ప్రెసిడెంట్‌ అయినంక ట్రంప్ ట్యాక్స్ ఎగ్గొట్టిండు

2016, 2017లో 750 డాలర్ల చొప్పుననే కట్టిండు

‘న్యూయార్క్ టైమ్స్’ కథనం

అది ఫేక్ న్యూస్ అన్న ట్రంప్

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఇన్​కం ట్యాక్స్ ఎగ్గొట్టారని న్యూయార్క్​ టైమ్స్ పత్రిక ఓ ఆర్టికల్​ ను ప్రచురించింది. వందలాది కంపెనీలకు ఓనర్ అయిన ట్రంప్​ ప్రెసిడెంట్​ అయిన ఏడాది(2016)లో ఫెడరల్​ గవర్నమెంట్​ కట్టిన పన్ను కేవలం 750 డాలర్లు(రూ.55 వేలు) మాత్రమేనని ఆరోపించింది. ఆ తర్వాత 2017లోనూ కేవలం 750 డాలర్ల చొప్పుననే ఇన్ కం ట్యాక్స్ కట్టారని ఆ పత్రిక తెలిపింది. ట్రంప్ అంతకుముందు పది, పదిహేనేళ్లలో కూడా పెద్దగా ఫెడరల్ ట్యాక్స్ లు కట్టలేదని, తాను సంపాదించిన డబ్బు కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయంటూ ఆయన ట్యాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించింది. వాస్తవానికి ట్రంప్ విదేశాల్లోని తన వ్యాపారాలు, సంస్థలకు సంబంధించి 2017లో పనామాలో 15,598 డాలర్లు (రూ. 11 లక్షలు), ఇండియాలో 1,45,400 డాలర్లు (రూ. కోటి), ఫిలిప్పీన్స్ లో 1,56,824 డాలర్ల (రూ. 1.15 కోట్లు) ట్యాక్స్ కట్టారని, అమెరికాలో మాత్రం 750 డాలర్లే కట్టారని పేర్కొంది. అమెరికా ప్రెసిడెంట్లు తమ వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు వెల్లడించాల్సిందేనని ఏ చట్టంలోనూ లేదు. అయినా ఇప్పటివరకు ట్రంప్ తప్ప మిగతా ప్రెసిడెంట్లు తమ ట్యాక్స్ రిటర్నులను రిలీజ్ చేశారు. ట్రంప్ రిటర్నులనూ బయటపెట్టాలంటూ కోర్టుల్లో దావాలు పడినా.. ట్రంప్ న్యాయ పోరాటం చేశారని న్యూయార్క్ టైమ్స్ వివరించింది.

ఆడిట్ తర్వాత.. రిటర్నులు బయటపెడతా: ట్రంప్

న్యూయార్క్ టైమ్స్ కథనం పూర్తిగా ఫేక్ న్యూస్ అని, అది వండి వార్చిన వార్త అని ట్రంప్ ఆదివారం ఖండించారు. గతంలోనూ ఆ పత్రిక ఇలాంటి స్టోరీలు రాసిందన్నారు. నాలుగేళ్ల క్రితం తనను ఇలాగే ప్రశ్నించి ఉంటే.. ఆ పత్రికను కోర్టుకు ఈడ్చి మాట్లాడేవాడినని మండిపడ్డారు. ‘‘నేను చాలా పెద్ద మొత్తంలో ఫెడరల్ ట్యాక్స్​లు, స్టేట్ ట్యాక్స్​లు కట్టాను. నా కంపెనీలన్నింటికీ కలిపి 108 పేజీల ట్యాక్స్ ఫైలింగ్స్ చేశా. వీటన్నింటిపై చాలా రోజుల నుంచి ఆడిట్ పెండింగ్​లో ఉంది. ఆడిట్ పూర్తి కాగానే ట్యాక్స్ రిటర్నులను బయటపెడతా. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్​లో కొందరు నా పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ అలాగే చేస్తోంది” అని ట్రంప్ వివరణనిచ్చారు.

Latest Updates