సికింద్రాబాద్ లోక్ సభ స్థానంపై టీఆర్ఎస్ గురి

సికింద్రాబాద్ లోక్ సభ స్థానం… కాంగ్రెస్, బీజేపీ తప్ప మరో పార్టీ అక్కడ గెలిచింది లేదు. అయితే ఈ లెక్కలన్నింటిని బ్రేక్ చేయాలని బలంగా ప్రయత్నిస్తోంది టీఆర్ఎస్. సిట్టింగ్ సీట్ ను నిలబెట్టుకోవాలని బీజేపీ… కోల్పోయిన పట్టును మళ్లీ చేజక్కించేందుకు కాంగ్రెస్ ప్లానింగ్ లో ఉన్నాయి. అన్ని పార్టీల్లోనూ టిక్కెట్ ఆశిస్తున్నవారు చాలామందే ఉన్నారు.

మొదటి నుండి సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో.. బీజేపీ, కాంగ్రెస్ లదే ఆధిపత్యం, కాగా… ఈసారి ఎలాగైనా బోణీ కొట్టాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఇతర నియోజక వర్గాలతో పోలిస్తే… సికింద్రాబాద్ లోక్ సభ వైవిధ్యంగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడినవారు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినవారు అధికంగా ఉన్నారు. బీజేపీకి కలసివచ్చే అంశం ఇదే.  సికింద్రాబాద్ లోక్ సభకు 1957 నుంచి 2014 వరకు 15 సార్లు సాధారణ ఎన్నికలు, 2 సార్లు ఉపఎన్నికలు జరిగాయి. 4 సార్లు బీజేపీ, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు. మిగతా 12 సార్లు కాంగ్రెస్ గెలిచింది. ప్రస్తుత ఎంపీ బండారు దత్తాత్రేయ నాలుగుసార్లు గెలిచారు. కేంద్రమంత్రిగా కూడా దత్తాత్రేయ పనిచేశారు. బీజేపీకి ఈ సీటు అత్యంత ప్రతిష్టాత్మకం. అయితే ఈసారి దత్తన్న పోటీ చేస్తారా..? లేదా అనేది అనుమానంగా మారింది. ఈ సీటు కోసం సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పోటీ పడుతున్నారు. ఇద్దరూ ఢిల్లీలో ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం.

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్… 2004, 2009లలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లోనూ అతడికే టిక్కెట్ దక్కవచ్చు. అయితే మైనారిటీ ఓట్లు కూడా అధికంగా ఉండడంతో గతంలో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా పనిచేసిన ఓ మాజీ క్రికెటర్ ను దించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.

టిఆర్ఎస్ ఏర్పాటు నాటి నుంచి  సికింద్రాబాద్ లోక్ సభను గెలవలేకపోయింది ఆ పార్టీ. అయితే ఈసారి కచ్చితంగా… గెలవాలని పట్టుదలగా ఉంది. లోక్ సభ పరిధిలో సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్ పేట్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. ఇందులో నాంపల్లి మినహా మిగితా 6 చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. నాంపంల్లిలో టీఆర్ఎస్ మిత్రపక్షమైన MIM ఉంది. గెలుపు కోసం ప్లానింగ్ కూడా జరుగుతోంది. బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్.

సికింద్రాబాద్ లోక్ సభను కేసీఆర్ ప్రెస్టీజియస్ గా తీసుకోవడంతో… అనేకమంది ఆశావహులు సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కొడుకు సాయికిరణ్ యాదవ్ కు టిక్కెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, సికింద్రాబాద్ పార్ల మెంటరీ ఇంఛార్జ్ బండి రమేష్ కూడా పోటీలో ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గమంతటా చుట్టేస్తున్నారు బండి రమేష్. మరో ప్రధాన కార్యదర్శి దండే విఠల్, GHMC మేయర్ బొంతు రామ్మోహన్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బొంతు రామ్మోహన్ కు మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ సీట్లలో ఏదో ఒకటి గ్యారంటీ అని అనుచరులు చెప్పుకుంటున్నారు. దండే విఠల్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై పోటీ చేసి ఓడిపోయారు. తలసాని టీఆర్ఎస్ లో చేరడంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయితే విఠల్ కు పార్టీ జనరల్ సెక్రటరీ పదవినిచ్చారు కేసీఆర్. మొత్తంగా టీఆర్ఎస్ లోనే సికింద్రాబాద్ టిక్కెట్ కోసం పోటీ ఎక్కువగా ఉంది. కాంగ్రెస్, బీజేపీలలో ఆశావహుల సంఖ్య తక్కువగానే ఉన్నా… అంతర్గతంగా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.

Latest Updates