్ కు కేంద్రం నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వీటిని విడుదల చేయకుండా ఇతర ప్రాజెక్టులకు దారి మళ్లిస్తోంది.

– ప్రణీల్ చందర్, సర్పంచ్, నుసురుళ్లబాద్ గ్రామం, మహబూబ్ నగర్

Latest Updates