వరద ప్రాంతాల్లో కారు కొట్టుకపాయె

  • సర్కారుపై జనం ఆగ్రహంతో ఓటింగ్​పై ఎఫెక్ట్
  • గులాబీ సిట్టింగ్​ సీట్లలో బీజేపీ గెలుపు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ సిటీని ముంచేసిన వరదల ప్రభావం టీఆర్ఎస్ పై గట్టిగా పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో సర్కారు నిర్లక్ష్యంపై జనంలో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో టీఆర్ఎస్​ సిట్టింగ్ సీట్లు కోల్పోయింది. ఎంఐఎం ఆధీనంలో ఉన్న డివిజన్లు మినహా మెజార్టీ చోట్ల బీజేపీ సత్తా చాటింది. కుండపోత వానలకు ఇంట్లో నిత్యావసర సరుకులు సహా అంతా మునిగి బాధలో  ఉంటే టీఆర్ఎస్​ నేతలు కనీసం పట్టించుకోకపోవడం, చెరువులు, నాలాల ఆక్రమణలు, ఇటీవల సర్కారు తీసుకున్న ఎల్ఆర్ఎస్​ వంటి పలు నిర్ణయాలు, సిట్టింగ్​ టీఆర్ఎస్​ కార్పొరేటర్లపై ఉన్న అవినీతి ఆరోపణలు ఎలక్షన్​పై ఎఫెక్ట్​ చూపించాయని పొలిటికల్​ ఎక్స్​పర్టులు చెప్తున్నారు. ఉప్పల్, ముషీరాబాద్, ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట, రాజేంద్రనగర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో నీట మునిగిన ప్రాంతాల్లో మెజారిటీ డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది.

వరదల్లో కొట్టుకుపోయిన సిట్టింగ్​లు

గ్రేటర్  ఎలక్షన్ లో వరదలకు ముందు, వరదలకు తర్వాత అన్నట్లుగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. కుండపోత వానలతో వేలాది కాలనీలు నీట మునిగి జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల చెరువులు, నాలాలు ఉప్పొంగి.. బస్తీల్లో ఇండ్లన్నీ జలమయం అయ్యాయి. ఇండ్లలో బియ్యం, ఇతర నిత్యావసరాలే కాకుండా.. టీవీలు, ఫ్రిడ్జ్​లు ఇతర ఎలక్ట్రానిక్​ సామాన్లు, బట్టలు, ఫర్నీచర్​ పాడైపోయాయి. కార్లు, బైకులు రోజుల తరబడి నీట మునగడంతో దెబ్బతిన్నాయి. రిపేర్ల కోసం జనం వేల రూపాయలు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఇంత జరిగినా సర్కారు నుంచి పెద్దగా సాయం అందకపోవడంపై బాధితుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. టీఆర్ఎస్​ కార్పొరేటర్లు పెద్దగా జనంలోకి వెళ్లకపోవడంపైనా విమర్శలు వచ్చాయి. వెళ్లిన ఒకరిద్దరిపైనా జనం మండిపడ్డారు. రామంతాపూర్ లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ పర్యటనలో, ఎల్బీ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే పర్యటన, పలుచోట్ల మంత్రి కేటీఆర్ పరిశీలనకు వెళ్లినప్పుడు స్థానిక కార్పొరేటర్లపై జనం తిరగబడ్డారు. ఇది ఎలక్షన్లోనూ ప్రతిబింబించింది. టీఆర్ఎస్​ సిట్టింగ్​ సీట్లను బీజేపీ గెలుచుకుంది.

వరద ప్రభావిత డివిజన్లు

ఎల్బీ నగర్ సెగ్మెంట్ లో..

సరూర్ నగర్                  బీజేపీ

హయత్ నగర్                 బీజేపీ

గడ్డి అన్నారం                  బీజేపీ

నాగోల్                         బీజేపీ

మూసారాంబాగ్               బీజేపీ

లింగోజీ గూడ                బీజేపీ

చంపాపేట్                     బీజేపీ

వనస్థలిపురం                 బీజేపీ

ముషీరాబాద్ సెగ్మెంట్ లో..

కవాడీగూడ                బీజేపీ

గాంధీ నగర్                బీజేపీ

కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ లో..

జీడిమెట్ల                   బీజేపీ

సుభాష్ నగర్‌‌              టీఆర్ఎస్

రాజేంద్ర నగర్ సెగ్మెంట్ లో..

మైలార్ దేవ్‌పల్లి           బీజేపీ

సులేమాన్ నగర్‌‌          ఎంఐఎం

ఓల్డ్ సిటీలోని డివిజన్లు..

చాంద్రాయణగుట్ట           ఎంఐఎం

ఫలక్ నుమా              ఎంఐఎం

నవాబ్ సాహెబ్ కుంట ఎంఐఎం

ఉప్పల్ సెగ్మెంట్ లో..

ఉప్పల్                     కాంగ్రెస్

రామంతాపూర్            బీజేపీ

Latest Updates