కరోనాతో పడిపోతున్న‌ ట్రంప్ గ్రాఫ్

జో బిడెన్ వైపే ఓటర్ల‌ మొగ్గు
నాలుగు  నెలల్లోనే సీన్ రివర్స్
కరోనాను సరిగా డీల్ చేయడం
లేదని ట్రంప్ పై వ్య‌తిరేక‌త‌

అమెరికాలో కరోనా ఎఫెక్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొంపముంచేలా ఉంది. ల‌క్ష‌ల‌ సంఖ్య‌లో కేసులు, వేలాది మరణాల కారణంగా ప్ర‌జ‌ల్లో క్ర‌మంగా ఆయనపై న‌మ్మ‌కం త‌గ్గుతుంది. ఇది నవంబర్ లో జరిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ క‌న్నా  కూడా వచ్చే ఎన్నిక‌ల్లో ఆయనపై పోటీ చేయనున్న డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బిడెన్ వైపు జనం మొగ్గు చూపుతున్నారు. తాజాగా ‘యూఎస్ ఏ టుడే సఫ్లోక్ యూనివర్సిటీ పోల్ ’ నిర్వ హించిన సర్వేలో అమెరికన్లు జో బిడెన్ కే జై కొట్టారు. ఆయనకు 42 శాతం మంది సపోర్ట్ చేయగా ట్రంప్ కు 38 శాతం మంది  ఓటేశారు. నాలుగు నెలల్లోనే సీన్ రివర్స్ అయ్యింది. గతేడాది డిసెంబర్ లో నిర్వ‌హించిన‌ నేషనల్ పోల్ లో జో బిడెన్ కన్నా మూడు పాయింట్లు ట్రంప్ ఆధిక్యం సాధించారు.

స్ట్రాంగ్ లీడర్లైతే కాదు

అమెరికన్లు ట్రంప్ ను గానీ జో బిడెన్ ను గానీ స్ట్రాంగ్ లీడర్లుగా భావించటం లేదు. బలమైన లీడర్ గా ఇద్ద‌రికి ఎంతమంది సపోర్ట్ చేస్తార‌ని సర్వే చేయగా ఎక్కువ‌ శాతం మంది వీళ్లు స్ట్రాంగ్ లీడర్లు కాదని తేల్చేశారు. ట్రంప్ స్ట్రాంగ్ లీడ‌ర్ అని 45 శాతం చెప్ప‌గా.. 52 శాతం మంది కాదని చెప్పారు . జో బిడెన్ కు సైతం 43 శాతం మంది బలమైన లీడర్ అని  చెప్ప‌గా .. 47 శాతం మంది బలహీనమైన లీడర్ అంటూ
ఓట్లు వేశారు. ఐతే పనులు ఎలా చేయాలో ఎవరికి బాగా తెలుసన్న సర్వేలో మాత్రం ట్రంప్ వైపు 51 శాతం మొగ్గు చూప‌గా…48 శాతం జో బిడెన్ కు సపోర్ట్ చేశారు. ‘ది రియల కిట్ యరాప్లిటికస్ ’ అనే మరో సంస్థ నిర్వ‌హించిన‌ పోల్ లోనూ ట్రంప్ కన్నా జో బిడెన్ 6.3 పాయింట్లు అధిక్యం సాధించారు.

ఎన్నిక‌లు వాయిదా వేసేది లేదు

నవంబర్ 3 న జరిగే అధ్య‌క్ష ఎన్నిక‌లను వాయిదా వేసేది లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. కరోనా కారణంగా ఎన్నిక‌లను వాయిదా వేయాలని ప్ర‌త్య‌ర్థి జో బిడెన్ కోరినప్ప‌టికీ ట్రంప్ మాత్రం షెడ్యూల్ ప్ర‌కారమే ఎన్నిక‌లు జరుగుతాయని చెప్పారు.

మరణాలు 70 వేలకు చేరొచ్చు

అమెరికాలో కరోనా మరణాలు 70 వేలకు చేరొచ్చ‌ని, కానీ వాస్త‌వ‌ అంచనాల కంటే ఇది చాలా తక్కువ‌ అని ట్రంప్ అన్నారు. అందుకే తనను ప్రెసిడెంట్ గా తిరిగి ఎన్నుకోవ‌డానికి ప్ర‌జలు పరిశీలిస్తారన్నారు. దేశం చాలా మంది పజలను కోల్పోయింద‌ని, కానీ నిజానికి 22 లక్ష‌ల‌ మంది చనిపోవచ్చ‌ని మొదట్లో
అంచనాలు ఉన్నాయ‌న్నారు. తాము తీసుకున్న మంచి నిర్ణ‌యాలతోనే అదుపులోకి వచ్చింద‌న్నారు.

ఎకానమీ పుంజుకుంటది..

అమెరికాలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తుండ‌టం, వ్యాపారాలు మళ్లీ ప్రారంభం అవుతుండటంతో ఈ ఏడాది నాలుగో క్వార్ట‌ర్ లో ఎకానమీ పుంజుకుంటుందని ట్రంప్ చెప్పారు. వచ్చే ఏడాది ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ అద్భుత‌మైన గ్రోత్ రేట్ నమోదు చేస్తుంద‌న్నారు.

చైనాపై సీరియస్

కరోనా వైరస్ వ్యాప్తిలో చైనా పాత్రపై సీరియస్ గా ఇన్వెస్టిగేష‌న్ చేస్తున్నామ‌ని ట్రంప్ చెప్పారు. ఈ విపత్తుకు చైనా నిర్ల‌క్ష్య‌మే కారణమని భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దీని వల్ల‌ తాము చాలా నష్ట‌పోయామని, చైనా నుంచి భారీగా పరిహారాన్ని వసూలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. జర్మ‌నీ ఇప్ప‌టికే 130 బిలియన్ డాలర్ల‌ పరిహారం ఇవ్వాల‌ని చైనాను డిమాండ్ చేసింది. జర్మ‌నీ కన్నా ఎక్కువ‌ అడుగుతామని ట్రంప్ చెప్పారు.

Latest Updates