ఏకగ్రీవానికి ఎత్తులు.. ఇండిపెండెంట్లపై కేసులు

V6 Velugu Posted on Nov 25, 2021

హైదరాబాద్‌, వెలుగు: లోకల్​ బాడీ ఎమ్మెల్సీలను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నది. ఇతరులెవరూ పోటీలో లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలకు తెరలేపింది. ఇండిపెండెంట్‌ క్యాండిడేట్లను ప్రపోజ్‌ చేస్తూ సంతకాలు పెట్టిన ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచింది. తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఇండిపెండెంట్లపై ప్రజాప్రతినిధులతో కేసులు పెట్టించింది. నిజామాబాద్​లోని ఒక స్థానానికి, రంగారెడ్డిలోని రెండు స్థానాలకు ఇండిపెండెంట్లు బరిలో లేకుండా చూసింది. నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి నుంచి శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. నామినేషన్ల ఉప సంహరణ తుది గడువు అయిన శుక్రవారం వీరి ఎన్నికను ప్రకటించనున్నారు. ఈ మూడు సీట్లలో ఇండిపెండెంట్ల నామినేషన్లను సాంకేతిక కారణాలను చూపుతూ రిటర్నింగ్​ ఆఫీసర్లు బుధవారం తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు మిగతా సీట్లలోనూ ఇండిపెండెంట్లను తప్పించి, తమ అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకునేందుకు టీఆర్​ఎస్​ ప్రయత్నాలు చేస్తోంది. 

నిజామాబాద్​ సీటుకు ఇట్లా..!
నిజామాబాద్‌ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇండిపెండెంట్‌ అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్‌ నామినేషన్లు వేయగా..  శ్రీనివాస్‌ నామినేషన్‌ అఫిడవిట్‌లోని ఫాం- 26లో తప్పులు ఉన్నాయని పేర్కొంటూ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తిరస్కరించారు. శ్రీనివాస్‌‌ నామినేషన్‌‌ పేపర్‌‌లో తమ సంతకాలు ఫోర్జరీ చేశారని చెప్తూ నిజామాబాద్‌‌ 31వ డివిజన్‌‌ కార్పొరేటర్‌‌ రజియా సుల్తానా, నందిపేట -– 3 ఎంపీటీసీ ఎర్రం నవనీత రిటర్నింగ్‌‌ ఆఫీసర్‌‌కు ఫిర్యాదు చేశారు. పోటీ నుంచి ఇండిపెండెంట్‌‌ను తప్పిస్తే కవిత ఎన్నిక ఏకగ్రీవం అవుతుందనే, ప్రపోజల్స్‌‌పై ఒత్తిడి తెచ్చి శ్రీనివాస్‌‌పై ఫిర్యాదు చేయించినట్టుగా స్థానికంగా చర్చ జరుగుతున్నది. 

రంగారెడ్డి సీట్లలో ఇట్లా..!
రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ సీట్లుండగా అక్కడ సిట్టింగ్‌‌ ఎమ్మెల్సీలు శంభీపూర్‌‌ రాజు, పట్నం మహేందర్‌‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్‌‌ వద్ద హైడ్రామా జరిగింది. ఇండిపెండెంట్లు నామినేషన్‌‌ వేయకుండా వారి వద్ద ఉన్న పత్రాలు కొందరు టీఆర్​ఎస్​ లీడర్లు గుంజుకొని చించేశారు. చలిక చంద్రశేఖర్‌‌ అనే ఇండిపెండెంట్‌‌ అభ్యర్థి గడువు ముగిసిన తర్వాత నామినేషన్‌‌ వేశారని, సెక్యూరిటీ డిపాజిట్‌‌ సమర్పించలేదని, అతడి నామినేషన్‌‌పై ప్రపోజల్స్‌‌ సంతకాలు లేకపోవడంతో తిరస్కరించినట్టు రిటర్నింగ్‌‌ ఆఫీసర్​  ప్రకటించారు. రంగారెడ్డి లోకల్‌‌ బాడీస్‌‌ నియోజకవర్గం నుంచి తాము నామినేషన్‌‌ వేయడానికి వెళ్తే టీఆర్‌‌ఎస్‌‌ నాయకులు రౌడీయిజం చేసి అడ్డుకున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌‌ చాంబర్‌‌ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి సీఈవోకు కంప్లైంట్‌‌ చేశారు. టీఆర్‌‌ఎస్‌‌ నాయకులు దౌర్జన్యం చేసి ఎవరినీ నామినేషన్‌‌ వేయకుండా చేశారని, మళ్లీ నోటిఫికేషన్‌‌ జారీ చేసి నామినేషన్లు తీసుకోవాలని కోరారు. 

