కారు జోరు..దాదాపు 100 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ కు మెజారిటీ

హైదరాబాద్, వెలుగు:

మున్సిపల్​ ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. అధికార టీఆర్ఎస్​ భారీ సంఖ్యలో మున్సిపాలిటీలు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యాయి. ఇరవైకిపైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాలేదు. ఎక్స్​అఫీషియో ఓట్లు, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతును బట్టి అవి ఎవరి ఖాతాలో పడతాయన్నది తేలనుంది. నల్గొండ, మహబూబ్​నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో టీఆర్ఎస్​కు కొంత ప్రతికూలత కనిపించినా.. మిగతా రాష్ట్రమంతా హవా కొనసాగింది. తొమ్మిది కార్పొరేషన్లలో ఐదింటిని ఆ పార్టీయే కైవసం చేసుకుంది. నాలుగు కార్పొరేషన్లలో హంగ్​ రిజల్ట్స్​ వచ్చాయి. బీజేపీ నిజామాబాద్​ కార్పొరేషన్లో అత్యధిక డివిజన్లు గెలుచుకున్నా మేయర్​ పీఠానికి సరిపడే మేజిక్​ ఫిగర్​ను అందుకోలేకపోయింది. టీఆర్ఎస్​ పార్టీయే మజ్లిస్​ మద్దతుతో ఈ కార్పొరేషన్​ను తన ఖాతాలో వేసుకునే అవకాశముందని అంటున్నారు.

ఎవరెవరికి ఎన్ని?

రాష్ట్రంలో మొత్తం 120 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు జరగ్గా 84 చోట్ల టీఆర్ఎస్, ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, మూడు చోట్ల బీజేపీ, రెండింటిలో ఎంఐఎం విజయం సాధించాయి. మరో రెండు చోట్ల టీఆర్ఎస్​ రెబెల్స్​ మెజారిటీ వార్డులు దక్కించుకున్నారు. మరో 23 మున్సిపాలిటీల్లో హంగ్​ రిజల్ట్స్​ వచ్చాయి. వీటిలో ఏ పార్టీ అయినా ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతు, ఎక్స్​ అఫీషియో ఓట్లతో మాత్రమే పీఠం దక్కించుకునే చాన్స్​ ఉంది. అయితే ఇండిపెండెంట్లలో ఎక్కువ మంది టీఆర్ఎస్​ రెబెల్స్​ కావడం, ఎక్స్​అఫీషియో ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో ‘హంగ్​మున్సిపాలిటీ’ల్లో చాలా వరకు అధికార పార్టీ ఖాతాలో పడే చాన్స్​ ఉందని.. టీఆర్ఎస్​ మొత్తంగా వందకుపైగా మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేస్తుందని రాజకీయవర్గాలు చెప్తున్నాయి.

ఈ పార్టీలు ఎక్కడెక్కడ?

ఆమన్‌గల్‌, తుక్కుగూడ, మక్తల్​ మున్సిపాలిటీలను బీజేపీ తన ఖాతాలో వేసుకోగా.. ఆదిభట్ల, పెద్ద అంబర్​పేట, తుర్కయంజాల్, చండూర్, వడ్డెపల్లి, నారాయణఖేడ్ లను కాంగ్రెస్​ వశపరుచుకుంది. టీఆర్ఎస్​ ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం భైంసా, జల్​పల్లి మున్సిపాలిటీల్లో పాగా వేసింది. ఫార్వర్డ్ బ్లాక్​ పార్టీ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్​ రెబెల్స్​ రెండు పట్టణాల్లో జెండా ఎగరేశారు. పార్టీ హెచ్చరించినా లెక్కచేయకుండా కొల్లాపూర్​లోని అన్ని వార్డుల్లో తన వర్గీయులను పోటీకి దింపిన మాజీ మంత్రి జూపల్లి సత్తా చాటుకున్నారు. అయిజలోనూ టీఆర్ఎస్​ రెబెల్స్​ అత్యధిక సీట్లు గెల్చుకున్నారు. ఈ రెండు సీట్లు కూడా అధికార పార్టీ ఖాతాలోనే చేరే చాన్సుంది.

ఏకగ్రీవంతో మొదలు

మొత్తం 324 డివిజన్లు, 2,647 వార్డులకు ఎలక్షన్​ జరిగితే మెజారిటీ సీట్లలో టీఆర్ఎస్​ క్యాండిడేట్లే గెలుపొందారు. పోలింగ్​కు ముందే 80 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా సగానికిపైగా 1,578 సీట్లను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. కార్పొరేషన్లలోని 325 డివిజన్లలో 154 డివిజన్లు టీఆర్ఎస్, బీజేపీ 65, కాంగ్రెస్‌ 40, ఎంఐఎం 17, ఇండిపెండెంట్లు 49 చోట్ల గెలిచారు. మున్సిపోల్స్​పై అధికార పార్టీ ముందుచూపుతో వ్యవహరించటం, ఎమ్మెల్యేలు, మంత్రులందరినీ బాధ్యులను చేయడం, ఎక్కడికక్కడే నేతలను మోహరించడం, అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు వంటివన్నీ ఆ పార్టీకి అత్యధిక సీట్లను తెచ్చిపెట్టాయి.

