ఏడాది పాలన.. తెలంగాణ పరువు తీసింది: ఉత్తమ్

రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు టీపీసీసీ అధ్యక్షులు  ఉత్తమ్ కుమార్ రెడ్డి.  వారి పాలనలో ఈ ఏడాదంతా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అప్పులు, ఆందోళనలతోనే గడిచి పోయిందదన్నారు.

ప్రభుత్వ తప్పిదాలవల్ల 26 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు ఉత్తమ్. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల ఆత్మహత్యలు, గుండె పోటు మరణాలు, ప్రమాదాలు జరిగి 30 మంది వరకు మరణించారన్నారు. దిశ, విజయ  రెడ్డి, హజీపూర్, వరంగల్, అసిఫాబాద్, జడ్చర్ల  హత్యలు దేశ వ్యాప్తంగా తెలంగాణ పరువును తీశాయన్నారు. ఈ ఏడాది తెలంగాణ అశాంతి నిలయంగా మారిపోయిందని, అవినీతి పెచ్చు మీరిందని అన్నారు. తెలంగాణ అంటేనే దేశంలో చెడ్డ పేరు వచ్చే విదంగా మారిపోయిందని అన్నారు.

సీఎం కేసీఆర్ అసమర్థ ఆర్థిక విధానాలతో రాష్ట్రం దివాళా తీసిందని, రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని ఉత్తమ్ అన్నారు.  ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణ కావాలని మాట్లాడుతున్న కేసీఆర్.. కొత్త అసెంబ్లీ, సచివాలయం కట్టాలనుకున్నప్పుడు ఆర్థిక క్రమ శిక్షణ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. 17 వేల కోట్ల అదనపు ఆదాయంతో ధనిక రాష్టాన్ని కేసీఆర్ చేతిలో పెడితే ప్రజల చేతిలో చిప్ప పెట్టాడని ఉత్తమ్ అన్నారు. మూడు లక్షల కోట్లు అప్పులు చేసినా కూడా ఏ ఒక్క ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేయలేదని, కమిషన్లు దండుకోవడానికే కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ పథకాలకు లక్షల కోట్లు  ఖర్చు పెట్టారన్నారు. అవినీతి లో రాష్ట్రం 5వ స్థానాల్లో ఉండడం ఆందోళనకు గురి చేస్తుందన్నారు.

లిక్కర్ ఆదాయాన్ని 22 వేల కోట్ల రూపాయలకు పెంచుకోవడంలో మాత్రమే రాష్ట్రం ప్రగతి సాధించిందని, తక్షణమే మద్యాన్ని నియంత్రించాలని ఉత్తమ్ అన్నారు. మద్యం కారణంగానే తెలంగాణలో నేరాలు పెరిగిపోతున్నాయని చెప్పారు.

రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రైతు బంధు, ఆరోగ్య శ్రీ పథకం, ఫీజు రియంబర్స్ మెంట్.. ఇలా సంక్షేమ పథకాలపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ఉత్తమ్.

TPCC President Uttam Kumar Reddy comments on CM KCR one year rule

Latest Updates