‘జేబీఎస్ మెట్రో’ ప్రారంభంలో పాలిటిక్స్: టీఆర్ఎస్‌పై బీజేపీ ఫైర్

ఈ నెల 7వ తేదీన సడన్‌గా జేబీఎస్ – ఎంజీబీఎస్ మెట్రో రూట్ ప్రారంభంలో టీఆర్ఎస్ కుట్రపూరిత రాజకీయాలు చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్రంతో సంబంధం లేకుండా కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే నిధులిచ్చి మెట్రో నిర్మాణం చేపట్టినట్లు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపాలని చూసిందని ఫైర్ అవుతోంది. అందుకే కావాలని సికింద్రాబాద్ ఎంపీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాలేని సమయం చూసి సీఎం కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేశారని బీజేపీ నేతలు అంటున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగతున్నప్పుడే ఈ కార్యక్రమం పెట్టడంలో రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు.

కిషన్ రెడ్డి మెట్రో ప్రయాణం

హైదరాబాద్‌లో నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉన్నాయని బీజేపీ నేతలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సహా పలువురు పార్టీ నేతలు శనివారం మెట్రో ప్రయాణం చేయబోతున్నారన్నారు. ఉదయం మెట్రో అధికారులతో కిషన్ రెడ్డి సమావేశమవుతారని, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు JBS నుంచి MGBS వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తారని తెలిపారు.

Latest Updates