టోల్ గేట్లలో ‘క్యాష్’ క్యూ

హైదరాబాద్—–విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

రాష్ర్టవ్యాప్తంగా టోల్​గేట్లు రద్దీగా మారాయి. సంక్రాంతి సెలవులకు ఊళ్లకు వెళ్తున్న వాహనాలతో నిండిపోతున్నాయి. ఫాస్టాగ్ లేక క్యాష్ ద్వారా టోల్ చెల్లిస్తున్న బండ్లు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల ఫాస్టాగ్ లైన్లలో ఏర్పాటు చేసిన స్కానర్లు వాహనాలను గుర్తించడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో టోల్ ప్లాజాను దాటేందుకు ఒక్కో వెహికల్​కు కనీసం 20 నిమిషాలకుపైగా పడుతోంది.

విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్–విజయవాడ హైవేపై శనివారం వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ ద్వారా టోల్ చెల్లించేందుకు రెండున్నర కిలోమీటర్ల మేర వెహికల్స్ బారులుదీరాయి. ఆదిలాబాద్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలకు వెళ్లే రోడ్లూ నిండిపోతున్నాయి. హైదరాబాద్‌‌‌‌ నుంచి సుమారు 20 లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం నుంచి రోజుకు 4 లక్షల నుంచి 5 లక్షల మంది దాకా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ఈనెల 10 నాటికి ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లింపులు చేసే వారు 63 శాతానికి చేరుకున్నారు. ఇప్పటికి లక్షా 6 వేల ఫాస్టాగ్​లు అమ్మాం. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని 17 టోల్ ప్లాజాల్లో క్యాష్ ద్వారా టోల్ చెల్లించేందుకు ఒకే లైన్ ఉంటుంది” అని ఎన్​హెచ్ఏఐ రీ జనల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ తెలిపారు.

‘టిమ్’లతో నగదు వసూళ్లు

అన్ని వాహనాలకు ఫాస్టాగ్​లు లేకపోవడం, ఫాస్టాగ్ లైన్లలో సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని టిమ్ మిషన్లతో టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్​ లైన్లలోనూ క్యాష్ ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు. విజయవాడ వైపు 9 బూత్​లు తెరిచి.. 5 ఫాస్టాగ్ లైన్లు, 4 క్యాష్ లైన్లను ఏర్పాటు చేశారు. అయినా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో ఫాస్టాగ్ లైన్లలోనూ నగదు వసూలు చేపట్టారు. అదనపు సిబ్బందిని నియమించి 15 టిమ్ మిషన్లతో టోల్ తీసుకున్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates