ట్రూకాలర్ నుంచి డేటా లీక్!

truecaller-india-users-data-leak

ఓ సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌ వెల్లడి.. నిజం కాదన్న కంపెనీ

ఫేస్‌ బుక్‌ ‘యాక్షనబుల్‌‌ ఇన్‌ సైట్స్‌ ’ టూల్‌‌పైనా వార్తలు

ట్రూకాలర్‌ యాప్‌‌ వాడుతున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా యూజర్లున్న ఈ కాలర్‌‌ ఐడెంటిటీ యాప్‌‌లోని వినియోగదారుల డేటా అమ్మకానికి రెడీగా ఉందట. ప్రైవేట్‌‌ ఇంటర్నెట్‌‌ ప్లాట్‌‌ఫాంలో ఈ డేటాను అమ్మకానికి పెట్టారని ఇలాంటి లావాదేవీలపైనే కన్నేసి ఉంచే ఓ సైబర్‌‌ సెక్యూరిటీ నిపుణుడు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది యూజర్లున్న ఈ యాప్‌‌ డేటాను ఓ డార్క్‌‌ వెబ్‌‌లో రూ.1.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్మకానికి పెట్టారని ఆయన చెప్పారు. 14 కోట్ల మందిలో 60 నుంచి 70 శాతం ఇండియన్లే. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లోని లక్షలాది మంది సెలబ్రిటీలు, ముఖ్యమైన వ్యక్తుల వ్యక్తిగత సమాచారం బయటకొచ్చిందని వార్తలొచ్చిన కొద్దిరోజుల్లోనే ట్రూకాలర్‌‌ డేటా వార్త సంచలనం రేపుతోంది.

అలాంటిదేం లేదు: ట్రూకాలర్‌‌

ట్రూకాలర్‌‌ మాత్రం ఇలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ‘మా సర్వర్లలో స్టోర్‌‌ చేసిన డేటా చాలా సేఫ్‌‌గా ఉంటుంది. యూజర్ల ప్రైవసీ మా బాధ్యత. ఇలా డేటా మిస్‌‌యూజ్‌‌ జరగకుండా చర్యలు తీసుకుంటూనే ఉంటాం’ అని చెప్పింది. ‘యూజర్ల సెన్సిటివ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాదు. ముఖ్యంగా పేమెంట్‌‌ వివరాలు’ అని పేర్కొంది. యాప్‌‌ యూజర్లే అందులోని చాలావరకు డేటాను కాపీ చేస్తున్నారని (స్క్రాపింగ్‌‌) చెప్పింది. ఇలాంటి పనులు చేస్తున్న యూజర్ల అకౌంట్ల వివరాలపై నిఘా పెట్టామంది. ప్రస్తుతం యూజర్లకు రోజువారి సెర్చ్‌‌ లిమిట్‌‌ను సెట్‌‌ చేశామని వెల్లడించింది. యాప్‌‌ ప్రీమియం వర్షన్‌‌లో కొంత డబ్బు కడితే ఎంత మంది డేటానైనా సెర్చ్‌‌ చేసేసుకునే వెసులుబాటుంది. పైగా యూనిఫైడ్‌‌ పేమెంట్‌‌ ఇంటర్‌‌ఫేస్‌‌ ద్వారా ఇండియాలో పేమెంట్‌‌ సర్వీస్‌‌ను కూడా యాప్‌‌ ప్రారంభించింది. ట్రూకాలర్‌‌ డేటాబేస్‌‌పై దాడి చేసి చొరబడితేనే ఇలాంటిది సాధ్యమవుతుందని సైబర్‌‌ నిపుణులు అంటున్నారు. ‘ఇది ఒక్క ట్రూకాలర్‌‌ సమస్యే కాదు. ఆర్థిక సంస్థలు, ఇతర ఆర్గనైజేషన్లకు ఇలాంటి సమస్యలు రావొచ్చు. నివారణ చర్యలు తీసుకుంటూనే ఎప్పటికప్పుడు డార్క్‌‌వెబ్‌‌పై ఓ కన్నేసి ఉంచితే కస్టమర్ల డేటాను రక్షించగలుగుతారు’ అన్నారు.

ఫేస్‌‌బుక్‌‌ కూడా వాడేస్తోందా?

సోషల్‌‌ మీడియా దిగ్గజం ఫేస్‌‌బుక్‌‌ తన యూజర్ల డేటాను వాళ్లకు తెలియకుండానే, అనుమతి లేకుండానే 50కి పైగా దేశాల్లోని100 టెలికాం, ఫోన్‌‌ తయారీ కంపెనీలకు ఆఫర్‌‌ చేస్తోందని తెలిసింది. స్మార్ట్‌‌ఫోన్‌‌ వాడుతున్న యూజర్లే టార్గెట్​గా యాడ్స్‌‌ కోసం ఫేస్‌‌బుక్‌‌ ఈ ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. అంతే కాదు తన ఐవోఎస్‌‌, ఆండ్రాయిడ్‌‌, మెసెంజర్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌ యాప్‌‌ల నుంచి కూడా డేటా సేకరిస్తోందని, 13 ఏళ్ల చిన్న పిల్లల ఫోన్‌‌లలోకీ తొంగి చూస్తోందని ఓ నిపుణుడు చెప్పారు. ‘యాక్షనబుల్‌‌ ఇన్‌‌సైట్స్‌‌’ టూల్‌‌తో స్మార్ట్‌‌ఫోన్‌‌ టెక్నికల్‌‌ సమాచారం, ఫేస్‌‌బుక్‌‌ యూజర్లు వాడుతున్న సెల్యులార్‌‌, వైఫై నెట్‌‌వర్క్‌‌లు, యూజర్ల లొకేషన్లు, వాళ్ల సోషల్‌‌ గ్రూపులు, ఇష్టాలు లాంటి సమాచారాన్నంతా లాగేస్తోందన్నారు. ఆ వార్తలను ఫేస్‌‌బుక్‌‌ కొట్టిపారేసింది. యాడ్ల కోసం యూజర్ల క్రెడిట్​ స్కోర్లు  వాడుకోమని స్పష్టం చేసింది. పోటీ కంపెనీలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోడానికే తమ పార్ట్‌‌నర్లు సమాచారం యాక్సెస్‌‌ చేస్తారంది. ఫేస్‌‌బుక్‌‌ గతేడాదే యాక్షనబుల్‌‌ ఇన్‌‌సైట్స్‌‌ టూల్‌‌ను తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వీక్‌‌ డేటా కనెక్షన్ల సమస్యను పరిష్కరించడానికి దీన్ని తెచ్చింది.

Latest Updates