ఈ కారిడార్ తో 50 శాతం తగ్గనున్నరవాణా ఖర్చు

న్యూఢిల్లీ డెడికేటెడ్‌‌ ఫ్రైట్‌‌ కారిడార్‌‌ అందుబాటులోకి వస్తే వస్తువుల రవాణా వ్యయం 50 శాతం దాకా తగ్గనుంది. ఈ డెడికేటెడ్‌‌ ఫ్రైట్‌‌ కారిడార్‌‌ 2021 లో అందుబాటులోకి రానుందని డెడికేటెడ్‌‌ ఫ్రైట్‌‌ కారిడార్‌‌ కార్పొరేషన్‌‌ లిమిటెడ్‌‌ (డీఎఫ్‌‌సీసీఐఎల్‌‌) మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ అనురాగ్‌‌ సచన్‌‌ తెలిపారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌‌కత్తా నగరాలను కలుపుతూ ఏర్పాటు చేసిన గోల్డెన్‌‌ క్వాడ్రిలేటరల్‌‌లో భాగంగా ఈ డెడికేటెడ్‌‌ ఫ్రైట్‌‌ కారిడార్‌‌ ప్రాజెక్టును చేపట్టారు. ఇండియన్‌‌ రైల్వేస్‌‌ ఛార్జ్‌‌ చేసే ఫ్రైట్‌‌ టారిఫ్‌‌తో పోలిస్తే డెడికేటెడ్‌‌ ఫ్రైట్‌‌ కారిడార్‌‌లో హాలేజ్‌‌ ఛార్జెస్‌‌ సగమే ఉంటాయని సచన్‌‌ పేర్కొన్నారు. ఈస్టర్న్‌‌ డెడికేటెడ్‌‌ ఫ్రైట్‌‌ కారిడార్‌‌ (ఈడీఎఫ్‌‌సీ) నిర్మాణ సైట్‌‌ను మీడియాకు చూపించిన సందర్భంగా సచన్‌‌ ఈ వివరాలు వెల్లడించారు. ఫుల్లీ ఆటోమేటెడ్‌‌ సిగ్నల్‌‌ సిస్టమ్‌‌తో నడిచే తమ రైళ్లు గంటకి వంద కిలోమీటర్ల వేగంతో నడుస్తాయని తెలిపారు. కాబట్టి, హాలేజ్‌‌ ఛార్జెస్‌‌ తక్కువుంటాయని వివరించారు. రోజూ  ఒక్కో వైపు నుంచి120 రైళ్లు నడుపుతామని, వాటికి 13 వేల టన్నుల సరకు రవాణా కెపాసిటీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కెపాసిటీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనేదే తమ ప్రయత్నమని చెప్పారు.

