ఇండియా చాలా ఏళ్లుగా అమెరికాను దెబ్బకొడుతుంది

అదిరిపోయే డీల్ కుదురతదేమో!

సరైన ఒప్పందం అనుకుంటేనే ఓకే.. లేదంటే వెనక్కి..
ఎందుకంటే మాకు ‘అమెరికా ఫస్ట్’
ఇండియా తమపై భారీ టారీఫ్‌లు విధిస్తోందని ఆరోపణ

వాషింగ్టన్/న్యూఢిల్లీ/అహ్మదాబాద్: మూడు రోజుల్లో మన దేశానికి రానున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ట్రేడ్ డీల్ పై కీలక కామెంట్స్ చేశారు. రెండు దేశాలు కలిసి బ్రహ్మాండమైన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని అన్నారు. ‘‘మేం ఇండియాకు వెళ్తున్నాం. అక్కడ ట్రెమెండస్ డీల్ కుదుర్చుకుంటాం. అయితే మంచి ఒప్పందం కాకపోతే చర్చలు నెమ్మదించవచ్చు” అని కామెంట్ చేశారు. ఈనెల 24, 25 తేదీల్లో తన భార్య మెలానియాతో కలిసి ట్రంప్ ఇండియాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో లాస్ వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మంచి డీల్ అని భావిస్తేనే కుదుర్చుకుంటాం. ఎందుకంటే మాకు ‘అమెరికా ఫస్ట్’. ప్రజలు ఇష్టపడినా, ఇష్టపడకున్నా .. అమెరికానే మా తొలి ప్రాధాన్యం .. సరైన ఒప్పందం అని అనిపించకపోతే మేం నెమ్మదిస్తాం. (అమెరికా అధ్యక్ష) ఎన్నికల తర్వాత డీల్ చేసుకుంటాం. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని అన్నారు.

ఏళ్లుగా దెబ్బకొడుతున్నది ఇండియానే..
ట్రేడ్ విషయంలో ఇండియా చాలా ఏళ్లుగా భారీ టారీఫ్‌లతో అమెరికాను దెబ్బకొడుతోందని ట్రంప్ ఆరోపించారు. తన తొలి పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీతో వ్యాపారం గురించి మాట్లాడుతానని తెలిపారు. మోడీని తాను ఇష్టపడుతున్నానని చెప్పారు. కొలరాడోలో జరిగిన ‘కీప్ అమెరికా గ్రేట్’ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మేం కొంచెం వ్యాపారం గురించి మాట్లాడాల్సి ఉంది. అది మమ్మల్ని బాగా దెబ్బతీస్తోంది. వాళ్లు మాపై భారీ టారీఫ్‌లు విధిస్తారు. ప్రపంచంలో అత్యధిక టారీఫ్‌లు విధించే దేశాల్లో ఇండియా ఒకటి” అని ఆరోపించారు.

ప్రోగ్రామ్ మాత్రమే.. ప్రారంభోత్సవం కాదు..: జీసీఏ
24న మోతేరా స్టేడియంలో జరగనున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం.. కేవలం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం కోసమేనని, అదే స్టేడియం ప్రారంభోత్సవం కాదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) వెల్లడించింది . స్టేడియాన్ని తర్వాత ప్రారంభిస్తామని జీసీఏ వైస్ ప్రెసిడెంట్ నథ్వానీ తెలిపారు. మోతేరా క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ 1.10 లక్షలు. 1982లో 49000 సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన స్టేడియాన్ని కూల్చివేసి.. అదే ప్లేస్‌లో 700 కోట్ల ఖర్చుతో కొత్తదాన్ని నిర్మించారు.

‘సబర్మతి’లో ట్రంప్ విజిట్ వైట్ హౌజ్ ఇష్టం
సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ పర్యటిస్తారా లేదా అనేది వైట్ హౌజ్ నిర్ణయిస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. సబర్మతిలో ట్రంప్ పర్యటన ఉండదని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.

