వాయిస్ ఓటింగ్ తో ప్రజాస్వామ్య గొంతు నొక్కారు

ఢిల్లీ: జై జవాన్‌, జై కిసాన్ అనే నినాదం మనదని, సిపాయి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం రైతు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని, వ్యవసాయాన్ని ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లును ఏకపక్షంగా ఆమోదించారని, బిల్లుపై ఓటింగ్‌ ఎందుకు నిర్వహించలేదు? అని నామా ప్రశ్నించారు.

రాజ్యసభ లో ఓటింగ్ పెడితే బిల్లు వీగిపోతుందని వాయిస్ ఓటింగ్ తో ప్రజాస్వామ్య గొంతు నొక్కారన్నారు.రైతుల బిల్లు పై పార్టీలను ఎందుకు ఏకం చేయలేకపోయారని నామా ప్ర‌శ్నించారు. ‘కనీసం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపొచ్చు.. లేదంటే రైతులను పిలిచి సమావేశం పెట్టొచ్చు. బిల్లు ఆమోద సమయంలో సభ ప్రసారాలను నిలిపివేశారని’ నామా అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే రైతులు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ముందుకు వస్తారన్నారు

రైతులకు నేడు బ్లాక్‌ డే అని అన్నారు నామా. దేశవ్యాప్తంగా త్వరలో రైతులు ఆందోళన చేస్తారని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి రాబోయే రోజుల్లో రైతులు బుద్ధి చెప్తారని నామా హెచ్చరించారు.

Latest Updates