అన్ని జిల్లాల్లో అవే కంప్లైంట్లు
స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ నామినేషన్లు దాఖలైన అన్ని జిల్లాల్లోనూ టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఒకే ఫార్ములా ప్రయోగించింది. ఇండిపెండెంట్‌‌ క్యాండిడేట్లు తమకు సంబంధం లేకుండా, తమ సంతకాలు ఫోర్జరీ చేసి నామినేషన్లు దాఖలు చేశారని, వాటిని తిరస్కరించాలని వరంగల్‌‌, నల్గొండ, మహబూబ్‌‌ నగర్‌‌, కరీంనగర్‌‌, నల్గొండ జిల్లాల్లోనూ రిటర్నింగ్‌‌ ఆఫీసర్లకు కొందరు ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేశారు. వీలైనంత ఎక్కువ మందిని స్క్రూటినీలోనే ఔట్‌‌ చేసి, మిగిలిన వారితో విత్‌‌ డ్రా చేయించాలని అధికార పార్టీ ఇలా ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి.  ఆయా జిల్లాల్లో నామినేషన్‌‌ వేసిన అభ్యర్థులతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈక్రమంలో కొందరి డిమాండ్లు నెరవేర్చేందుకు సిద్ధపడ్డారు. శుక్రవారం వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉండటంతో ఆలోగా వీలైనన్ని ఎక్కువ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని టీఆర్‌‌ఎస్‌‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఖమ్మంలో నలుగురు అభ్యర్థులు నామినేషన్‌‌ వేయగా అన్ని సరిగ్గానే ఉన్నాయని రిటర్నింగ్‌‌ అధికారి ప్రకటించారు. నల్గొండలో ముగ్గురు ఇండిపెండెంట్‌‌ క్యాండిడేట్ల నామినేషన్లు రిజెక్ట్‌‌ చేశారు. మెదక్‌‌లో ఇద్దరు, కరీంనగర్‌‌లో 14 మంది, మహబూబ్‌‌నగర్‌‌లో ఆరుగురు, రంగారెడ్డిలో ఒకరి నామినేషన్లు తిరస్కరించారు. నామినేషన్ల పరిశీలన తర్వాత ఆదిలాబాద్‌‌లో 24 మంది, నల్గొండలో ఎనిమిది మంది, మెదక్‌‌లో ఐదుగురు, ఖమ్మంలో నలుగురు, కరీంనగర్‌‌లో 24 మంది, మహబూబ్‌‌నగర్‌‌లో నలుగురు పోటీలో ఉన్నారు.కరీంనగర్ లో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన సిలివెరు శ్రీకాంత్, పిడిశెట్టి రాజు తమ సంతకాలు ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేయడంతో వారి నామినేషన్లను తిరస్కరించారు.

కరీంనగర్​లో టీఆర్ఎస్ రెబల్​గా పోటీకి దిగిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ నామినేషన్ రిజెక్ట్ చేయించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆయనకు ప్రపోజర్స్​ అయిన పెద్దపల్లికి చెందిన సంగటి శంకర్, గీకురు రవీందర్ తోనూ ఫోర్జరీ ఆరోపణలు చేయించారు. వారితో రిటర్నింగ్ ఆఫీసర్ మాట్లాడగా తామే సంతకాలు చేశామని చెప్పడంతో ఆ నామినేషన్ ఆమోదించారు.మెదక్​లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చిన్న శంకరంపేట వైస్ ఎంపీపీ సత్యనారాయణ తమ సంతకాలు ఫోర్జరీ చేశారని ఎంపీటీసీలు ఫిర్యాదు చేయడంతో ఆయన నామినేషన్ రిజెక్ట్ చేశారు.

