6 పైసల చార్జీ రివ్యూ అడగడం..2జీ ఆపరేటర్లకు వత్తాసే

న్యూఢిల్లీ: ఇంటర్‌‌కనెక్ట్‌‌ యూసేజ్‌‌ చార్జీ (ఐయూసీ) రివ్యూ చేయాలనే ట్రాయ్‌‌ ప్రతిపాదన పాత ఆపరేటర్ల ప్రయోజనాలను కాపాడేందుకునేనని, దీని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని జియో ఆరోపిస్తోంది. ప్రధాన మంత్రి విజన్‌‌ డిజిటల్‌‌ ఇండియాకూ ఇది భంగం కలిగిస్తుందని విమర్శించింది. ఐయూసీ ఛార్జ్‌‌ల రద్దుకు జనవరి 1,2020 ని ట్రాయ్‌‌ గతంలో గడువుగా నిర్దేశించిందని, ఈ షెడ్యూల్‌‌ను మారిస్తే ఉచిత వాయిస్‌‌ కాల్స్‌‌ చేసుకునే వీలు కస్టమర్లకు లేకుండా పోతుందని పేర్కొంది.  తమ కస్టమర్లు ఇతర ఆపరేటర్ల నెట్‌‌వర్క్‌‌లకు చేసే ఫోన్‌‌ కాల్స్‌‌ మీద ఐయూసీ చార్జీలను టెలికం ఆపరేటర్‌‌లు చెల్లిస్తారు. ఈ ఐయూసీ ప్రస్తుతం నిమిషానికి 6 పైసలుగా ఉంది. ఐయూసీ నిలిపివేత గడువును పొడిగించాలనే ట్రాయ్‌‌ ఆలోచన వల్ల తాము తప్పనిసరిగా యూజర్ల నుంచి ఆ 6 పైసలు వసూలు చేయాల్సి వస్తోందని వాపోయింది. 2 జీ కస్టమర్లు ఎక్కువగా ఉన్న పాతకాలపు ఆపరేటర్లు డిజిటల్‌‌ రివల్యూషన్‌‌ ఫలాలను ప్రజలకు అందకుండా చేస్తున్నారని విమర్శించింది. అలాంటి ప్లేయర్లకు ట్రాయ్‌‌ చర్యలు మద్దతుగా నిలుస్తున్నాయని ఆరోపిస్తోంది.

కొంత మంది ఆపరేటర్లు తమ 2 జీ కస్టమర్ల నుంచి వాయిస్‌‌ కాల్స్‌‌కు అధిక రేట్లను పిండుకుంటున్నారని విమర్శించింది. తమ 4 జీ ఓన్లీ కస్టమర్లందరికీ నిజానికి వాయిస్‌‌ కాల్స్‌‌ పూర్తి ఉచితమని తెలిపింది. ట్రాయ్‌‌ కన్సల్టేషన్‌‌ పేపర్‌‌ రూపకల్పన కోసం ఆయా ఆపరేట్లర అభిప్రాయాలను అడిగింది. జియో అధికారికంగా తన అభిప్రాయాన్ని ట్రాయ్‌‌కు సమర్పించింది. జీరో టెర్మినేషన్‌‌ చార్జీల దిశకు మళ్లడం వల్లే కస్టమర్లకు టారిఫ్‌‌లు తగ్గుతాయని రిలయన్స్‌‌ జియో వాదిస్తోంది. టెలికం రంగంలో కొత్త పెట్టుబడులపై ట్రాయ్‌‌ ఆలోచన ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుందనీ రిలయన్స్‌‌ జియో చెబుతోంది. ఓవైపు ప్రపంచమంతా 5 జీ వైపు పరుగులు పెడుతుంటే, ఇండియా ఇంకా 2 జీని ప్రమోట్‌‌ చేయడం శోచనీయమని జియో వాపోతోంది. బిల్‌‌ అండ్‌‌ కీప్‌‌ (బీఏకే) విధానాన్ని ముందుగా అనుకున్నట్లుగా జనవరి 1, 2020 నుంచి అమలులోకి తేవాలని, దానిని పొడిగించడంలో అర్థం లేదని జియో అంటోంది.

 

 

Latest Updates