కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి అవేవీ పట్టనట్టుంది: లక్ష్మణ్

ఆర్టీసీ కార్మికులు, వారి పోరాటానికి మద్దతిస్తోన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం అణిచివేతకు పాల్పడుతోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్.  ఆర్టీసీ సమ్మె విషయంలో కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం మాత్రం అవేవీ పట్టనట్టు వ్యవహరిస్తుందన్నారు.

ఆర్టీసీ ఆస్తులపై టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు కన్నేశారని, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. కుట్రలో భాగంగానే సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పిలిచి చర్చించాల్సింది పోయి,  సీఎం కేసీఆర్ వారి పట్ల బెదిరింపు ధోరణితో ప్రవర్తిస్తున్నారన్నారు. ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారంటూ వారి ఉద్యోగాలపై వేటు వేయడమే కాకుండా జీతాలివ్వక వేధిస్తున్నారన్నారు లక్ష్మణ్.

సామాన్యుడి రావాణా సాధనంగా పేరుగాంచిన ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా..  టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరిస్తోందని,  తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని లక్ష్మణ్ అన్నారు.  కోర్టు చీవాట్లు పెట్టినా,  ఆర్టీసీ కార్మికులు అలుపెరగకుండా ఉద్యమించినా.,  బస్సుల్లేక ప్రజలు అనేక కష్టాలకు గురవుతున్నా  ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తుందన్నారు.

ఈ నేపథ్యంలో మొద్దునిద్ర పోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు రేపు (నవంబర్ 9న) హైదరాబాద్ ట్యాంక్ బండ్ నందు ఆర్టీసీ జేఏసీ నిర్వహిస్తోన్న మిలియన్ మార్చ్ కు బీజేపీ తెలంగాణ పూర్తి మద్దతునిస్తుందన్నారు లక్ష్మణ్.  బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి 35 రోజులుగా ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలవాలని కోరుతున్నానని ఆయన తెలిపారు.

TRS government is cracking down on BJP leaders and activists says Laxman

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates