హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఘటన వెనుక దొంగ బాబా ఉదంతం.

treasure hunting in Huzurnagar, one arrested
  • గుప్త నిధుల పేర హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌లో కలకలం
  • నిధులున్నాయని నమ్మించి రూ 10. లక్షలు స్వాహా.
  • పోలీసుల అదుపులో దొంగ బాబా, ఇంటి యజమాని
  • మాయమాటలు నమ్మొద్దంటున్న పోలీసులు

హుజూర్‌ నగర్ మండలంలోని అమరవరంలో కిలోల కొద్ది బంగారం బయటపడిందన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులకు 24 కిలోల బరువున్న662 లోహపు ముద్దలు దొరికాయి. మంగళవారం అర్ధరాత్రి అమరవరంలో సింగతల గురువారెడ్డి  ఇంట్లో గుప్తనిధులు బయటపడ్డాయని హుజుర్ నగర్ పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి తరలి వెళ్లారు. గురువారెడ్డి ఇంట్లో గుప్తనిధుల తవ్వకాలు జరుగుతున్నట్టు కొందరు సీఐ భాస్కర్‌ కు సమాచారం అందించారు. దీంతో సిఐ భాస్కర్ కొందరు పోలీసులను పంపారు. వారు గురువారెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా, లోహపు ముద్దల బ్యాగు దొరికింది. తళతళ మెరుస్తున్న వాటిని చూసి అవి బంగారు నాణేలేనని, గుప్త నిధులున్నమాట నిజమేనని వారు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

కోదాడ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి, సిఐ భాస్కర్ , మఠంపల్లి ఎస్ఐ మహేశ్ అమరవరం చేరుకొని సంచీలోని నాణేలను పరిశీలించి, ఇంకాఎక్కడైనా దాచారేమోనని సోదాలు చేశారు. ఓ గదిలో బండారాయిని తొలగించి నాలుగు అడుగుల లోతున గొయ్యి ని తవ్వినట్టు గమనించారు. తవ్వకాలు, గుప్తనిధుల గురించి గురువారెడ్డి కుటుంబాన్నిపోలీసులు ప్రశ్నించినా వారు నోరు విప్పలేదు. రాత్రి12.30 గంటలకు గురువారెడ్డి తండ్రి వీరారెడ్డి, గ్రామసర్పంచ్ భర్త అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ గురువారెడ్డి, కొందరు గ్రామపెద్దలను హుజూర్‌ నగర్ పట్టణ పోలీసుస్టేషన్‌‌‌‌కు తీసుకొచ్చారు. నాణేలను పరీక్షించడానికి పోలీసులు గోల్డ్‌‌‌‌స్మి త్‌ లను పిలిపించారు. అసలివి బంగారు నాణేలు కావని వారు తేల్చి చెప్పారు.

ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్న యజమానిని విచారించగా.. అతను అసలు విషయం బయటపెట్టాడు. దీనికంతటికి కారణంగా ఓ దొంగ బాబా అని పోలీసులు తేల్చేశారు. గత కొంతకాలంగా ఇంటి యజమాని గురువారెడ్డి పరిచయం పెంచుకున్న ఆ దొంగ బాబా..”మీ ఇంట్లో కోట్ల విలువ చేసే నిధి ఉంది, అది బయటకు తీయాలంటే ఇంట్లో క్షుద్ర పూజలు చేయాలని” నమ్మబలికాడు.

అతని మాయమాటలు నమ్మి గురువారెడ్డి  ఆ బాబాకు రూ. 10 లక్షలు ముట్టజెప్పి., వారం రోజుల క్రితం నాలుగు మేకలను బలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించాడు. ఆ క్షుద్రపూజల సమయంలో పథకం ప్రకారం ఆ బురిడి బాబా ఓ గోతి తవ్వి అందులో తనతోపాటు తెచ్చుకున్న నకిలీ బంగారు నాణేల మూటను అక్కడ ఉంచాడు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా  రూ. 10 లక్షలు తీసుకొని ఉడాయించాడు.

ఇదంతా తెలియని గురువారెడ్డి నిన్న అర్ధరాత్రి నిధికోసం ఇంట్లో మరొక మేకను బలి ఇచ్చి తవ్వకాలు మొదలుపెట్టగా నకిలీ బంగారు బిళ్ళల మూట లభ్యం అయింది. అతని ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక  స్థానికులు పోలీసులకు సమాచారమందించగా..  రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటన గురించి పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ చేయగా అసలు దొంగెవరో తెలిసింది.

ప్రస్తుతం ఈ మొత్తం ఎపిసోడ్ కారణమైన గురువారెడ్డి, దీనికి మాస్టర్ ప్లాన్ చేసి, అమాయక ప్రజలను మోసం చేస్తూ, నకిలీ బంగారు నాణేలను అంటగట్టి లక్షలతో ఉడాయించే దొంగ బాబాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మొతంగా సినీ ఫక్కీలో జరిగిన ఘరానా మోసం సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై జిల్లా పోలీసులు సీరియస్ గా దృష్టి సారించి, ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి మోసాలకు పాల్పడ్డారు? ఎంతమంది ఈ దొంగ బాబా చేతిలో బురిడీ కొట్టారనే విషయాలను వెలికితీసే పనిలో పడ్డారు.

Latest Updates