కేకే రెడీ.. కార్మికులు రెడీ మరి సర్కార్​?

చర్చలపై సందిగ్ధత.. ఇంకా అనుమతివ్వని కేసీఆర్
సీఎంతో మాట్లా డేందుకు ట్రై చేసిన కేకే..

ప్రగతి భవన్ పిలుపు కోసం ఎదురుచూపులు
అందుబాటులోకి రాని కేసీఆర్​
సమ్మెతో పరిస్థితులు చేజారిపోతున్నాయన్న కేకే
తాను కార్మికుల పక్షమేనని, రాజ్యం పక్షం కాదని వెల్లడి

ఆర్టీసీ కార్మిక సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, సీఎం ఆదేశిస్తే తాను చర్చలు జరిపేందుకు సిద్ధమని సోమవారం టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే తామూ చర్చలకు సిద్ధమేనని యూనియన్​ నేతలు కూడా చెప్పడంతో.. ఇక చర్చలు జరిగి సమ్మెకు పుల్​స్టాప్​ పడుతుందని అధికార పార్టీ టీఆర్​ఎస్​ నేతలు కూడా ఆశించారు. కానీ..  రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి కదలిక లేదు. మధ్యవర్తిత్వం కోసం కేకేకు ప్రగతిభవన్​ నుంచి అసలు పిలుపే రాలేదు.

ఎదురుచూసిన కేకే

సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేకే  ప్రగతిభవన్ కు వెళ్లి సీఎంను కలిసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ్నించి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన ఇంటికి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం నుంచి కూడా ఇంట్లోనే ఉండి ప్రగతి భవన్​ పిలుపు కోసం కేకే ఎదురుచూశారు. సీఎం నుంచి పిలుపు వస్తే వెళ్లి కలిసి ఆర్టీసీ సమ్మె విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించాలని ఆయన ప్లాన్  చేసుకున్నారు. ఆదేశిస్తే ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాననే  విషయాన్ని కూడా చెప్పాలనుకున్నారు. సాయంత్రం వరకు కూడా ప్రగతిభవన్  నుంచి ఎటువంటి పిలుపు, అనుమతి రాలేదు. మరోవైపు కేకే నుంచి పిలుపు వస్తుందేమోని ఆర్టీసీ యూనియన్​ నేతలు ఎదురుచూశారు. ఆయన చొరవ తీసుకుంటే చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వాళ్లు మరోసారి ప్రకటించారు. కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చర్చలు సందిగ్ధంలో పడ్డాయి. ఇదిలా ఉంటే  సీఎం కేసీఆర్  ఉదయం నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ప్రగతిభవన్ లోనే ఉండి.. అటు తర్వాత గజ్వేల్ లోని తన ఫాంహౌస్ కు వెళ్లిపోయారు.

కేకే ఇంటి వద్ద మీడియా హడావుడి

ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు కేకేను మధ్యవర్తిత్వం వహించాలని సీఎం కోరుతారని ప్రచారం జోరుగా సాగడంతో మంగళవారం ఉదయమే పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు కేకే నివాసానికి చేరుకున్నారు. ‘‘సార్ ఇంట్లో ఉన్నారా… ప్రగతిభవన్ కు వెళ్లారా.. అక్కడ్నించి ఏమైనా ఫోన్ వచ్చిందా’’ అని ఆయన సిబ్బందిని ఆరా తీశారు. కానీ కేకే ఒక్కరే ఇంట్లో కనిపించారు. అంతకు ముందు కేకేను కాంగ్రెస్​ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిశారు. సమ్మె విషయంలో  కేకే విడుదల చేసిన లేఖను చూసి తను ఆయన్ను కలిశానని విశ్వేశ్వర్​రెడ్డి చెప్పారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేకే మాత్రమే మనస్సుతో స్పందించారని అన్నారు. సమ్మె కారణంగా అందరూ నష్టపోతున్నారని చెప్పారు.

టీఆర్​ఎస్​ వర్గాల్లో ఆసక్తి

కేకే  మధ్యవర్తిత్వంపై టీఆర్​ఎస్​ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ‘‘సమ్మె ముగిసినట్టేనా.. కేకేకు బాధ్యతలు అప్పగించారా’’ అంటూ కొందరు నేతలు చర్చించుకోవడం కనిపించింది. ప్రభుత్వంలో మంత్రులు ఉండగా వారిని కాదని సీఎం కేసీఆర్​ కేకేకు ఆ చాన్స్ ఇస్తారా? అనే చర్చ కూడా పొద్దంతా నడిచింది.

పరిస్థితులు చేజారిపోతున్నాయి: కేకే

ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రంలో పరిస్థితులు చేజారిపోతున్నాయని కేకే ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో  చిట్​చాట్​లో మాట్లాడారు. ‘‘చర్చలు జరిపేందుకు నేనెవర్ని? అది పార్టీ ఇష్యూ కాదు. ప్రభుత్వ సమస్య. చర్చలు జరుపుతానని నేను చెప్పలేదు.  కానీ కార్మికులు నాతో చర్చలకు సానుకూలంగా ఉండటం మంచి పరిణామం” అన్నారు. అయితే చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి రాలేదని తెలిపారు. ‘‘ఈ విషయంలో కేసీఆర్​తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆయన నాకు అందుబాటులోకి రావట్లేదు. నేను సోషలిస్టును, ఎప్పుడూ రాజ్యం వైపు ఉండను.. కార్మికుల పక్షం ఉంటా’’ అని అన్నారు. సమ్మె విషయంలో అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏంటో తనకు తెలియదని, తెలిస్తే సమస్య పరిష్కారమయ్యేదని అన్నారు.

కేకేతో నాయిని భేటీ

మంగళవారం మధ్యాహ్నం కేకే నివాసానికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వచ్చారు. సుమారు గంటపాటు కేకేతో భేటీ అయ్యారు. ఇద్దరూ ఆర్టీసీ సమ్మెపై చర్చించినట్టు తెలిసింది. సమ్మె పరిష్కారం విషయంలో  సీఎం కేసీఆర్ చొరవ చూపితే బాగుండేదని అభిప్రాయాన్ని నాయిని వ్యక్తం చేసినట్టు సమాచారం.

కార్మి కులు నాతో చర్చలకు సానుకూలంగా ఉండటం మంచి పరిణామం. అయితే చర్చలకు ప్రభుత్వం నుం చి ఎటువంటి అనుమతి రాలేదు. సమ్మె విషయంలో అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏందో నాకు తెలియదు. తెలిస్తే సమస్య పరిష్కారమయ్యేది.
– కె.కేశవరావు, టీఆర్​ఎస్ ఎంపీ

Latest Updates