మూడు జిల్లాల అధికారుల బదిలీలు

మూడు జిల్లాల అధికారుల బదిలీలు

కరీంనగర్ జిల్లా కలెక్టర్ తో పాటు, జెడ్పీ సీఈవో, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లను నిన్న బదిలీ చేసింది సర్కార్. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తో.. ఇప్పటికే హుజురాబాద్ లోని కీలక అధికారులందరినీ బదిలీ చేసింది ప్రభుత్వం.  తాజాగా కలెక్టర్, జెడ్పీ సీఈవో లాంటి కీలక అధికారులను ట్రాన్స్ ఫర్ చేయడం... జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్న సీపీ కమలాసన్ రెడ్డిని కూడా రేపో మాపో బదిలీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలో మూడు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది ప్రభుత్వం. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో పాటు ఖమ్మం, కరీంనగర్ జెడ్పీ సీఈవోలను మార్చింది. నిజానికి కనీసం రెండేళ్లు పనిచేసిన తర్వాతే అధికారులను బదిలీ చేస్తుంటారు. కానీ ప్రస్తుత కలెక్టర్ శశాంక కరీంనగర్ లో జాయిన్ అయ్యి కేవలం 19 నెలలు మాత్రమే అయ్యింది. అంతకంటే ముందున్న కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ దాదాపు మూడేళ్ల పాటు పనిచేశారు. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్ మధ్యలో కొద్ది రోజులు సిద్ధిపేట వెళ్లి మళ్లీ సిరిసిల్లకే వచ్చారు. కృష్ణ భాస్కర్ ఐదేళ్ళుగా ఇక్కడే పని చేస్తున్నారు. కానీ కరీంనగర్ కలెక్టర్ గా శశాంక పదవీ కాలం రెండేళ్లు కూడా పూర్తి కాకముందే అర్ధాంతరంగా మార్చడం వెనుక రాజకీయ కారణాలున్నాయనే చర్చ జరుగుతోంది.

కలెక్టర్ శశాంక భార్య సింధు శర్మ ప్రస్తుతం జగిత్యాల ఎస్పీగా ఉన్నారు. స్పౌజ్ కేటగిరీలో భార్యభర్తలిద్దరూ సమీప ప్రాంతాల్లో పనిచేసే అవకాశం ఇస్తోంది సర్కార్. కానీ సింధు శర్మను బదిలీ చేయకుండా కేవలం శశాంకను మాత్రమే ట్రాన్స్ ఫర్ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా... కేవలం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ కు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. శశాంక స్థానంలో ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బాధ్యతలు తీసుకున్నారు. శశాంకను మార్చేందుకు వీలుగా ఖమ్మం కలెక్టర్ ను బదిలీ చేశారు. ఖమ్మం కోసం మహాబూబ్ నగర్ కలెక్టర్ ను బదిలీ చేసి ఖమ్మం పంపించారు. ఇలా కరీంనగర్ లో మార్పు కోసమే 3 జిల్లాల అధికారులను మార్చినట్లు తెలుస్తోంది.

కలెక్టర్ బదిలీ వెనక హుజురాబాద్ ఉప ఎన్నికే ప్రధాన కారణమన్న ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్, మొన్నటి వరకు హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ జిల్లాలో మంత్రులుగా ఉన్న సమయంలో శశాంక పనిచేశారు. దీంతో ఇటు గంగులతోపాటు,  ఈటల రాజేందర్ తోనూ శశాంకకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలా ఈటలతో మంచి పరిచయాలు ఉన్నందునే... ఆయనను బదిలీ చేశారన్న ప్రచారం సాగుతోంది.  కానీ  దీని వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్నారు మంత్రి గంగుల. హుజురాబాద్ లో అమలు చేయబోతున్న దళిత బంధును సమర్ధవంతంగా అమలు చేసేందుకే బదిలీలు జరిగాయని చెప్తున్నారు.

మరోవైపు ఈటల మంత్రిగా ఉన్న సమయంలో నియమితులైన ఆ నియోజకవర్గంలోని అధికారులందరినీ ఇప్పటికే బదిలీ చేసింది సర్కార్. మరో కీలక పోస్టు అయిన జెడ్పీ సీఈవో రమేశ్ ను కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రమేశ్ కూడా 3 నెలల క్రితమే జెడ్పీ సీఈవోగా వచ్చారు. ఆయన స్థానంలో తాజాగా కలెక్టర్ గా చేరిన కర్ణన్ సతీమణి ప్రియాంకను ఖమ్మం నుంచి బదిలీ చేసి కరీంనగర్ జెడ్పీ సీఈవోగా నియమించారు. దీంతో పాటు మరో రెండు కీలకమైన బదిలీలు జరిగాయి.  హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్న ప్రసన్నతో పాటు,  జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గా ఉన్న అన్సుర్ రషీద్ ను కూడా బదిలీ చేసింది సర్కార్. ఇలా ఈటలతో ఏమాత్రం పరిచయలున్న ప్రతీ అధికారినీ బదిలీ చేశారనే టాక్ వినిపిస్తోంది. 

ఈటల మంత్రిగా ఉన్న సమయం నుంచి మిగిలింది... కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి. ఈయన లాంగ్ స్టాండింగ్ లో ఇక్కడే ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు రోజు కమిషనర్ గా పోస్టింగ్ తీసుకున్న కమలాసన్ రెడ్డి.. ప్రస్తుతం డీఐజీ ర్యాంకులో ఉన్నారు. దీంతో రేపో, మాపో ఆయన్ను కూడా  ట్రాన్స్ ఫర్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.