విద్యుత్​ ఒప్పందాలు రూల్స్​ ప్రకారమే..

హైదరాబాద్‌‌, వెలుగు: విద్యుత్ సంస్థలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, విద్యుత్‌‌ ఒప్పందాల్లో ఎలాంటి అవకతవకలు జరుగలేదని ట్రాన్స్​కో, జెన్‌‌కో సీఎండీ డి.ప్రభాకర్‌‌ రావు అన్నారు. దీనిపై సీబీఐతో విచారణకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. మంగళవారం విద్యుత్‌‌సౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఎన్టీపీసీ, బీహెచ్‌‌ఈఎల్‌‌ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని, ఈ రెండు సంస్థలతో విద్యుత్‌‌ సంస్థల మధ్య జరిగిన లావాదేవీలపై ఏమైనా అపోహలుంటే నేరుగా వాటి నుంచి వివరణ తీసుకోవాలని తెలిపారు. రూ. 4.66  నుంచి రూ.5.19కు యూనిట్​ చొప్పున 2016 నుంచి ఎన్టీపీసీతో సోలార్‌ పవర్‌ కోసం పీపీఏ కుదుర్చుకున్నామని, ఇప్పటికీ 400 మెగావాట్‌‌లు తీసుకుంటున్నామని వెల్లడించారు. 2015లో ఓపెన్‌‌ టెండర్లు కాల్‌‌ఫర్‌‌ చేసి పీపీఏలు చేసుకున్నామని, ధర కూడా ఇతర రాష్ట్రాల కంటే తక్కువ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్టంగా యూనిట్‌‌ ధర రూ. 5.79  ఉందని, దాని కంటే తక్కువకే పీపీఏలు కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు. భద్రాద్రి థర్మల్‌‌ విద్యుత్‌‌ కేంద్రం నిర్మాణం కోసం నేరుగా బీహెచ్‌‌ఈఎల్‌‌తోనే ఒప్పందం చేసుకున్నామని, ఇండియా బుల్స్‌‌ సంస్థతో తాము ఒప్పందం చేసుకున్నామనడంలో వాస్తవం లేదన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తిగా వృత్తిపర నిబద్ధతతో విద్యుత్‌‌ సంస్థలు, వినియోగదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని తెలిపారు. దేశంలో హర్యానా మినహా  99శాతం విద్యుత్‌‌ సంస్థలు నష్టాల్లోనే నడుస్తున్నాయని ప్రభాకర్​రావు చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉదయ్‌‌ పథకం తీసుకువచ్చిందన్నారు. 2015 సెప్టెంబర్​ 30 నాటికి తెలంగాణ విద్యుత్‌‌ సంస్థలు రూ. 11897 కోట్ల నష్టాల్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్‌‌ చేసిందని చెప్పారు.

రూ. 35,000 కోట్ల రుణాలతో పెట్టుబడులు

23 వేల కోట్లతో రాష్ట్రంలో ట్రాన్స్‌‌మిషన్‌‌ , డిస్ట్రిబ్యూషన్‌‌ వ్యవస్థను పటిష్టం చేశామని, కొత్తగూడెంలో 800 మెగావాట్‌‌ల థర్మల్‌‌ ప్లాంట్‌‌, పులిచింతల హైడల్‌‌ ప్లాంట్‌‌ ఇలా రూ.35,000 కోట్లు  రుణాల తీసుకుని క్యాపిటల్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ పెట్టామని ప్రభాకర్​రావు తెలిపారు. వీటి కోసం ఏటా రూ. 3500 కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం క్లీన్‌‌ ఎనర్జీ పేరుతో బొగ్గుపై సుంకాన్ని టన్నుకు రూ. 400 పెంచిందని, దీంతో  ఏటా రూ. 1440 కోట్లు, బొగ్గు ధరలు పెరగడంతో మరో రూ. 1484 కోట్లు ఇలా  బొగ్గు కోసం రూ. 3000 కోట్లు.. ఇన్‌‌పుట్‌‌ పెట్టుబడులు రూ.7000 కోట్లు కలిపి మొత్తం రూ. 10000 కోట్లకు పెరిగిందన్నారు.  ఉద్యోగులకు రెండు సార్లు వేతన సవరణ చేయడం ద్వారా రూ. 1600 కోట్ల భారం పడిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పోను గత  ఐదేండ్లలో అదనంగా రూ. 7200 కోట్లు ఇచ్చిందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తనను టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలని అనడం బాధాకరమని ప్రభాకర్‌‌రావు అన్నారు. తాను అన్ని ప్రభుత్వాల్లో పనిచేశానని, ఎప్పుడూ ఏ కండువా వేసుకోలేదని తెలిపారు.

Latest Updates