అనారోగ్యంతో చెల్లెలు మృతి…డబ్బులు లేక డెడ్ బాడీని నదిలో పడేసిన అన్న

అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఓ మహిళను నదిలో పడేయడం విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

హిందూస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాకు చెందిన 30 ఏళ్ల గిరిజన మహిళ  గత కొంతకాలంగా  అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. అయితే బాధిత మహిళ ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. కానీ అంబులెన్స్ రాలేదు. దీంతో మంచంమీద పడుకోబెట్టు కొని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ కొద్దిసేపటికి ఆమె మృతి చెందింది.

ఆమె మరణం అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేకపోవడంతో బాధితురాలి సోదరుడు ఆమె మృతదేహాన్ని రాష్ట్ర రాజధాని భోపాల్‌కు ఈశాన్యంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోన్ నదిలోకి వదిలేశాడు.  బాధితురాలి డెడ్ బాడీని నదిలో పడేసమయంలో స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలపై బాధితురాలి సోదరుడు స్పందించాడు. వైద్యం కోసం అంబులెన్స్ కు ఫోన్ చేశామని, అంబులెన్స్ రాకపోవడంతో  మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్ని సాయం అడిగామని, ఆదివారం కావడంతో సహాయం చేయలేమని తనకు చెప్పినట్లు మీడియా ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆ వీడియో చూసిన కొంతమంది అధికారులు తన కుటుంబానికి రూ.5వేలు ఆర్ధిక సాయం చేసినట్లు మృతురాలి భర్త మహేష్ కల్ చెప్పారు.

ఈ వీడియోపై  సిధి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ డీపీ బార్మాన్  మాట్లాడుతూ డబ్బులు లేక మృతదేహానికి దహనసంస్కారం చేయలేకపోవడం విషాదకరమని అన్నారు. ఈ ఘటన గురించి ప్రభుత్వానికి తెలియదని, లేదంటే ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందించేవాళ్లమని చెప్పారు. బాధితురాలి మరణం విషయంలో అధికారుల తప్పిదం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిధి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ డీపీ బార్మాన్ మాట్లాడుతూ హామీ ఇచ్చారు.

చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ అమర్ సింగ్ మాట్లాడుతూ..మున్సిపల్ ఉద్యోగులు ఎలాంటి తప్పు చేయలేదని, మృతురాలి డెడ్ బాడీ విషయంలో తమని ఎవరు సంప్రదించలేదని అన్నారు.  కాగా వాస్తవాలను తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం తగదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాజ్ పాయ్.  మహిళ అంత్యక్రియల గురించి ప్రభుత్వానికి సమాచారం అందిఉంటే తప్పని సరిగా ఆర్ధిక సాయం చేస్తుందని సూచించారు.

Latest Updates