ఈ కార్పొరేషన్లలో హంగ్

నిజామాబాద్, బడంగ్​పేట్, మీర్​పేట, రామగుండం మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మేయర్​ పీఠం దక్కించుకునే మేజిక్​ ఫిగర్​ రాలేదు. రామగుండంలోని 50 డివిజన్లలో టీఆర్ఎస్​కు 19, కాంగ్రెస్​కు 11, బీజేపీకి ఆరు సీట్లు రాగా.. టీఆర్ఎస్​ రెబెల్స్, ఇండిపెండెంట్లు 14 సీట్లు గెలుచుకున్నారు. దీంతో రెబెల్స్, ఇండిపెండెంట్ల మద్దతు ఎవరికన్నది ఆసక్తిగా మారింది. మీర్​పేటలోని 46 డివిజన్లలో టీఆర్ఎస్​కు 19, కాంగ్రెస్​కు 3, బీజేపీకి 16, రెబెల్స్, ఇండిపెండెంట్లకు 8 సీట్లు వచ్చాయి. ఇక్కడ మేజిక్​ఫిగర్​ కావాలంటే 24 మంది కావాలి. దీంతో పరిస్థితి ఏమిటన్నది ఉత్కంఠగా ఉంది. బడంగ్​పేటలోని 32 డివిజన్లకుగాను టీఆర్ఎస్​కు 13, కాంగ్రెస్​కు 7, బీజేపీకి 10, ఇండిపెండెంట్లకు 2 సీట్లు వచ్చాయి. ఇక్కడ మేజిక్​ఫిగర్​ 17 సీట్లు. దీనికి ఏ పార్టీకూడా దగ్గరగా లేని పరిస్థితి ఉండటంతో ఎవరు ఎవరికి మద్దతిస్తారన్నది కీలకంగా మారింది.

మెజార్టీ సీట్లొచ్చినా..

ఆరు చోట్ల చైర్మన్​ పీఠాన్ని అందుకునేందుకు స్పష్టమైన ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఎనిమిది చోట్ల మేజిక్​ ఫిగర్​ను అందుకోలేకపోయింది. నార్సింగి, మణికొండ, హాలియా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్​ కంటే ఎక్కువ వార్డులు గెలిచినా చైర్మన్​ సీటుకు సరిపడా రాలేదు. ఖానాపూర్, యాదగిరిగుట్ట, నేరడుచర్ల, చేర్యాల, కోస్గి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్​ సమాన సంఖ్యలో వార్డులు గెల్చుకున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు, ఎక్స్​అఫీషియో సభ్యుల లెక్కల ఆధారంగా ఏ పార్టీ ఖాతాలో చేరుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక్కడ మాకు.. అక్కడ మీకు!

రంగారెడ్డి జిల్లా, వెలుగు: రెండు కార్పొరేషన్లలో మేయర్‌ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్‌, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. బడంగ్‌పేట్‌, మీర్‌పేటల్లో పరస్పరం మద్దతు తీసుకుంటే.. చెరో మేయర్​ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాయి. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో మొత్తం 32 వార్డులకు టీఆర్‌ఎస్‌ 13, కాంగ్రెస్‌ 7, బీజేపీ 10, ఇండిపెండెంట్లు 2 డివిజన్లు గెలుచుకున్నారు. మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు 17 మంది మద్దతు అవసరం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్​ కలిస్తే జెండా ఎగరేయొచ్చు. మరోవైపు మీర్‌పేటలో మొత్తం 46 వార్డులకు టీఆర్‌ఎస్‌ 19, బీజేపీ 16, కాంగ్రెస్‌ 3, ఇండిపెండెంట్లు 8 డివిజన్లు గెలుచుకున్నారు. ఇక్కడ మేయర్‌ పదవి దక్కించుకునేందుకు 24 మంది మద్దతు అవసరం. బీజేపీ, కాంగ్రెస్‌ కలవడంతోపాటు ఇండిపెండెంట్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. మొత్తంగా చెరో కార్పొరేషన్​లో మేయర్​ పదవిని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

లీడర్ల మంతనాలు షురూ..

కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నాయకుడు చిగురింత నర్సింహారెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వరం పార్టీ ఇన్​చార్జి అందె శ్రీరాములు కలిసి పార్టీల మద్దతుపై మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. బడంగ్‌పేట మేయర్‌ పదవి కాంగ్రెస్‌ కు, మీర్‌పేట్‌ ను బీజేపీ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. బడంగ్‌పేట మేయర్‌ పదవిని జనరల్‌ మహిళల కోటాకు కేటాయించారు. దీంతో చిగురింత నర్సింహారెడ్డి భార్య పారిజాతంను మేయర్‌ చేసేలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బీజేపీ తమకు మద్దతిస్తే మీర్‌పేటలో గెలిచిన కాంగ్రెస్‌ క్యాండిడేట్లతోపాటు కొందరు ఇండిపెండెంట్లు మద్దతిచ్చేలా చేస్తామని నర్సింహారెడ్డి ఆఫర్​చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ బడంగ్​పేటలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు కుదరకపోతే.. టీఆర్ఎస్​ మద్దతు తీసుకుని, మేయర్​ పదవి దక్కించుకోవాలని నర్సింహారెడ్డి భావిస్తున్నారని అంటున్నాయి.

Latest Updates