టిక్ టాక్ లో వైరల్.. ఈ చాలెంజ్ యమ డేంజర్

టిక్​టాక్​ వచ్చాక ‘చాలెంజ్​’లు ఎక్కువైపోయినయ్​. అందులో కొన్ని మంచివి ఉంటున్నా, చెడు చేసే చాలెంజ్​లూ వస్తున్నయ్​. రన్నింగ్​ కార్​ నుంచి దిగి.. స్లోగా కదులుతున్న ఆ కార్​ పక్కన డ్యాన్స్​ చేసి మళ్లీ కారెక్కే ‘రన్నింగ్​ మ్యాన్​’ చాలెంజ్​ అప్పుడెప్పుడో వచ్చింది. దాని వల్ల చాలా మంది యాక్సిడెంట్ల బారిన పడ్డరు. ఈ మధ్య కొత్తగా ఒకరి నోట్లోని సిరీల్స్​ను తీసుకుని తినే ‘సిరీల్​’ చాలెంజ్​ వచ్చింది. ఇలాంటి పిచ్చి చాలెంజ్​లు ఈ మధ్య ఎక్కువైపోయినయ్​. ఇప్పుడు తాజాగా బొక్కలు ఇరగ్గొట్టుకునే ఇంకో చెత్త చాలెంజ్​ టిక్​టాక్​లో వైరల్​ అవుతోంది. ప్రస్తుతం ఇక్కడ లేకపోయినా, వేరే దేశాల్లో చేస్తున్న ఆ చాలెంజ్​ వీడియోలు మాత్రం ఇక్కడ వైరల్​ అవుతున్నాయి. ఏంటా చాలెంజ్​..? డాక్టర్లు చేస్తున్న హెచ్చరిక ఏంటి?

స్కల్​ బ్రేకర్​.. కీళ్లిరుగుతయ్​

ప్రస్తుతం మెక్సికో సహా దక్షిణ అమెరికా, యూరప్​ దేశాల్లో ఆ చాలెంజ్​ వైరల్​ అవుతోంది. చాలెంజ్​లో ముగ్గురు పక్కపక్కన నిలబడతరు. అందులో మధ్యలో ఉన్న వ్యక్తి పైకి లేచి జంప్​ చేయాలి. అదే టైంలో పక్కనున్న ఇద్దరు ఆ జంప్​ చేసే వ్యక్తి కాళ్లను తంతారు. దీంతో ఆ మధ్యలో ఉన్న వ్యక్తి వెనక్కు పడిపోతాడు. అదే చాలెంజ్​. దాన్నే ‘ట్రిప్పింగ్​ జంప్​’ లేదా ‘స్కల్​ బ్రేకర్​’ చాలెంజ్​గా పిలుస్తున్నరు. ఆ వీడియోలను టిక్​టాక్​లో పోస్ట్​ చేస్తున్నరు. ఎక్కువగా స్కూలు పిల్లలు దీన్ని చేస్తున్నరు. ఇప్పటికే ఈ చాలెంజ్​ను పిల్లలు చేయకుండా అక్కడి స్కూళ్లు చర్యలు తీసుకుంటున్నయి. పిల్లలకు అవగాహన కల్పిస్తున్నయి. ఇండియాల కూడా డాక్టర్లు దీనికి దూరంగా ఉండాలని చెబుతున్నరు. చాలెంజ్​ తీసుకుని వెనక్కు పడితే ఒంట్లోని కీళ్లన్నీ విరిగిపోతయని హెచ్చరిస్తున్నరు. ఈ ట్రిప్పింగ్​ జంప్​ వల్ల చాలెంజ్​ చేసే వ్యక్తి తుంటిపై పడతాడని, దాని వల్ల తుంటి ఎముకలతో పాటు మోకాళ్లు, మోచేతులు, ఇతర కీళ్లు విరిగిపోతాయని చెబుతున్నరు. ఇంకో ఎముకతో ఎముకను కలిపే లిగమెంట్లు తెగిపోయే ప్రమాదముంటుందని హెచ్చరిస్తున్నరు. దీనికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని సూచిస్తున్నరు.

 

Latest Updates