
రెండు బ్యాంకులకు డిజిటల్ తంటాలు
డిజిటల్ సర్వీస్‌లలో అంతరాయాలే కారణం
డిజిటల్ గా కొత్త క్రెడిట్ కార్డుల ఇష్యూ చేయొద్దు: ఆర్బీఐ
పనిచేయని ఎస్బీఐ యోనో
బిజినెస్‌డెస్క్, వెలుగు: బ్యాంకుల టెక్నాలజీ సమస్యలతో కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతుండడంతో బ్యాంకుల యాప్స్, సర్వర్లలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. గత కొంత కాలం నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ యోనోల డిజిటల్ సేవలలో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేస్తున్నామని బ్యాంకులు సమర్ధించుకుంటున్నప్పటికీ, కస్టమర్లకు మాత్రం చేదు అనుభవాలే మిగులుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ సర్వీస్‌లు ఆగిపోవడంతో బ్యాంక్‌కు ఆర్బీఐ ఝలక్ ఇచ్చింది.
గత కొంత కాలం నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇతర ఆన్లైన్ సర్వీస్‌లలో తరుచుగా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లో ఎటువంటి కొత్త ప్రొడక్ట్‌లను లాంచ్ చేయొద్దని బ్యాంక్‌ను ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ 2.0 ప్రోగ్రామ్ కింద తీసుకురావాలను కున్న అన్ని సర్వీస్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. 2018 డిసెంబర్ లో బ్యాంక్ తీసుకొచ్చిన ఒక మొబైల్ అప్లికేషన్ లాంచ్ అయిన కొన్ని గంటల్లోనే క్రాష్ అయ్యింది. హెవీ ట్రాఫిక్ వలన ఈ అప్లికేషన్ క్రాష్ అయ్యిందని అప్పుడు బ్యాంక్ చెప్పుకొచ్చింది.
ఏడాది తర్వాత కూడా శాలరీ టైమ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆన్లైన్ చానెల్స్‌లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ సంఘటనలపై ఒక టీమ్ చేస్తుందని ఆర్బీఐ అప్పుడు పేర్కొంది. గత నెల 21 న కూడా బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. తమ ప్రైమరీ డేటా సెంటర్లో పవర్ ఫెయిల్యూర్ అవ్వడం వలనే బ్యాంక్ ఇంటర్నెట్ సర్వీస్‌లో సమస్యలు తలెత్తాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వివరణ ఇచ్చుకుంది. సాధారణంగా ఇలాంటి అంశాలలో ఫైనాన్షియల్ సంస్థలపై ఆర్బీఐ ఫైన్ వేస్తుంది.
కానీ బ్యాంక్ డిజిటల్ సర్వీస్‌లలో తరచూ అంతరాయాలు ఏర్పడడంతో ఈసారి తాత్కాలిక రెస్ట్రిక్షన్లను విధించింది. డిజిటల్ సర్వీస్‌లలో లోపం ఎక్కడుందో బోర్డు పరిశీలిస్తోందని, త్వరలో ఫిక్స్ చేస్తామని బ్యాంక్ పేర్కొంది. ఈ రెస్ట్రిక్షన్లు తాత్కాలికమేనని, డిజిటల్ సేవలు సంతృప్తికరంగా అనిపిస్తే ఆర్బీఐ వీటిని తొలగిస్తుందని తెలిపింది. కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓగా శశిధర్ జగదీషన్ ఎన్నికైన రెండు నెలల్లోనే బ్యాంక్‌పై ఈ తాత్కాలిక రెస్ట్రిక్షన్లు విధించడం గమనార్హం.
ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డులపై నో ఎఫెక్ట్!
గత రెండేళ్ల నుంచి బ్యాంక్ ఐటీ సిస్టమ్‌ను డెవలప్ చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. ఈ రెస్ట్రిక్షన్ల విషయంలో ఆర్బీఐతో కలిసి పనిచేస్తామని తెలిపింది. ‘కస్టమర్లకు నిరంతరంగా డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్‌లను అందించాలని ప్రయత్నిస్తున్నాం. తాజాగా తమ డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్‌లలో ఏర్పడిన అంతరాయాలను పరిష్కరించేందుకు అనేక చర్యలను తీసుకున్నాం. ఈ చర్యల వలన ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డ్‌లు, డిజిటల్ బ్యాంకింగ్ చానెల్స్ వంటి వాటిపై ఎటువంటి ప్రభావం ఉండదని ఆశిస్తున్నాం’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. సెప్టెంబర్ నాటికి బ్యాంక్‌కు 1.49 కోట్ల క్రెడిట్ కార్డ్ కస్టమర్లుండగా, 3.38 కోట్ల డెబిట్ కార్డు కస్టమర్లున్నారు. ఆర్బీఐ విధించిన తాత్కాలిక రెస్ట్రిక్షన్ల వలన బ్యాంక్ ఓవరాల్ బిజినెస్‌పై పెద్దగా ప్రభావం ఉండదని బ్యాంక్ తెలిపింది.
3 నెలల వరకు రెస్ట్రిక్షన్లు: మాక్వైరీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై విధించిన తాత్కాలిక రెస్ట్రిక్షన్లు 3 నుంచి 6 నెలల వరకు ఉండొచ్చని బ్రోకరేజి సంస్థ మాక్వైరీ క్యాపిటల్ అభిప్రాయపడింది. బ్యాంక్ తన టెక్నాలజీ లోపాలను ముందు ఫిక్స్ చేసుకోవాల్సి ఉందని, దీంతో పాటు తన టెక్ కెపాసిటీని కూడా పెంచుకోవాల్సి ఉందని తెలిపింది. వీటిని చేయడానికి కనీసం మూడు నెలలైనా పడుతుందని , ఈ సమస్యలన్ని పరిష్కారమయితే గాని ఆర్బీఐని రివ్యూ చేయమని కోరదని పేర్కొంది.
ఎస్బీఐ యో‘నో’..
టెక్నాలజీ సమస్యలతో ఎస్బీఐ యోనో యాప్ గురువారం సరిగ్గా పనిచేయలేదు. యోనో వాడుతున్నప్పుడు ఎర్రర్ ఎం005 మెసెజ్ వస్తోందని ట్విటర్లో ఎస్బీఐకి కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ టెక్నాలజీ సమస్యను పరిష్కరిస్తున్నామని ఎస్బీఐ పేర్కొంది. కస్టమర్లు ఆన్లైన్ ఎస్బీఐ, యోనో లైట్‌ను వాడుకోవాలని కోరింది. యోనోని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఎస్బీఐకి 49 కోట్ల మంది కస్టమర్లున్నారు. ప్రతి రోజు కొన్ని కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుపుతోంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్లలో 55 శాతం డిజిటల్ ద్వారానే జరుగుతుండగా, ఇందులో కూడా సగం యోనో ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎస్బీఐ యోనోకి 2.76 కోట్ల మంది యూజర్లున్నారు.