ప్రైవేట్ రంగానికి అవకాశం…

ఫ్రైట్‌‌ ఛార్జీలలో కొంత భాగాన్ని కస్టమర్లకు అందించడం కోసం రైల్వే మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నట్లు సచన్‌‌ వెల్లడించారు. ఐతే, ఛార్జీల నిర్ణయమనేది రెగ్యులేటరీ సంస్థ చేతిలోని అంశమని స్పష్టం చేశారు. ఇండియన్‌‌ రైల్వేస్‌‌తో కుదుర్చుకున్న కన్సెషన్‌‌ ఎగ్రిమెంట్‌‌ మేరకు భారీ కెపాసిటీ నిర్మిస్తుండటంతో, ప్రైవేటు సంస్థలకూ సొంత రైళ్లు నడుపుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. డెవలప్డ్‌‌ కంట్రీస్‌‌లో లాగే ఒక రెగ్యులేటరీ సంస్థ ఉంటుందని, ప్రైవేటు రంగ సంస్థలకూ సమానమైన అవకాశాలుంటాయని సచన్‌‌ చెప్పారు.  ఇండియన్ రైల్వేస్‌‌తో పోటీ పడటానికి ప్రైవేట్‌‌ రంగానికి తగిన అవకాశం ఉంటుందన్నారు. ఈ రకమైన ట్రాన్స్‌‌పరన్సీ వల్ల ఫ్రైట్‌‌ ఛార్జీలు తగ్గుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. రైల్వేతో పోలిస్తే తక్కువ ఖర్చవుతుండటంతో ఇండియాలో వస్తువులను ఎక్కువగా రోడ్డు రవాణా ద్వారానే పంపుతున్నారు. 1950 నుంచి క్రమంగా సరకు రవాణాలో రైల్వేస్‌‌ తన వాటా కోల్పోతోంది. సరైన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ లేకపోవడంతోపాటు, సర్వీస్‌‌ మెరుగ్గా లేకపోవడం వల్లే రైల్వేస్‌‌ తన వాటా పోగొట్టుకుంటోంది. ఇండియా పాసింజర్‌‌ ట్రాఫిక్‌‌లో 90 శాతం వాటా, సరకులో 65 శాతం రోడ్డు రవాణా చేతిలోనే ఉన్నాయి. అంతేకాదు, రోడ్డు రవాణా వాటా ఏటా పెరుగుతూనే ఉన్నట్లు డీఎఫ్‌‌సీసీఐఎల్‌‌ అంచనా వేస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ కింద ప్రభుత్వ రంగంలో ఈ డీఎఫ్‌‌సీసీఐఎల్‌‌ను ఏర్పాటు చేశారు. ఈస్టర్న్‌‌ డెడికేటెడ్‌‌ ఫ్రైట్‌‌ కారిడార్‌‌, వెస్టర్న్‌‌ డెడికేటెడ్‌‌ ఫ్రైట్‌‌ కారిడార్‌‌ల నిర్మాణాన్ని ప్రస్తుతం ఈ సంస్థ చురుగ్గా నిర్వహిస్తోంది. లూథియానా నుంచి కోల్‌‌కత్తా దాకా ఉండే ఈడీఎఫ్‌‌సీని 1,800 కిమీ, దాద్రి నుంచి ముంబై (జేఎన్‌‌పీటీ పోర్టు) దాకా ఉండే డబ్ల్యూఎఫ్‌‌సీ 1,500 కిమీ పొడవున నిర్మిస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రం, వరల్డ్ బ్యాంక్

కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తవాలని ప్రధాన మంత్రి, వరల్డ్‌‌ బ్యాంకు సహా అందరూ కోరుకుంటున్నట్లు సచన్‌‌ వెల్లడించారు. ఈడీఎఫ్‌‌సీ కోసం ఆపరేషన్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌ ప్రయాగ్‌‌రాజ్‌‌లో నెలకొల్పారు. ఇంటిగ్రేటెడ్‌‌ కంట్రోల్‌‌ అండ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ సిస్టమ్‌‌ (ఐకోనిస్‌‌) ప్లాట్‌‌ఫామ్‌‌తో ఈ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌‌ ట్రైన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ సిస్టమ్‌‌ (టీఎంఎస్‌‌), సూపర్వైజరీ, కంట్రోల్‌‌ అండ్‌‌ డేటా ఎక్విజిషన్‌‌ (స్కాడా) సిస్టమ్‌‌లు ఇందులో భాగంగా ఉన్నాయి. నడిచే రైళ్లను గమనించేందుకు 90 మీటర్ల డిజిటల్‌‌ వాల్‌‌ ఏర్పాటు చేశారు. 24 గంటలూ రైళ్ల రాకపోకలను ఉద్యోగులు గమనిస్తుంటారు. ఈ కారిడార్లు పూర్తయితే, మిగిలిన కారిడార్ల సర్వే పనులను మొదలు పెట్టాలనుకుంటున్నట్లు సచన్‌‌ చెప్పారు. 4 వేల కిలోమీటర్ల పొడవుండే మరో మూడు కారిడార్లనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Latest Updates