SGT అభ్యర్థుల ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తం

  •    ఎస్‌జీటీ అభ్యర్థుల ప్రగతిభవన్‌ ముట్టడి ఉద్రిక్తం
  •    పోలీసులు, అభ్యర్థుల మధ్య వాగ్వాదం, తోపులాట
  •    టీఆర్‌టీ పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్
  •    వందలాది మంది అరెస్ట్‌, పోలీస్​స్టేషన్లకు తరలింపు
  •    అక్కడా ఆందోళన చేసిన కేండిడేట్లు
  •    బొల్లారం పోలీస్‌ స్టేషన్​లో ఆమరణ దీక్ష
  •    వానలో బతుకమ్మ ఆడి నిరసన
  •    తిండిలేక సొమ్మసిల్లి పడిపోయిన మహిళా అభ్యర్థి

హైదరాబాద్‌, వెలుగు టీఆర్టీ షెడ్యూల్‌ను రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌జీటీ అభ్యర్థులు చేపట్టిన ప్రగతిభవన్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రగతిభవన్‌ వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అభ్యర్థులంతా రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు, అభ్యర్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఆందోళనకారులను అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సమయంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.

పోలీస్‌స్టేషన్లలోనూ ఆందోళన

సర్కారు కావాలనే కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ వందలాది మంది అభ్యర్థులు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు తరలివచ్చారు. ప్రగతిభవన్​సమీపంలో వారిని అడ్డుకున్న ఏసీపీ తిరుపతయ్య.. ప్రభుత్వంతో చర్చలు జరిపిస్తామని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అభ్యర్థులు వినకపోవడంతో అరెస్ట్‌ చేసి బొల్లారం, గోల్కొండ, లంగర్‌హౌజ్‌ తదితర పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అయితే పోలీస్‌స్టేషన్లలో కూడా అభ్యర్థులు తమ ఆందోళన కొనసాగించారు. బొల్లారం పోలీస్‌ స్టేషన్‌లో అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత వర్షంలో బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి తిండిలేకపోవడంతో ఓ మహిళా అభ్యర్థి సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.

కేసుల సాకులు చెబుతున్నరు: అభ్యర్థులు 

టీఆర్‌టీ నోటిఫికేషన్‌ వచ్చి రెండేండ్లు కావొస్తోందని, ఇప్పటికీ పోస్టులను భర్తీ చేయలేదని అభ్యర్థులు ఆరోపించారు. విద్యాశాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులకు అనేక వినతిపత్రాలు ఇచ్చినా స్పష్టమైన హామీరాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్టీ నియామకాలపై కేసులున్నాయని చెబుతున్న టీఎస్‌పీఎస్సీ.. వీటిని సాకుగా చూపించి కాలయాపన చేయడం సరికాదన్నారు. నోటిఫికేషన్‌ మీద ఒక్క స్టే కూడా లేదని, అయినా ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కేసులున్నా.. ఒకసారి ఎస్‌జీటీ ఫైనల్‌ రిజల్ట్స్‌ ఇచ్చారని, టీఆర్టీ నోటిఫికేషన్‌లోని స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్​జీటీ ఉర్దూ మీడియం పోస్టింగ్‌లు ఇచ్చారని, మరి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయని ప్రశ్నించారు. గతంలో ఎలక్షన్‌ కోడ్‌ ఉందని చెప్పారని, కానీ ఆ సమయంలోనే జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి, గురుకులాల పోస్టుల రిక్రూట్​మెంట్ పూర్తి చేశారని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం టీఆర్టీ రిక్రూట్​మెంట్ షెడ్యూల్‌ను రిలీజ్‌ చేయాలని, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అరెస్టు చేసిన టీఆర్‌టీ అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, చావ రవి, టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్‌, శ్రీనివాస్‌, టీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘునందన్‌, డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘుశంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

రేవంత్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య మద్దతు

అభ్యర్థుల ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. ఇక ప్రగతిభవన్‌ ఏరియాలో టీఆర్టీ అభ్యర్థుల ఆందోళనను చూసిన టీపీపీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి కారుదిగి అభ్యర్థుల వద్దకు వచ్చారు. వారితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు.

సమస్యకు త్వరలోనే పరిష్కారం: మంత్రి సబిత 

టీఆర్టీ అభ్యర్థుల ఆందోళనలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. టీఎస్‌పీఎస్సీ అధికారులతో చర్చించి స్పష్టత తీసుకున్నారు. ఎంపిక జాబితాలను త్వరలో విడుదల చేస్తామని, అందుకు చర్యలు కొనసాగిస్తున్నామని వారు మంత్రికి తెలిపారు. అంతకుముందు మంత్రి కేటీఆర్‌ కూడా స్పందించారు. త్వరలోనే  సమస్యను పరిష్కరించేందుకు టీఎస్‌పీఎస్సీ టీమ్‌ చర్యలు తీసుకుంటున్నట్టు కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తనకు చెప్పారని ఆయన ట్వీట్‌ చేశారు.

Latest Updates