హైదరాబాద్ లో మళ్లీ మొదలైన ట్రాఫిక్ కష్టాలు

హైదరాబాద్ : లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమైన జనం మళ్లీ రోడ్లెక్కారు. వైరస్ ప్రభావం తగ్గకపోయినా…అన్ లాక్ రూల్స్ తో రోడ్లపైకి వస్తున్నారు. దీంతో మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న సిటీలో మళ్లీ ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. జనం ఇష్టానుసారంగా బయటకు వస్తుండటంతో వైరస్ మరింత పెరిగే ప్రమాదం ఏర్పడుతోంది.  ఇండస్ట్రియల్, ఐటీ కారిడార్లు మినహా సిటీలో రద్దీ యధావిధిగా ఉంటోంది. సిటీలో విద్యాసంస్థలు, సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ తప్ప అన్నీ ప్రారంభించడంతో…మళ్లీ పూర్వస్థితికి చేరుకుంది హైదరాబాద్. పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, జూపార్క్, చార్మినార్ ల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటోంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో సొంతవాహనాలపైనే బయటకు వస్తున్నారు జనం.

ఆటోలు, క్యాబ్ సర్వీసులు ప్రారంభమైనా..  కరోనాతో సొంత వాహనాలనే ఇష్టపడుతున్నారు. లాక్ డౌన్ తర్వాత టూవీలర్ సేల్స్ కూడా పెరిగాయంటున్నారు వ్యాపారులు. గల్లీలు, లోకల్ రోడ్లు మినహా ప్రధాన రహదారులపై ఎక్కడికి వేళ్ళాలన్న ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు జనం. ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే గంటల తరబడి ట్రాఫిక్ లోనే ఉండాల్సి వస్తోందంటున్నారు. అన్ లాక్ లో భాగంగా రవాణా, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు నిర్మాణ రంగం, షాపింగ్ మాల్స్, జిమ్స్ , హోటల్స్  తెరుచుకున్నాయి. ఐటీ ఉద్యోగులు కూడా 33 శాతం మంది ఆఫీసులకు వెళ్లొచ్చని సూచించడంతో రోడ్లపై రద్దీ కనిపిస్తోంది.

నిర్మాణ రంగానికి సంబంధించి… ఎలక్ట్రికల్, ప్లంబింగ్, సిమెంట్, స్టీలు షాపులు తెరవడంతో వాటిలో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు ఇళ్ల నుంచి సొంత వాహనాలపై బయటకు వస్తున్నారు. దీంతో పెట్రోల్ సేల్స్ కూడా పెరిగాయంటున్నారు బంకుల ఓనర్లు. గతంలో విపరీతంగా రద్దీ ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, శిల్పారామం ప్రాంతాలు ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించడం, చాలా కంపెనీలు ఇంకా తెరుచుకోకపోవడంతో ఈ ఏరియాల్లో రద్దీ పెద్దగా కనిపించడం లేదు.

Latest Updates