ఇయ్యాల్నే వస్తుండు ట్రంపన్న

  • వాషింగ్టన్ నుంచి బైలెల్లిన
    అమెరికా పెద్దసారు డొనాల్డ్ ట్రంప్
  • స్వాగతం పలికేందుకు అహ్మదాబాద్​ వెళ్లిన మోడీ
  • సబర్మతి నుంచి నేరుగా ‘నమస్తే ట్రంప్​’ ప్రోగ్రాంకు
  • సాయంత్రం మెలానియాతో తాజ్​మహల్ సందర్శన
  • మర్నాడు ఢిల్లీలో మోడీ, ట్రంప్ చర్చలు
  • హైఫై ఏర్పాట్లు చేసిన సర్కారు ఆఫీసర్లు
  • ఐటీసీ మౌర్య హోటల్​లో బస

ఇంటామె, బిడ్డ, అల్లుడు, పెద్దాఫీసర్లను వెంటబెట్టుకుని ప్రపంచ పెద్దన్న ట్రంప్ వస్తుండు. ఆదివారం మాపటేల ఎయిర్ ‘బస్సు’ ఎక్కి అమెరికాల బైలెల్లిండు. సోమవారం పొద్దుగాల్నే ఇండియాల ల్యాండ్ అయితడు. వెల్కమ్ పలికేందుకు మన మోడీ సారు కూడ దోస్త్ మేరా దోస్త్ అనుకుంట అహ్మదాబాద్ పోయిండు.. రెండు దినాలు ట్రంపన్న  ఇక్కడ్నే ఉంటడు.. ‘నమస్తే ట్రంప్’ ప్రోగ్రామ్​ల మాట్లాడుతడు.. సబర్మతికి పోతడు.. తాజ్​మహల్ చూస్తడు.. గాంధీజీకి మొక్కుతడు.. మోడీ సారుతోని ముచ్చట్లు పెడ్తడు.. మనతో రిలేషన్ పెంచుకోనీకి కోషిష్ చేస్తడు.. చివరాఖర్ల ప్రెసిడెంటు రామ్​నాథ్​ కోవింద్ ఇచ్చే దావత్ కి పోతడు.. ట్రంప్ సారు టూర్ కోసం సర్కారు ఆఫీసర్లు ఏర్పాట్లు మస్తుగ చేసిన్రు. ఇంద్ర భవనం అసొంటి హోటల్​ను రెడీ చేసిన్రు. ఢిల్లీ, ఆగ్రా, అహ్మదాబాద్​ల టైట్ సెక్యూరిటీ పెట్టిన్రు. పర్మిషన్ లేకుండ చీమ కూడ పోకుండా పోలీసోళ్లు పహారా కాస్తున్రు..

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రాకకు వేళ అయింది. సోమవారం తొలిసారిగా ఆయన మన దేశంలో అడుగుపెట్టనున్నారు. రెండు రోజుల పర్యటన కోసం వస్తున్న ట్రంప్.. 36 గంటలపాటు వివిధ కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు. అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీలో పర్యటించనున్నారు. డిఫెన్స్, స్ర్టాటజిక్ సంబంధాలపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు. బైలేటరల్, రీజనల్ ఇష్యూస్, ట్రేడ్, ఇన్వెస్ట్​మెంట్, డిఫె న్స్, సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, ఎనర్జీ సెక్యూరిటీ, రిలీజియస్ ఫ్రీడమ్, ఇండో–పసిఫిక్ రీజియన్​లో పరిస్థితులపై డిస్కస్ చేయనున్నారు. ఆదివారం రాత్రి ఎయిర్‌‌‌‌ఫోర్స్ వన్‌‌‌‌లో భార్య మెలానియా, కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్‌‌‌‌ కుష్నర్‌‌‌‌లతో ట్రంప్‌‌‌‌ బయలుదేరారు.

పోలీసు పహారాలో ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీ సెక్యూరిటీ సిబ్బంది పహారాలో ఉంది. ట్రంప్ దంపతులు బస చేసే ఐటీసీ మౌర్య వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. యూఎస్ సీక్రెట్ సర్వీసుతో కలిసి సెక్యూరిటీ ఏజెన్సీలు బందోబస్తు ఏర్పాటు చేశాయి. ఎన్ఎస్​జీకి చెందిన యాంటీ-డ్రోన్ డిటాచ్మెంట్ టీమ్స్, స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, గాలిపటాల క్యాచర్లు, క్యానన్ యూనిట్లు, ఎత్తైన భవనాలపై షార్ప్ షూటర్లను మోహరించారు. సెక్యూరిటీ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఆరు జిల్లాల పోలీసులు, 40 కంపెనీల సీఆర్పీఎఫ్ జవాన్లు యాక్షన్​లోకి దిగారు. ఐటీసీ మౌర్య చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించేందుకు నైట్ విజన్​తో కూడిన హై డెఫినెషన్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఇండియా రోడ్ షో

అహ్మదాబాద్ ఎయిర్​పోర్ట్ నుంచి మోతేరా స్టేడియం వరకు జరిగే రోడ్​షోలో 28 స్టేజ్​లను సెట్ చేశారు. దేశంలోని 28 ప్రాంతాలను రెప్రెజెంట్ చేసేలా ఈ ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్టిస్టులను రప్పించి.. ఆయా ప్రాంతాల్లో పెయింటింగ్స్ వేయించారు. అందుకే దీన్ని ‘ఇండియా రోడ్ షో’ అని పిలుస్తున్నారు. మోతేరా స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్​కు కనీసం లక్షమంది హాజరవుతారు.

ఏర్పాట్లకు ఫైనల్ టచ్..

అహ్మదాబాద్​లో ఎయిర్​పోర్టు నుంచి 22 కిలోమీటర్ల మేర రోడ్ షో జరగనున్న నేపథ్యంలో అధికారులు పనులు పూర్తి చేస్తున్నారు. ‘‘హల్లో అహ్మదాబాద్… రండి.. మెగా రోడ్​షోలో భాగం కండి. మన సంస్కృతిని, డైవర్సిటీని ప్రపంచానికి చూపిద్దాం రండి” అని అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా ట్వీట్ చేశారు. మరోవైపు ట్రంప్ వస్తారా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేకున్నా తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సబర్మతి ఆశ్రమం సభ్యులు చెప్పారు.

ఎంట్రీ గేట్ కూలిపోయింది..

నమస్తే ట్రంప్ ప్రోగ్రామే పూర్తి కాలేదు… కానీ మోతేరా స్టేడియం ఎంట్రీ గేట్ కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆదివారం ఉదయం భారీగాలులు వీయడంతో కొత్తగా కట్టిన గోడ పడిపోయిందని అధికారులు చెప్పారు.

ట్రంప్…ఇండియాకు బెస్ట్ ఫ్రెండ్

గత అమెరికా ప్రెసిడెంట్లతో పోలిస్తే డొనాల్డ్ ట్రంప్.. ఇండియాకు బెస్ట్ ఫ్రెండ్ అని ‘ట్రంప్ 2020 ప్రెసిడెన్షయల్ క్యాంపెయిన్’ ఆఫీసర్ ఒకరు చెప్పారు.

Latest Updates