బైక్ ఓనర్లకు మేలు చేసిన ట్రాఫిక్ చలానా

ట్రాఫిక్ చలానా.. టూవీలర్ ఓనర్లకు మేలు చేసింది. అవును మీరు చదివింది నిజమే. చలానా పడితే జేబులోని డబ్బులు పోతాయ్ కానీ, మేలు చేయడమేంటి అనుకుంటున్నారా? దొంగతనానికి గురైన తమ బైక్‌లను తిరిగి తమ దగ్గరకు చేర్చడంలో ట్రాఫిక్ చలానాలే సాయం చేశాయి. హైదరాబాద్‌ పాత బస్తీలో టూవీలర్స్ కొట్టేసి అమ్ముకుంటున్న దొంగని పోలీసులకు పట్టించింది చలానా. అతడిని అరెస్టు చేసి మొత్తం ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు సిటీ పోలీసులు.

పాత బస్తీలోని మైలార్‌దేవ్ పల్లికి చెందిన 19 ఏళ్ల మహమ్మద్ అఫ్రిదీ అఫ్జల్ వీడియో గ్రాఫర్‌గా పని చేస్తుంటాడు. ఫంక్షన్ హాల్స్‌లో శుభకార్యాల వీడియో తీసేందుకు వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన వారి బైక్‌లో దొంగిలించడం అలవాటు పడ్డాడు. వాటిని తీసుకెళ్లి సెకండ్ హాండ్‌లో అమ్మకానికి పెట్టేవాడు. దొంగ బండి కావడంతో కస్టమర్ దగ్గర ముందు కొంత డబ్బు తీసుకుని బైక్ అప్పజెప్పేసి, పేపర్లు రెండో దఫాలో డబ్బు కట్టినప్పుడు ఇస్తానని మోసగించేవాడు. ఈజీ ఇన్‌కం వస్తుండడంతో ఫంక్షన్ హాల్స్ దగ్గర బైక్‌ల దొంగతనం చేసి అమ్మడానికి బాగా అలవాటు పడ్డాడు మహమ్మద్.

చలనా పట్టించింది

మహమ్మద్ అఫ్రిదీ అఫ్జల్ దగ్గర బైక్‌లు కొనుగోలు చేసిన వాళ్లు ట్రాఫిక్ రూల్స్ తప్పడమే అసలు ఓనర్స్‌కి వరంలా మారింది. సిగ్నల్స్ జంప్, రాంగ్ రూట్‌లో వెళ్లడం లాంటివి చేసినప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఫొటో కొట్టి.. నంబర్ ప్లేట్ ఆధారంగా చలానాలు ఇంటికి పంపారు. అవి అసలు ఓనర్ ఇంటికి చేరడంతో చలానాలో వచ్చిన ఫొటోలతో సహా వాళ్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తమ బైక్ పోయిందని, దాని చలానా వచ్చిందని ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా అందులోని వ్యక్తులను విచారించడం ద్వారా అసలు దొంగ మహమ్మద్‌ను పట్టుకున్నారు సిటీలోని హుస్సేనిఆలం పోలీసులు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ సమయంలో అతడి దగ్గర నుంచి ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Latest Updates