అర్బన్​ ఓటర్లు నమ్ముతలేరు.. రూరల్​ ఓటర్లే దిక్కు !

  • గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ వ్యూహం
  • ఎక్కువ సంఖ్యలోఓటర్ల నమోదుకు ప్రయత్నం

హైదరాబాద్, వెలుగుత్వరలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ  రూరల్​ ఓటర్లపై ఫోకస్​ పెట్టింది. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం స్పెషల్​గా నియమించిన మండల ఇన్​చార్జులతో ఎప్పటికప్పుడు  మంత్రి కేటీఆర్ ఫోన్​లో మాట్లాడుతున్నారు. అర్బన్ ఏరియాలోని ఓటర్లు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉంటారని భావిస్తున్న టీఆర్ఎస్ లీడర్లు.. అందుకు ఆల్టర్నేట్​గా రూరల్ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రూరల్​లోని గ్రాడ్యుయేట్స్ కుటుంబాలు రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పథకాల్లో ఏదైనా ఒక స్కీమ్ ద్వారా లబ్దిపొంది ఉంటాయని, ఆ గ్రాడ్యుయేట్స్ ను నమ్ముకుంటే ఎన్నికల్లో ఫాయిదా ఉంటుందని లీడర్లు అంచనా వేసుకుంటున్నారు.

రెండు సీట్లలో కొత్తగా 2.60 లక్షల ఓటర్లు

నల్గొండ–వరంగల్​–ఖమ్మం సెగ్మెంట్​తోపాటు హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ సెగ్మెంట్​లో త్వరలో గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆరేండ్ల కింద జరిగిన ఈ ఎన్నికల్లో నల్గొండ–వరంగల్​– ఖమ్మం సెగ్మెంట్​లో 2.81 లక్షల మంది.. హైదరాబాద్​–రంగారెడ్డి–మహమబూబ్​నగర్​ సెగ్మెంట్​లో 2.96 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇప్పుడు రెండు స్థానాల్లో కలిపి కొత్తగా 2.60 లక్షల మంది ఓటర్లు  యాడ్​ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ‘నల్గొండ’ సెగ్మెంట్​లో 1.10 లక్షల మంది, ‘హైదరాబాద్​’ సెగ్మెంట్​లో 1.50 లక్షల మంది ఉంటారు. రూరల్​ ఓటర్లతోపాటు 2014 తర్వాత  గ్రాడ్యుయేట్స్​ పూర్తయిన వారిని నమ్ముకుంటేనే ఎన్నికల్లో లాభం ఉంటుందని, వారిలో ప్రభుత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత ఉండదని టీఆర్​ఎస్​ లీడర్లు భావిస్తున్నారు. అలాంటివారిని గుర్తించి పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్బన్ ప్రాంతంలోని  గ్రాడ్యుయేట్స్‌ ఓటర్లు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని, ప్రధానంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు నెగెటివ్ ఓపీనియన్​లో ఉన్నారని, వారిని ఎంత బుజ్జగించినా ప్రయోజనం ఉండదని టీఆర్ఎస్  లీడర్లు అంచనా వేసుకుంటున్నారు.

పెన్ డ్రైవ్, రూ. 5 లక్షలు

ఓటు నమోదు కోసం  ప్రతి ఎమ్మెల్యేలకు టీఆర్​ఎస్​  ఒక పెన్ డ్రైవ్,  రూ. 5 లక్షల ఫండ్ ను పంపించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పెన్ డ్రైవ్ లో గ్రాడ్యుయేట్ల వివరాలు, ఫోన్ నంబర్లు, వారి కుటుంబ సభ్యులు ఇంతవరకు ప్రభుత్వం నుంచి అందుకున్న సంక్షేమ పథకాల వివరాలు పొందుపొర్చినట్లు తెలిసింది. మండలాల వారీగా ఓటరు నమోదు కోసం పనిచేస్తున్న కార్యకర్తల రోజువారీ ఖర్చు కోసం డబ్బులు పంపినట్టు సమాచారం.

Latest Updates