
- గూగుల్ మ్యాప్స్‌తో ట్రాఫిక్ కంట్రోల్
- హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కొత్త ఆలోచన
సిిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్‌లో బండి కదలాలంటే చుక్కలు కనిపిస్తాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అయితే, క్యూ కట్టేస్తాయి. సిగ్నల్ పడి కొన్ని బండ్లు వెళ్లాయో లేదో మళ్లీ రెడ్ పడిపోతుంటుంది. కొన్ని చోట్లయితే, బండ్లు ఎక్కువగా లేకపోయినా గ్రీన్ సిగ్నల్ కొన్ని నిముషాల పాటు రన్ అవుతుంటుంది. ఇంకోవైపు బండ్లు ఎక్కువగా ఉన్నా రెడ్ లైట్ తొందరగా పోదు. దీంతో బండ్లు ఎక్కడికక్కడ జామ్ అయిపోతుంటాయి. మరి, దానికి పరిష్కారం లేదా? ట్రాఫిక్‌ను బట్టి సిగ్నళ్లను నడిపించడం కుదరదా? అంటే.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ మస్త్ ఆలోచన చేశారు. అదే గూగుల్ మ్యాప్స్! అవును, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ఏ సిగ్నల్ ఎంత సేపుండాలన్న దానిని నిర్ణయిస్తారట. అంటే గూగుల్ మ్యాప్స్‌లో ట్రాఫిక్ రద్దీని చూసుకుంటూ సిగ్నళ్లను వేస్తారన్నమాట. ఉదాహరణకు ఓ వైపు నుంచి తక్కువ రద్దీ ఉందనుకోండి.. ఆ వైపున రెడ్‌లైట్‌ను ఎక్కువ సేపు ఉంచుతారు. వాహనాలు ఎక్కువగా ఉన్న వైపు గ్రీన్‌లైట్‌ను ఎక్కువ టైం ఆన్ చేస్తారు. దాని వల్ల ట్రాఫిక్ రద్దీ అనేది తగ్గుతుంది.
గచ్చిబౌలిలో ట్రయల్స్
ఇప్పటికే గచ్చిబౌలిలోని రెండు సిగ్నళ్లపై రెండు నెలల పాటు ఈ గూగుల్ మ్యాప్స్ మంత్రాన్ని ప్రయోగించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ విధానం వల్ల ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గినట్టు గుర్తించారు. అంతేకాదు, సిగ్నళ్ల వద్ద వేచి ఉండే టైం 30 శాతం, బండ్ల రద్దీ (క్యూ) 50 శాతం వరకు తగ్గినట్టు అంచనాకు వచ్చారు. అంతేకాదు, ట్రాఫిక్ సమస్యలపై ఆ గూగుల్ మ్యాప్స్ డేటాను బట్టి రోడ్లను అభివృద్ధి చేసేందుకు రోడ్డు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కసరత్తు చేస్తున్నాయని సమాచారం. టెక్నాలజీ వాడకంపై ఇప్పటికే ప్రకటన చేసినా, ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు నిధుల మాట మాత్రం రావడం లేదు. దేశంలో ఒక్క బెంగళూరులో మాత్రమే గూగుల్ మ్యాప్స్‌తో సిగ్నళ్లను కంట్రోల్ చేస్తున్నారు.
ఐటీఎంఎస్ ఇంకెప్పుడో!
నిజానికి గూగుల్ మ్యాప్స్‌తో సిగ్నళ్లను కంట్రోల్ చేయడాని కన్నా ముందే ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్లాన్ చేశారు. కామన్ కంట్రోల్ సెంటర్ నుంచి సిటీలోని అన్ని సిగ్నళ్లు ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. అంతేకాదు, వర్షాకాలంలో నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించి, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే వేరే రూట్లో వెళ్లేందుకు సూచనలిస్తుంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలనూ దీని ద్వారా తగ్గించొచ్చు. అయితే, 2017లో ప్రారంభమైన దీని పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో కేబుళ్లు వేసిందే లేదని కొందరు అధికారులు అంటున్నారు. ప్రస్తుతం సిటీలో 3 నిమిషాలు, 120 సెకన్లు, 90 సెకన్ల పాటు ట్రాఫిక్ సిగ్నళ్లు పడుతున్నాయి. అయితే, ఎప్పుడు, ఎటువైపు ఎన్ని బండ్లు వస్తున్నాయో అంచనా వేసి, సిగ్నల్ టైంను ఖరారు చేస్తుంది ఐటీఎంస్.