కులం ఓట్లపై టీఆర్ఎస్ గురి..

  • ఇప్పటికే గౌడ, ముదిరాజ్ కుల సంఘాలతో సమావేశాలు
  • నిన్న మున్నూరుకాపు, ఆర్య వైశ్యులతో మీటింగ్​
  • ఆర్య వైశ్య కార్పొరేషన్​ఏర్పాటు చేస్తామని హామీ
  • రోజూ రెండు, మూడు సంఘాలతో భేటీ
  • కొన్ని గ్రూపులే హాజరు.. కొందరి అలక
  • హామీల మీద హామీలిస్తున్న కేటీఆర్​.. గత హామీలను గుర్తుచేస్తున్న కుల సంఘాలు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే కులాలను మచ్చిక చేసుకోవడంపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజు రెండు మూడు కులసంఘాల ఆత్మీయ సమావేశాలకు హాజరవుతున్నారు. ఆ సంఘాల డిమాండ్లను పరిష్కరించేందుకు చొరవ చూపుతామని హామీలు ఇస్తున్నారు. యాదవ, మున్నూరు కాపు, గౌడ, ముదిరాజ్ కులాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు ఏపార్టీ వైపు  మొగ్గుచూపితే ఆ పార్టీకి విజయం ఖాయమనే టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఆ బీసీ కులాల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది. కుల సంఘాల సమావేశాలను ఆ కులాలకు చెందిన మంత్రులకు అప్పగించింది. దీంతో మంత్రులు తమ కులాల ప్రతినిధులను ఒక్కచోటుకి రప్పించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. గౌడ కుల సమావేశాన్ని నిర్వహించేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ కులం ప్రతినిధులకు నచ్చచెప్పేందుకు ఐదు రోజుల టైం పట్టినట్టు తెలిసింది. ఎన్నికల తర్వాత గౌడ కులస్తుల గురించే  ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని, నీరా పాలసీని హైదరాబాద్ వ్యాప్తంగా ఎప్పుడు అమల్లోకి తెస్తారో క్లారిటీ లేదని కొందరు తీవ్ర అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. ఇప్పటివరకు గౌడ, ముదిరాజ్, ఆర్యవైశ్య, మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

వైశ్యులకు టార్గెట్

హైదరాబాద్ పరిధిలో వైశ్యులు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు. దీంతో కుల సంఘానికి చెందిన భగ్గారపు దయానంద్ కు ఎమ్మెల్సీ, మరో ఇద్దరికి  కార్పొరేషన్ పదవులు ఇచ్చారు.  పదవులు ఇచ్చినందుకు వైశ్య ప్రతినిధులు కేటీఆర్ కు థాంక్స్ చెప్పేందుకు వెళ్లారు. ఆ సమయంలో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు ఆర్థిక వనరులు సమకూర్చాల్సి ఉంటుందని ఆసలు విషయాన్ని వివరించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.

ఈసారి కమ్మలు ఎటువైపు..

కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మంట్ పరిధిలో కమ్మ కులస్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమ్మ కులం సమావేశానికి కేటీఆర్ స్వయంగా హాజరయ్యారు. ఈసారి మీటింగ్ మాత్రం ఆ కులానికి చెందిన మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగింది. కానీ మెజార్టీ కమ్మ ప్రతినిధులు టీఆర్ఎస్ కు దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

సమావేశానికి దూరం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యాదవులు పెద్దసంఖ్యలో ఉన్నారు. కాని ఈసారి ఎన్నికలకు యాదవ కులం మొత్తం టీఆర్ఎస్ కు సంఘీభావం తెలుపలేదని తెలిసింది. రెండు రోజుల క్రితం నాగోల్ ప్రాంతంలో యాదవుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరుకావాల్సి ఉంది. కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వ్యతిరేకించే మరో వర్గం యాదవులు ఆ సమావేశానికి దూరంగా ఉండటాన్ని కొందరు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో  కేటీఆర్ ఆ సమావేశానికి వెళ్లలేదని చర్చ జరుగుతోంది.

 

Latest Updates