గులాబీ లీడర్ల గొంతులు మూగబోయినయ్​!

చప్పుడు చేయని టీఆర్ఎస్​ సీనియర్లు

మీడియా ముంగటికి వచ్చుడే లేదు.. టీవీ చర్చల్లేవ్

ప్రగతిభవన్ ఆదేశాలు ఉంటెనే నోరు విప్పుతున్నరు

హైకమాండ్​ చెప్పిన నేతలే ప్రెస్​మీట్లు పెడ్తున్న తీరు

మౌనంగా ఉద్యమ లీడర్లు

ఏం జరుగుతుందోనన్న గందరగోళంలో పార్టీ కేడర్

హైదరాబాద్, వెలుగు: తమ మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన టీఆర్ఎస్  సీనియర్ల గొంతులు మెల్లమెల్లగా మూగబోతున్నాయి. తొలి ప్రభుత్వంలో ఉన్న దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. అప్పట్లో కేసీఆర్ పై, సర్కారుపై, పార్టీపై చీమ చిటుక్కుమన్నా సహించేవారు కాదు. మరుక్షణమే ప్రతిపక్షాలపై విరుచుకుపడేవారు. ప్రెస్ మీట్లు పెట్టి, టీవీ చర్చల్లో పాల్గొని కౌంటర్లు ఇచ్చేవారు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక గులాబీ సీనియర్లలో మార్పు కనిపిస్తోంది. ఈ మధ్య బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా వారంతా మౌనంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఒకరిద్దరు లీడర్లు మీడియా ముందుకు వస్తున్నా.. ప్రగతిభవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మాట్లాడుతున్నారని టీఆర్ఎస్​ వర్గాల్లో చర్చ ఉంది. అదికూడా ఏ విషయంపై మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలన్నది ప్రగతిభవన్ నుంచి వచ్చిన నోట్ అధారంగానే ఉంటోందని అంటున్నారు. ఒక్కోసారి ప్రగతిభవన్ నుంచి వచ్చే గైడెన్స్ పై మంత్రులు, ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్​ అవుతున్నారు. ప్రతిపక్ష నేతల విమర్శలకు గట్టి జవాబు ఇచ్చేందుకు రెడీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చి.. కొంతసేపటి తర్వాత ఏమీ మాట్లాడొద్దని చెప్తుండటంతో గందరగోళంగా మారుతోందని అంటున్నారు.

మౌనంగా ఉద్యమ మంత్రులు

గతంలో ఎవరైనా టీఆర్ఎస్​ సర్కారుపై, కేసీఆర్ పై విమర్శలు చేస్తే ఘాటుగా తిప్పికొట్టేందుకు మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ముందు వరసలో ఉండేవారు. ఎలాంటి ఆదేశాలు లేకుండానే విమర్శలను ఖండించేవారు. తర్వాత వారు పొలిటికల్​ అంశాలపై మాట్లాడటం తగ్గిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వరకు కూడా ఫలానా అంశంపై మాట్లాడాలని ప్రగతిభవన్ నుంచి సూచనలు వస్తేనే వారు గొంతు విప్పేవారని, ఈ మధ్య అక్కడ్నించి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో మౌనంగా ఉంటున్నారని టీఆర్ఎస్​లో టాక్  ఉంది. ఈ మధ్య ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శలు చేస్తున్నా సీనియర్లెవరూ మాట్లాడట్లేదు. దీనిపై ఓ ఉద్యమ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ మధ్య పెద్ద సార్  తీరు ఎందుకు మారిందో అర్థం కావడం లేదు, మీడియా ముందుకు వెళ్లేందుకు మాకు కూడా చాన్స్ ఇవ్వడం లేదు’’ అని వాపోయారు. ఇక మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతున్నా.. కేవలం వారి జిల్లాల్లోని రాజకీయ పరిస్థితుల మేరకే గొంతు విప్పుతున్నట్టు చర్చ ఉంది. గతంలో ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్లు పెట్టే తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్  కూడా ఇటీవల మీడియా ముందుకు రావట్లేదు.

ప్రగతిభవన్ సూచనల మేరకే..

ఈ మధ్య కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఆందోళన చేశారు. అయితే వారంతా సొంత నిర్ణయంతో ప్రొటెస్ట్ చేయలేదు. ప్రగతిభవన్ డైరెక్షన్ మేరకే నడుచుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ మధ్య బీజేపీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్ వరుసగా సీఎం కేసీఆర్ పై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రగతిభవన్ ఓ టీమ్ ను ఎంపిక చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. విప్​లు గువ్వల బాలరాజు, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆ టీమ్​లో ఉన్నారని, వారిని ఎందుకు ఎంపిక చేశారని కొందరు లీడర్లు ఆరా తీస్తున్నారని చెప్తున్నారు.

ప్రెస్ మీట్లు లేవు.. మాట్లాడేటోళ్లు లేరు

తొలి ప్రభుత్వంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు ప్రతిపక్షాల విమర్శలపై వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించేవారు. కాని తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడం తగ్గిపోయింది. ఇక పార్టీ అధికార ప్రతినిధులు మీడియా ముందుకొచ్చి ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇచ్చేవారు. టీవీ చర్చల్లో పాల్గొని ఘాటుగా స్పందించేవారు. కానీ ఇప్పుడట్లా ఎవరూ మీడియా ముందుకు రావట్లేదు. అసలు పార్టీ అధికార ప్రతినిధులనే తొలగించారు. టీవీ చర్చలకు వెళ్లొద్దని ఆదేశించారు. ఒకవేళ తప్పదు అనుకుంటే ప్రగతిభవన్ వర్గాలు సూచించిన వ్యక్తులు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.

ఖమ్మం నుంచి పిలిచారు.. పొమ్మన్నరు

బండి సంజయ్ ఖమ్మం జిల్లా పర్యటనలో కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై మాట్లాడేందుకు హైదరాబాద్ కు రావాలని ఖమ్మంలో ఉన్న మంత్రి పువ్వాడకు ప్రగతిభవన్ నుంచి ఫోన్ వెళ్లింది. దాంతో మంత్రి హడావుడిగా హైదరాబాద్ కు వచ్చారు. ప్రెస్ మీట్ ఉన్నట్టు మీడియాకు ఇన్ఫర్మేషన్​ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో ప్రెస్ మీట్ రద్దు చేస్తున్నట్టు టీఆర్ఎస్ ఎల్పీ వర్గాల నుంచి మెసేజీ వచ్చింది. ప్రెస్ మీట్ ఎందుకు రద్దు చేసుకున్నారని మంత్రి సన్నిహితులను అడిగితే.. ‘‘ప్రగతిభవన్ నుంచి ఫోన్ వచ్చింది. హైదరాబాద్ లో మాట్లాడవద్దని, ఖమ్మంలో చేసిన విమర్శలకు అక్కడే కౌంటర్ ఇవ్వండి’’ అని ఆదేశాలు వచ్చాయని చెప్పడం గమనార్హం.

బీజేపీకి కేటీఆర్ అప్పీల్ ఏంది?

టీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  శనివారం బీజేపీ నేతలకు చేసిన అప్పీల్ ఆసక్తిగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్​ ఓ డెవలప్​మెంట్​ కార్యక్రమాన్ని ప్రారంభించేప్పుడు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కొత్త కార్పొరేటర్లను పిలవకపోవడంతో ‘కేటీఆర్ గో బ్యాక్’ అంటూ నిరసన తెలిపారు. కొందరు బీజేపీ కార్యకర్తలు కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై కేటీఆర్​ స్పందిస్తూ.. ‘‘ఎలక్షన్ల టైంలో పోటీ పడుదాం. ఎవరి వాదన వారు గట్టిగా వినిపిద్దాం. ఎలక్షన్ల తర్వాత డెవలప్​మెంట్​ కోసం కలిసి పనిచేద్దాం’ అని విజ్ఞప్తి చేయడంపై చర్చ జరుగుతోంది.

Latest Updates