హేయ్.. మళ్లీ ఏసేసిండు!
నరం లేని నాలుక ఎన్ని మాటలైన మాట్లాడిస్తది.. ఎలాంటి మాటలైన మాట్లాడిస్తది.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇందుకు మినహాయింపేం కాదు.. అసలే నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేస్తుంటారాయన.. ముందు వెనుక ఆలోచించరు.. అచ్చం సీతయ్య లెక్క. ‘బాంబులేసి లేపేస్తా ’అంటరు.. మళ్లా వెంటనే ‘నేను శాంతి కోరుకుంట’ అంటరు.. తన స్టేట్‌మెంట్లతో మీడియాకు, నెటిజన్లకు కావాల్సినంత మేత వేస్తూనే ఉంటరు. ఈ మధ్యనే ట్రంప్ ఓ మాట అన్నరు.. ‘అహ్మదాబాద్‌లో నన్ను ఆహ్వానించేందుకు 70 లక్షల మంది వస్తరంట!! నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది ” అని కామెంట్ చేసిన్రు. ఈ మాటలకు అమెరికన్ల సంగతేమో కానీ.. మనోళ్లు మాత్రం నోరెళ్లబెట్టిన్రు! ఇగ అహ్మదాబాద్ జనాలైతే మాత్రం.. ‘అరె బై.. మన సిటీ జనం అంతా కలిపినా గంత మంది లేరు. ఇక స్వాగతం పలకనీకి ఎట్ల వస్తరు? మోడీ సారు తప్పు చెప్పిన్రా.. ట్రంప్ సారు తప్పుగ ఇన్నరా?” అని డౌటనుమానం పడిన్రు. ఇగ ఇంతలో అహ్మదాబాద్ అధికారులు క్లారిటీ ఇచ్చిన్రు. ‘ఓ లచ్చ మంది వస్తరు.. మహా అంటే ఇంకో యాబైవేలు జమ అయితరు’ అని చెప్పిన్రు. ఈ ముచ్చట ఇట్ల ఉండంగనే.. ట్రంప్ ఇంకో కామెంట్ చేసిన్రు. ఈసారి లెక్క పెంచిన్రు. ‘చల్ తీ.. 70 లచ్చల్ కాదు.. కోటి మంది వస్తరంట. దారి పొడవున స్వాగతం పలుకుతరంట’ అని సంబరపడుకుంట అన్నరు. ఇగ చూస్కో జనాలు.. ‘హేయ్.. ట్రంప్ మళ్లీ ఏసేశారు’ అంటూ ట్రోల్ చేస్తున్నరు. సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నరు. ‘లచ్చ మంది వస్తరని మేం చెప్తే.. ఈయన కోటి మంది అంటరేంది ?’ అని అధికారులు తలలుపట్టుకున్నరు. ఇంతేనా.. ట్రంప్ ఇంకొన్ని ఆణిముత్యాలు వదిలిన్రు.. ‘‘మొన్న ఈ మధ్యల ఫేస్‌బుక్ ఓనర్ మార్క్ జుకర్బర్గ్ కలిసిన్రు. ‘ఫేస్ బుక్‌ల నంబర్ వన్ మీరే సర్’ అన్నడు. మస్తుగ సంతోషమేసింది. మరి నంబర్ 2 ఎవరని అడిగిన. ‘ఇంకెవరు? ఇండియా ప్రధాని మోడీ’ అన్నడు” అని చెప్పిన్రు. అంతటితో ఆగకుండా.. ‘చల్ తీ ఇండియాలో జనం ఎక్కువ గదా.. గందుకే మోడీ రెండో ప్లేస్‌ల ఉన్నడు.. అయినా ఇండియాలో 150 కోట్ల మంది ఉన్నరు. అమెరికాలో 35 కోట్ల మంది ఉన్నరు.. మళ్ల మోడీనే నంబర్ వన్ ఉండాలె గదా. కానీ మేం ఎవళ్లకీ ఆ ప్లేస్ ఇయ్యంగా. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంకేదైనా సరే” అని ముగించిన్రు పెద్దాయన. వెంటనే సోషల్ మీడియాలో కామెంట్స్ షురువైనయ్. ‘మా దేశంల ఎక్కువ తక్కువ 130 కోట్ల మంది ఉన్నరు.. ఎగస్ర్టా 20 కోట్లు ఎక్కడినుంచి వచ్చిన్రు సారూ’ అని ప్రశ్నలు.. ‘ఫేస్‌బుక్‌ల మోడీ సారుకు 4.4 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నరు. ట్రంప్ కేమో 2.7 కోట్ల మంది ఉన్నరు. మరి నంబర్వన్ ఎవరు జుకర్ జీ?” అని అడుగుతున్నరు. ‘అబద్ధం చెబుతున్నది ట్రంపా, జుకర్బర్గా?’ అని డౌట్ పడుతున్నరు. ట్రంప్ సారు ఇండియాలోకి రాకముందే.. ఇంత జేసిన్రు. వచ్చినంక ఎంత జేస్తరు? ఇంటికి పోయినంక ఎంతజేస్తరో? ట్రంప్‌తో పెట్టుకుంటే మామాలుగ ఉండది మరి!!..

Latest Updates