టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు అయిన కె.కేశవరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేస్తారు. తమను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసినందుకు కేశవరావు, సురేష్ రెడ్డి.. ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

రాజ్యసభలో 55 మంది ఎంపీల పదవీకాలం ఈ ఏప్రిల్ లోపు పూర్తికానుంది. ముందుగా ఖాళీ అయిన స్థానాలకు మార్చి 26న పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లు అధికార టీఆర్ఎస్ కే సొంతం కానున్నాయి. దీంతో ఆ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం చాలా మంది నేతలు, పలువురు పారిశ్రామికవేత్తలు ప్రయత్నించారు. మొదట్లో కేకేను పక్కనపెట్టి.. ఓ పారిశ్రామిక వేత్తకు, పార్టీలో మరో సీనియర్ కు చాన్స్ వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే సీఎం కేసీఆర్ మరోసారి కేకేను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. అలాగే సీనియర్ నేత సురేష్ రెడ్డికి అవకాశం కల్పించారు.

Latest Updates