ఎంఐఎంతో దోస్తీ దెబ్బ కొడుతుందా? : టీఆర్ఎస్ నేతల్లో బుగులు

టీఆర్ ఎస్ నేతల్లో బుగులు
పొత్తు ప్రచారాన్నితిప్పికొట్టే ప్రయత్నం

ఎంఐఎంతో దోస్తీ మున్సిపోల్స్​లో దెబ్బ కొడుతుందన్న భయం టీఆర్​ఎస్​ నేతలకు పట్టుకుంది. ప్రచారం ముగింపు దశలో వాళ్లు.. ఎంఐఎంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఓటర్లకు చెప్పే ప్రయత్నం చేశారు. అండర్​స్టాండింగ్​లో భాగంగా కొన్ని మున్సిపల్​ చైర్​పర్సన్​ సీట్లను ఎంఐఎంకు ఇవ్వాలని టీఆర్​ఎస్​ చూస్తోందన్న ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయని కొందరు గులాబీ నేతలు అంటున్నారు. రెండు పార్టీలకు మధ్య ఎన్నికల పొత్తు ఉందని బీజేపీ చేస్తున్న ప్రచారం కూడా నష్టం చేకూరుస్తుందని అంతర్గత సమావేశాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎంఐఎం సభకు వెళ్లి తప్పుచేశామని..!

ఎన్నికల టైంలోనే సీఏఏ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల ఎంఐఎం ఆందోళనలకు దిగింది. ఈ ఆందోళనలకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందన్న ఆరోపణలు వచ్చాయి. ‘‘ప్రగతిభవన్ వేదికగా సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం సంస్థలతో సమావేశం పెట్టడం సరికాదు. పైగా ఎంఐఎం నిర్వహించే ఆందోళనకు సపోర్టు చేస్తామని చెప్పడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్లాయి. నిజామాబాద్ లో ఎంఐఎం నిర్వహించిన సభకు మా పార్టీ వాళ్లు వెళ్లి తప్పు చేశారు’’ అని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలంటూ ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్​ ఒవైసీ పదే పదే డిమాండ్ చేయడం.. దానిపై టీఆర్ఎస్  మౌనంగా ఉండటం కూడా కొంత ఇబ్బందిగా తయారైందని ఎమ్మెల్యే అన్నారు. ‘‘భైంసా మున్సిపాలిటీలో 3 వార్డుల్లో ఎంఐఎం క్యాండిడేట్లు ఏకగ్రీవమయ్యారు. ఇది మాకు సమస్యయింది. అక్కడ మా పార్టీ అభ్యర్థులను దింపక తప్పుచేసింది. దీని వల్ల ఎంఐఎంకు సపోర్టు ఇచ్చారనే ఆరోపణలకు బలం చేకూరినట్లయింది’’ అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే  ఒకరు అన్నారు.

విమర్శలు తిప్పకొట్టే ప్రయత్నం

ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని ప్రగతిభవన్ నుంచి ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. దీంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంఐఎంపై విమర్శలకు దిగారు. ఎంఐఎం, బీజేపీకి మధ్య అవగాహన ఉందని, అందుకే ఎంఐఎం పోటీ చేస్తున్న చోట బీజేపీ అభ్యర్థులను పోటీకి దింపలేదని టీఆర్​ఎస్​ నేతలు ఆరోపించారు. ఎంఐఎంకు ఎక్కడా తాము మేయర్, చైర్​పర్సన్​ పదవులు ఇవ్వబోమని మంత్రి ప్రశాంత్​రెడ్డి, ఎమ్మెల్యే గణేశ్​ గుప్తా స్పష్టం చేశారు. ఎంఐఎంతో పొత్తు లేదని ఎమ్మెల్యే  గణేశ్​ గుప్తా  దేవుడిపై  ప్రమాణం చేశారు. తాండూరు మున్సిపల్ చైర్​పర్సన్​ పదవి ఎంఐఎంకు ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం తీవ్రం కావడంతో టీఆర్​ఎస్​ పెద్దలు అలర్టయ్యారు. మంత్రి తలసానినితాండూరుకు పంపించారు. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదని ఆయన ప్రచారంలో చెప్పారు.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates