కత్తెర సీన్ల వెనుక కష్టాలెన్నో

trouble-behind-scissors-scene

కథ రాసుకోవడం, నటీనటుల ఎంపిక, దర్శకుడు తాను అనుకున్నట్లుగా సినిమా తీయడం, విడుదల చేయడం.. ఒక సినిమా థియేటర్‌‌లోకి వచ్చే క్రమం ఇది. కానీ, ఆ సినిమాలోని సన్నివేశాల్లో ఏం ఉండాలో, ఏం ఉండకూడదో నిర్ణయించే హక్కు సెన్సార్ బోర్డుకి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక చట్టాలు, సెన్సార్‌‌ ప్యానెల్‌‌కు కొన్ని అధికారాలు ఉన్నాయి. ముఖ్యంగా హింస, అశ్లీల సీన్లను అవసరమైతే తొలగించే హక్కు సెన్సార్‌‌ బోర్డుకు ఉంది. చివరకు కత్తెర పడ్డ ఆ సినిమాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి, రిలీజ్‌‌కు అనుమతిస్తుంది. ఈ ప్రక్రియ అంతటినీ ‘సెన్సార్‌‌షిప్‌‌’ అని పిలుస్తారు. అయితే మన దగ్గర ఎక్కువ సినిమాల్లో కత్తెర కాటుకు బలైతున్నవి అశ్లీల సన్నివేశాలే.

ఎట్ల తీస్తరో చెబుతరు….

షూటింగ్ ప్రారంభం కాకముందు నటీనటులకు ఆ సన్నివేశాల గురించి వివరించే బాధ్యత దర్శక, నిర్మాతలది. ‘కౌగిలింత, లిప్‌‌ లాక్‌‌, రేప్‌‌ సీన్‌‌, నగ్న, శృంగార, అసభ్య సంభాషణలు’.. ఇలా సన్నివేశం ఎలాంటిదైనా కావొచ్చు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఆ యాక్టర్స్‌‌ నుంచి అంగీకార పత్రంపై సంతకాలు తీసుకుంటారు. ‘సీన్‌‌ ఎలా ఉండబోతుంది?, ఎంత నిడివి ఉంటుంది?, చిత్రీకరించే సమయంలో సెట్‌‌లో ఎవరెవరు ఉంటారు?’.. ఇలాంటి వివరాలన్నీ పూసగుచ్చినట్లు వివరించాలి. ఒకవేళ స్క్రిప్ట్‌‌లో అప్పటికి ఆ సీన్‌‌ గురించి స్పష్టత లేకపోతే, కనీసం సీన్‌‌ తీసే ముందు నటీనటులతో దర్శకుడు చర్చించాలి. అన్నింటికీ ఓకే అనుకున్న తర్వాతే అగ్రిమెంట్‌‌పై యాక్టర్స్‌‌ సంతకం చేస్తారు. అయితే, ‘మీటూ’ ఉద్యమం వెలుగులోకి వచ్చాక బోల్డ్‌‌ సన్నివేశాల చిత్రీకరణ వంకతో మేకర్లు, నటులు వేధించారని కొందరు నటీమణులు ఆరోపించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు అభ్యంతరాలు లేదని వీడియో రికార్డింగ్‌‌ల ద్వారా ఫిమేల్ యాక్టర్ల నుంచి స్టేట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నారు.

సెట్‌‌లో వీళ్లుండాల్సిందే…

సీన్‌‌లు చిత్రీకరించే సమయంలో నటీనటులతో పాటు దర్శకుడు, కెమెరా ఆపరేటర్, కెమెరా సహాయకుడు(అవసరం అయితేనే), స్క్రిప్ట్‌‌ సూపర్ వైజర్‌‌, బూమ్‌‌ ఆపరేటర్‌‌, తదితర సిబ్బంది ఉంటారు. సీన్‌‌ మొదలుపెట్టే ముందు అదనపు సిబ్బందిని బయటకు పంపించేస్తారు. నగ్న, శృంగార సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో డైరెక్టర్‌‌ ఒక్కసారి ‘యాక్షన్‌‌’ చెప్పగానే.. కెమెరా ఆపరేటర్‌‌ తప్ప మిగతా టెక్నీషియన్లు వెనక్కి తిరుగుతారు. విజువల్‌‌ ఎఫెక్ట్స్‌‌ సాయంతో మధ్యలో కొంతకాలం అలాంటి సీన్లను తెరకెక్కించారు. కానీ, తర్వాతి కాలంలో బోల్డ్‌‌ చిత్రాలకు ఫుల్‌‌ డిమాండ్‌‌ పెరగడంతో రియాల్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు దర్శకులు.  ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్‌‌ సినిమాల కోసం పరిమిత సంఖ్యలో టెక్నీషియన్ల సమక్షంలో బోల్డ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మ్యానేజ్‌‌ చేస్తరు…

వార్డ్‌‌రోబ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌. బోల్డ్ సీన్లు చిత్రీకరించేప్పుడు కీలక పాత్ర పోషించే విభాగం ఇది. ‘న్యూడ్‌‌ సూట్స్‌‌, మెర్కిన్‌‌, రోజ్‌‌వాటర్‌‌, గ్లిజరిన్‌‌ స్ప్రే’ ఎఫెక్ట్‌‌లను ఈ టీం అందిస్తుంది.  ఆర్టిస్ట్‌‌ల మేకప్ దగ్గరి నుంచి ప్రతీ విషయంలో  ఈ డిపార్ట్‌‌మెంట్‌‌ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. తద్వారా సన్నివేశం సహజంగా వచ్చేందుకు కృషి చేస్తుంది.  తర్వాత చెప్పుకోదగింది కెమెరా డిపార్ట్‌‌మెంట్‌‌ గురించి. సీన్‌‌ చిత్రీకరించే సమయంలో యాక్టర్ల మధ్య స్పేస్‌‌ లేకపోతే వాళ్లు ఇబ్బందిగా ఫీలయ్యే అవకాశం ఉంది. అందుకే కెమెరాలను కొంచెం దూరంగా ఉంచి సీన్లను తెరకెక్కిస్తారు. ఈ మధ్య కాలంలో వైల్డ్‌‌లైఫ్‌‌ ఫొటోగ్రాఫర్లు ఉపయోగించే టెక్నాలజీని ఇలాంటి సన్నివేశాల కోసం ఉపయోగిస్తున్నారు. వీళ్ల తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దర్శకుడి గురించి. ముందుగా ఆ సన్నివేశం అశ్లీలానికి సంబంధించింది కాదన్న భావనని నటీనటులకు కలిగించాల్సిన బాధ్యత డైరెక్టర్‌‌ది. షూటింగ్‌‌ సమయంలో లీడ్‌‌ క్యారెక్టర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. సన్నివేశం తీసేటప్పుడు చీర్‌‌లీడర్‌‌గా మారి నటీనటులను ప్రోత్సహించాలి. ఎరోటిక్‌‌ సీన్ల సమయంలో పొరపాట్లు జరగకుండా ఆర్టిస్ట్‌‌ల భావోద్వేగాలను నియంత్రించాలి.  మాస్టర్ షాట్‌‌(బ్రేక్‌‌ లేని సన్నివేశాలు) విషయంలో ఫిమేల్‌‌ యాక్టర్స్‌‌కి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫిమేల్ టెక్నీషియన్స్‌‌…

బాలీవుడ్‌‌లో బోల్డ్‌‌ కథలకు కేరాఫ్‌‌గా మారింది నిర్మాత ఏక్తా కపూర్‌‌. ‘ఏఎల్‌‌టీ బాలాజీ’ బ్యానర్‌‌పై వరుసబెట్టి ఎక్స్‌‌ట్రీమ్‌‌ రొమాంటిక్‌‌ వెబ్‌‌ సిరీస్‌‌లను తీస్తోంది. ఆ మధ్య ‘ట్రిపుల్‌‌ ఎక్స్‌‌’ సిరీస్‌‌ కోసం లేడీ సినిమాటోగ్రాఫర్‌‌ సహా పలువురు ఫిమేల్‌‌ టెక్నీషియన్లను నియమించుకుని సరికొత్త చర్చకు దారితీసింది. మగవాళ్ల సమక్షంలో సీన్లు చేయలేక హీరోయిన్లు షూటింగ్ నుంచి వెళ్లిపోయిన   సందర్భాలు ఉన్నాయి. పైగా వాళ్లు భద్రత విషయంలోనూ అనుమానాలతో ఉంటారు. ఆ భయం పోగొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటోంది ఏక్తా కపూర్‌‌. ఆమె కంటే ముందు దర్శకుడు అనురాగ్‌‌ కశ్యప్‌‌ ఒక బోల్డ్‌‌ షార్ట్‌‌ ఫిలిం మొత్తాన్ని మహిళా సిబ్బంది సమక్షంలోనే పూర్తి చేశాడు. వీళ్ల స్ఫూర్తితో మరికొందరు డైరెక్టర్లు కూడా ఇప్పుడు మహిళా సిబ్బంది సమక్షంలో సీన్లు చిత్రీకరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మన దగ్గర ఈ విషయం కొత్తదే అయినప్పటికీ హాలీవుడ్ సహా పలు సినీ పరిశ్రమల్లో అశ్లీల సన్నివేశాల కోసం లేడీ ‘క్రూ’ సాయం తీసుకోవడం మామూలు విషయమే.  కంటెంట్‌‌ విషయంలో సెన్సార్‌‌ తలనొప్పులు ఎందుకని అనుకుంటున్నారో ఏమో కొందరు మేకర్లు, తారలు.. అసలు అలాంటి సీన్లకు దూరం అంటున్నారు.

Latest Updates