లాక్ డౌన్ టైంలో టీఆర్​ఎస్​ నేతల భూ దందా.!

మంచిర్యాల, వెలుగునెన్నెలలోని 502 సర్వే నంబరులో విద్యుత్​ సబ్​స్టేషన్​ను రెండెకరాల్లో ఏర్పాటు చేశారు. ఆర్​అండ్​బీ రోడ్డుకు సబ్​స్టేషన్​కు మధ్య నాలాను వాననీళ్లు పోయేందుకు వదిలేసి దాని అవతల ఫెన్సింగ్​ వేశారు. ఇదిలా ఉండగా, నెన్నెలకు చెందిన టీఆర్ఎస్​ నాయకులు ఎండీ.ఇబ్రహీం, దుర్శెట్టి రవీందర్ అదే సర్వేనంబరులో నాలుగేళ్ల క్రితం చెరి పది గుంటల భూమిని కొనుగోలు చేశారు. కానీ వారు ఇంతవరకు పొజిషన్​లో లేరు. ఇటీవల లాక్​డౌన్​ సమయంలో అదనుచూసి సబ్‌‌స్టేషన్​ ముందున్న నాలాతో పాటు రోడ్డుకు అవతలివైపు ఉన్న ఒర్రెను మట్టితో పూడ్చివేశారు. మర్రిచెట్టు ఊడలను తొలగించి సుమారు పది గుంటల స్థలాన్ని చదునుచేసి ఆక్రమణకు పూనుకున్నారు. ఈ విషయాన్ని కొంతమంది కలెక్టర్​ భారతి హోళికేరితో పాటు విద్యుత్​ శాఖ హయ్యర్​ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సదరు వ్యక్తులు సబ్​స్టేషన్ స్థలాన్ని ఆక్రమించుకున్నారని, నాలాలో పోసిన మట్టిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఏఈ మల్లేశ్  ఏప్రిల్​ 21న ఎస్సైకి, తహసీల్దార్​కు కంప్లైంట్ చేశారు. రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేసి సబ్​స్టేషన్​ స్థలంలో మట్టిపోసినట్లు ధ్రువీకరించారు.

ఆ మట్టిని తొలగించి నాలాను క్లియర్​ చేయాలని సంబంధిత వ్యక్తులకు తహసీల్దార్​ ఆదేశాలు జారీ చేశారు. సరైన డాక్యుమెంట్లతో కంప్లైట్ చేయాలని ఎస్సై సూచించడంతో ఏఈ మల్లేష్​ పిటిషన్​ను వెనక్కు తీసుకున్నారు. ఇదే అదనుగా సదరు నాయకులను కాపాడేందుకు నియోజకవర్గ స్థాయి కీలక నేత ఒకరు ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. వారిపై కేసు కాకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో విషయం హయ్యర్​ ఆఫీసర్లకు తెలిసింది. వారి ఆదేశాలతో ఏఈ మల్లేశ్​ తాజాగా శుక్రవారం సంబంధిత డాక్యుమెంట్లు జతచేసి పోలీసులకు కంప్లైట్ చేశారు. ఈ మేరకు ఎండీ.ఇబ్రహీం, దుర్శెట్టి రవీందర్​లపై ఐపీసీ 427, 447 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నెన్నెల ఎస్సై రమాకాంత్​ తెలిపారు. సదరు నాయకులు లాక్​డౌన్​, వాల్టా రూల్స్​ను బ్రేక్​ చేసిననప్పటికీ ఆఫీసర్లు చూసీచూడనట్టు వదిలేయడం గమనార్హం.

 

Latest Updates