ఏడ తొక్కాల్నోగాడనే తొక్కుతా: TRS ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నల్లగొండ, వెలుగు: నల్లగొండ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి సహనం కోల్పోయారు. స్థానిక సమస్యలు లేవనెత్తిన ప్రజలపై ఒంటికాలితో లేచ్చారు. ‘‘పిచ్చికుక్కలు’’ అంటూ తిడుతూ.. ‘‘ఏడ తొక్కాల్నో గాడనే తొక్కుతా”అంటూ బెదిరింపులకు దిగారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండురోజుల క్రితం ఆయన కనగల్​ మండలం తుర్కపల్లి గ్రామంలో పర్యటించారు. పలువురు గ్రామస్తులు మంచినీళ్లు రావడం లేదని, తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. వాహనంపైనున్న ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి.. నోటికొచ్చింది అనేశారు. ‘‘మీరు చేసేది కరెక్టా?  ఇది పద్ధతి కాదు. వదిలేయండి వాళ్లను వదిలేయండి. పిచ్చికుక్కలు. రేపు చెప్త మీది. ఎలక్షన్​ తర్వాత చూపిస్త నేనేందో కూడా. నా మీటింగ్​కు మీరు అడ్డమస్తున్నరు కదా”అంటూ మాటలు అందుకున్నారు. ‘‘వాళ్ల బాదేంది అంటే ఎమ్మెల్యేగా మనమే గెలిస్తిమి.. సర్పంచ్​ మనమే గెలిస్తిమి.. ఇగ వాళ్లకు దిక్కులేక గిట్లాంటవి చేస్తున్నరు. రేపు ఎలక్షన్ల తర్వాత గిట్లాంటి దౌర్జన్యం చేస్తే ఏడ తొక్కాల్నో గాడనే తొక్కుతా.  భూపాల్​రెడ్డి అంటే మామూలు మనిషేం కాదు. గాజులు పెట్టుకోలె.. చూపిస్త అది గూడా”అంటూ భూపాల్​రెడ్డి హెచ్చరించారు. ‘‘ఈడ మనతోటి అనిపిస్తరు. వీడియోలు తీస్తరు. వీడియో తీసి పెడ్తరు సిగ్గులేనోళ్లు. గిది గాళ్ల సక్కదనం’’ అంటూ ఊగిపోయారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు, వీడియో దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఆయన తీరుపై ప్రజలు, ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇటీవల తాగునీటి సమస్యపై ఓ గ్రామంలో వార్డుమెంబర్​ ప్రశ్నిస్తే కూడా ఇదే రీతిలో ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి చిందులు వేశారు.

Latest Updates