ఇండిపెండెంట్ల ఆందోళనలు, దీక్షలు
గడువులోగా తన నామినేషన్‍ ఓకే చేసిన అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో పెండింగ్‍లో పెట్టారని ఇండిపెండెంట్‍ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీరం దేవేందర్‍రెడ్డి ఆరోపించారు. తనను బలపరిచిన వారి జాబితాతో అధికారుల ముందు బలనిరూపణ చేసుకున్నా.. టీఆర్​ఎస్​కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన వెంట ఉన్న ఎంపీటీసీలతో కలిసి ఆయన కలెక్టరేట్‍లో ఆందోళన చేశారు. మరో ఇండిపెండెంట్‍ అభ్యర్థి అన్నారపు యాకయ్య కలెక్టర్‍ ఆఫీస్‍లో దీక్షకు దిగారు. తనను బలపరిచినవారిలో గుగులోతు లక్ష్మణ్​ సంతకం తాను ఫోర్జరీ చేశానని చెప్పి రిజక్ట్​ చేయడం అన్యాయమని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు మద్దతుగా లక్ష్మణ్‌​ సంతకం చేసినట్లు సాక్ష్యాలు ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్తానని, అప్పటి దాకా ఎన్నిక ప్రక్రియ ఆపాలని దీక్షకు దిగారు. పోలీసులు బలవంతంగా ఆయనను పోలీస్ట్​ స్టేషన్​కు తరలించారు.

వరంగల్‍ ఎమ్మెల్సీ స్క్రుటినీలో హైడ్రామా
వరంగల్‍, వెలుగు:  ఉమ్మడి వరంగల్‍ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక స్క్రుటినీ తీరు గందరగోళంగా మారింది. బుధవారం ఉదయం నుంచి ఫోర్జరీ సంతకాల ఆరోపణలు.. ఫిర్యాదులు, అభ్యర్థుల పరేడ్‍లు.. పోలీసుల అరెస్టులతో రాత్రి తొమ్మిది గంటల వరకు హైడ్రామా కొనసాగింది.  స్క్రుటినీగడువు ముగిసినా రిటర్నింగ్‍ ఆఫీసర్లు అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. వరంగల్‍ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తంగా 14 మంది పోటీ పడగా.. మంగళవారం గడువు ముగిసే సమయానికి 21 సెట్ల నామినేషన్లు వచ్చాయి. బుధవారం స్క్రుటినీ చేసి మధ్యాహ్నం 3 గంటల తర్వాత రిటర్నింగ్‍ ఆఫీసర్లు అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి ఉండగా.. ప్రకటించలేదు. ఎన్నికల కమిషన్‍ ఇచ్చిన టైంలోపల నామినేషన్లు రూల్స్​ ప్రకారం ఉన్నాయో లేదో చూడాల్సిన అధికారులు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఫైనల్‍ చేయలేదు. రాత్రి 9 దాటాక మాత్రం మొత్తం 14 మందిలో కేవలం నలుగురు పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ నలుగురిలో టీఆర్​ఎస్​ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, ఇండిపెండెంట్లు మంత్రి శ్రీశైలం, బానోత్‍ రూప్‍సింగ్‍, పోతరాజు రాజు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో తొమ్మిది మంది నామినేషన్లు రూల్స్​ ప్రకారం లేవని రిజక్ట్ చేసినట్లు చెప్పారు. మరో ఇండిపెండెంట్‍ అభ్యర్థి బీరం దేవేందర్‍రెడ్డి నామినేషన్‍ పత్రాలు ఇంకా పరిశీలనలో ఉన్నందున.. గురువారం మధ్యాహ్నం 11 గంటలకు స్ర్కూటినీని వాయిదా వేసినట్లు తెలిపారు. టీఆర్​ఎస్​ క్యాండిడేట్‍ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి ఫిర్యాదు ఆధారంగా స్క్రుటినీని పోస్ట్​పోన్‌ చేశారు.  బీరం దేవేందర్‍రెడ్డిని బలపరిచినవారిలో నలుగురు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డికి ఏజెంట్‍గా వ్యవహరిస్తున్న  కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఫిర్యాదు చేసినట్లు ఆర్వో ప్రకటించారు.

Tagged TRS Plan, Telangana MLC Elections, mlc elections unanimous, independents in mlc election

Latest Videos

Subscribe Now

More News