‘రైతులను బిచ్చగాళ్లుగా మార్చాలని అనుకుంటున్నారా?’

కేంద్రంపై మండిప‌డ్డ టీఆర్ఎస్ ఎంపీ నామా

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బిల్లులతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. దేశవ్యాప్తంగా రైతాంగం దెబ్బతినేలా లాక్‌డౌన్ సమయంలో ఆర్డినెన్సులు తెచ్చారని మండిప‌డ్డారు. లోక్‌సభలో మెజారిటీ ఉందని ఇప్పటి వరకు 3 బిల్లులు పాస్ చేశారని…రైతాంగంపై ఎందుకింత కక్షపూరితంగా ఉన్నారని అన్నారు. దేశంలోని రైతులను బిచ్చగాళ్లుగా మార్చాలని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. ఇంతకుముందు జమీందారీ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థను తీసుకురావాలని చూస్తున్నారా? అని అడిగారు. రేపు రాజ్యసభలో వాటిని పూర్తిగా వ్యతిరేకించి అడ్డుకుంటామ‌ని అన్నారు.

50 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుమతికి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పిన నామా… గతంలో దానిపై 50% దిగుమతి సుంకం ఉంటే, దాన్ని 35% తగ్గించారన్నారు. విదేశీ రైతులకు మేలు చేసేలా దిగుమతి సుంకం తగ్గించారని.. ఈ చర్యలతో భారతదేశంలోని మొక్కజొన్న రైతులు ఏం కావాలి? అని ప్ర‌శ్నించారు. తెలంగాణలో 9 లక్షల టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం రైతుల దగ్గర కొనుగోలు చేసిందని.. రైతులకు ఇబ్బంది కలగవద్దని చెప్పి, గ్రామాల్లోనే కాటాలు పెట్టి సేకరించామ‌ని చెప్పారు. రూ. 1,750 కనీస మద్ధతు ధర ప్రకారమే కొనుగోలు చేశామ‌ని, రైతుల ద‌గ్గ‌ర పండిన ప్రతి పంటను ప్రభుత్వం కొన్నదని చెప్పారు. ఆ తరహాలో దేశవ్యాప్తంగా అన్నిచోట్లా చేయాల‌న్నారుజ. రైతులకు నీరు, కరెంట్, పండిన పంటకు మద్ధతు ధరతో కొనుగోలు, రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

రైతు వ్యతిరేక బిల్లులు తెచ్చినందుకు కేంద్ర ప్ర‌భుత్వం తో పాటు ఉన్న మిత్రపక్షం అకాలీదళ్ కూడా దూరమైందని.. అయినా సరే రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు నామా. మొక్కజొన్న దిగుమతుల కారణంగా తెలంగాణ, బిహార్, యూపీ సహా అనేక రాష్ట్రాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. దేశవ్యాప్త రైతులకు త‌మ ప్ర‌భుత్వం అండగా ఉంటుంద‌ని.. కలిసొచ్చే మిగతా రాజకీయ పార్టీలను కూడా కలుపుకుని ముందుకెళ్తామ‌ని ఆయ‌న అన్నారు

Latest Updates