ఎయిమ్స్‌‌లో ఆదివాసీ అమ్మాయి

ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో సీటు దక్కించుకున్న తొలి గోండు స్టూడెంట్ గొడెం యశస్విని.  బీబీనగర్ ఎయిమ్స్‌‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ముగ్గురు అమ్మాయిలకే సీటు దక్కింది. తెలంగాణ నుంచి ఇద్దరికి సీటు దక్కగా, ఏపీ నుంచి ఒక అమ్మాయి చేరింది. అందులో ఆదిలాబాద్ జిల్లా నుంచి గోండు కమ్యూనిటీ నుంచి సీటు దక్కించుకున్న ఏకైక విద్యార్థిని యశస్విని కావడం విశేషం.

మాది ఆదిలాబాద్ జిల్లా బజార్‌‌‌‌హత్నూర్ మండలం జాతర్ల విలేజ్. చదువుకునేందుకు సరైన స్కూళ్లు, మెరుగైన వైద్యం లేక గోండులు పడుతున్న ఇబ్బందులు మాకు రాకుండా ఉన్నతమైన విద్యనందించేందుకు మా నాన్న గొడం వామన్‌‌రావు మమ్మల్ని కరీంనగర్‌‌‌‌కు తీసుకొచ్చారు. చదువంతా అక్కడే సాగింది. ఇంటర్ తర్వాత మంచి ర్యాంకు రాకపోవడంతో లాంగ్‌‌ టర్మ్ కోచింగ్ తీసుకుందామని ఫిక్సయ్యా. ఎలాగైనా నీట్‌‌లో బెస్ట్ ర్యాంకు కొట్టి డాక్టర్ కావాలన్నది నా కల. దానికోసం రోజుకు 10గంటలకు పైగా చదివా. నీట్‌‌లో మంచి స్కోర్ రావాలంటే ఫిజిక్స్‌‌లో ఎక్కువ మార్కులు సాధించాలని అర్థమైంది. దానికోసం ప్రాబ్లమ్స్‌‌ను రిపిటెడ్‌‌గా ప్రాక్టీస్ చేశా. చదివిన విషయాలన్నింటిని ఎక్కువసార్లు రివిజన్ చేయడం బాగా కలిసొచ్చింది. ఏదో చదివామా వదిలేశామా అన్నట్లు కాకుండా నేర్చుకున్న అంశాన్ని ఎక్కువసార్లు చదవడం ద్వారా శాశ్వతంగా గుర్తుపెట్టుకోవచ్చు. నాకు ఆల్‌‌ఇండియా లెవల్‌‌లో రిజర్వ్‌‌డ్ కేటగిరీలో 84వ ర్యాంకు వచ్చింది. . రిజర్వ్​ కేటగిరిలో 500 నుంచి 600 ర్యాంకు సాధించిన వారికి, జనరల్​ కేటగిరిలో అయితే 1200 ర్యాంకు వరకూ ఎయిమ్స్​లో సీట్లు కేటాయిస్తారు. నాకు 84వ ర్యాంకు రావడంతో సులువుగా ఎయిమ్స్‌‌లో సీటొచ్చింది.

మా అమ్మ సురేఖ మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తుంది. మా అక్క తేజస్విని బీటెక్ చదివి ప్రస్తుతం సివిల్స్‌‌కు ప్రిపేరవుతున్నారు. తమ్ముడు రవితేజ తిరుపతి ఐఐటీలో చదువుతున్నాడు. ఫ్యూచర్‌‌‌‌లో చిల్డ్రన్స్‌‌ డాక్టర్‌‌‌‌గా సేవలందించాలనుకుంటున్నా. దానికోసం ఎంతైనా కష్టపడతా. మంచి డాక్టర్‌‌‌‌గా పేరు సంపాదించుకుంటా..

– యాదాద్రి, వెలుగు

Latest Updates